వయోవృద్దుల సంక్షేమం భద్రతే ప్రభుత్వ లక్ష్యం !

👉 తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ మరియు పర్యవేక్షణ బిల్లు, 2026 ఆమోదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR ,

వయోవృద్దుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక మరియు నైతిక బాధ్యత అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, వారికి ఆర్థిక భద్రత మరియు గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు  బిల్లు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. వయోవృద్దుల సంక్షేమం, భద్రత మరియు గౌరవప్రదమైన జీవనాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం “తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ మరియు పర్యవేక్షణ బిల్లు, 2026” ను ప్రవేశపెట్టినట్లు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో బుధవారం వయోవృద్దులతో సమావేశ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వయోవృద్దుల శాఖ డైరెక్టర్ శైలజ, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….


రాష్ట్రంలోని ఉద్యోగులు తమ వయోవృద్దుల సంరక్షణకు బాధ్యతగా తీసుకోవాలని, తల్లిదండ్రుల ఆర్థిక మరియు వైద్య అవసరాలను తీర్చేందుకు ఉద్యోగులు తమ వేతనం నుండి కనీసం 15 శాతం లేదా ₹10,000 (ఏది ఎక్కువైతే అది) మొత్తాన్ని కేటాయించి, నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

👉 ఈ బిల్లు అమలును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రతి శాఖలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు ఇందులో భాగస్వాములై పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని మంత్రి తెలిపారు.


👉 తల్లిదండ్రుల సంరక్షణలో నిర్లక్ష్యం చూపిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రయివేట్ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకునేలా బిల్లు నిబంధనలు రూపొందించబడినట్లు  తెలిపారు. ఈ క్రమంలో ఫిర్యాదులను స్వీకరించి 60 రోజుల లోపు పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


👉 అప్పీల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి, కమిటీలకు క్వాసి-జ్యుడీషియల్ అధికారాలు కల్పించనున్నట్లు తెలిపారు. బయోలాజికల్ మరియు దత్తత తల్లిదండ్రులు, వృద్ధాప్య కారణంగా ఆధారపడే తల్లిదండ్రులు ఈ బిల్లులో అర్హులుగా పేర్కొన్నారు.


👉 ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 41, సీఆర్పీసీ సెక్షన్ 125 మరియు సీనియర్ సిటిజన్స్ చట్టం, 2007 నిబంధనల ప్రకారం రూపొందించబడినట్లు తెలిపారు.


👉 ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో వృద్ధుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసి, కుటుంబ బాధ్యతలను చట్టబద్ధంగా అమలు చేయడం ప్రధాన ఉద్దేశ్యమని  పేర్కొన్నారు.


👉 ఈ బిల్లుతో ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో పని చేసే  ఉద్యోగులు మరియు ప్రజా ప్రతినిధులు తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం పెరుగుతుందని, కుటుంబ విలువలను కాపాడటానికి ఇది దోహదపడుతుందని మంత్రి వివరించారు.


👉 తల్లిదండ్రుల సంరక్షణలో నిర్లక్ష్యం వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా బలమైన నిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపారు.


👉 ప్రతి శాఖలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు.


👉 ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఈ బిల్లును సమర్థవంతంగా అమలు చేయాలని, వృద్ధుల సంక్షేమానికి అందరూ కలిసి కృషి చేయాలని కోరారు.


👉 ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో వృద్ధుల సంక్షేమం మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వయోవృద్దుల కొరకు దేశంలోనే మొట్ట మొదటి సారిగా పూర్తిస్థాయిలో పటిష్టమైన బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదం తెలిపేలా కృషి చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వయోవృద్దుల భవనానికి కావాల్సిన వసతులు కల్పిస్తామని తెలిపారు.

👉 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ…

.వయోవృద్దుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు సమాజానికి ఎంతో అవసరమైనదని పేర్కొన్నారు. ఆధునిక జీవనశైలిలో కుటుంబ బంధాలు కొంతవరకు తగ్గుతున్న నేపథ్యంలో, తల్లిదండ్రుల పట్ల బాధ్యతను గుర్తుచేసేలా ఈ చట్టం మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.

ఉద్యోగులు తమ తల్లిదండ్రుల ఆర్థిక, ఆరోగ్య అవసరాలను తీర్చడం ద్వారా కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ బిల్లులో పొందుపరిచిన నిబంధనలు వృద్ధుల భద్రతను పెంపొందించడంతో పాటు, వారికి గౌరవప్రదమైన జీవనం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

వయోవృద్దుల కొరకు ఏర్పాటు చేసిన సదన్ భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని మంజురు చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…

వయోవృద్దుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బిల్లును సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు.

బిల్లులో పేర్కొన్న నిబంధనల మేరకు ప్రతి శాఖలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, తల్లిదండ్రుల సంరక్షణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని అన్నారు. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా స్వీకరించి, 60 రోజులలోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తల్లిదండ్రుల సంరక్షణలో నిర్లక్ష్యం చూపే ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు.

అదేవిధంగా, అర్హులైన వృద్ధులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవలు, పథకాల గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.


అంతకు ముందు కార్యక్రమం ప్రారంభంలో ఈ బిల్లు యొక్క ఉద్దేశాల గురించి వయోవృద్ధుల శాఖ  డైరెక్టర్ శైలజ వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రత్యేక చొరవతో “తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ మరియు పర్యవేక్షణ బిల్లు, 2026”ను ప్రవేశ పెట్టినందుకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు గజమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సీనియర్ సిటిజన్స్ పత్రిక పిలుపు గోడ పత్రికను ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.