ధర్మపురి నాట్యమండలి కి 85 ఏళ్లు !

” ఓ నాట్యమండలి కి 85 ఏళ్లు నిండడం, నాలుగు తరాల నటులు నాటక సేవ చరిత్ర గతిలో కొనసాగడం అబ్బుర పరచడంతో పాటు , అపురూపమైందే. గోదావరి నది తీరంలో గల ప్రసిద్ధ ధర్మపురి పుణ్యక్షేత్రం లో ఆవిర్భవించిన నాట్యమండలి తెలంగాణా లో మొదటిది. తెలుగు భాషకు విలువ లేని నైజాం ప్రభుత్వం లో. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇవ్వని నాటి బ్రిటిష్ (కేంద్ర) ప్రభుత్వాల కాలం లో 1936 సంవత్సరంలో పురుడు పోసుకుని వటవృక్షంగా నేటికీ కొనసాగుతున్న ధర్మపురి నాట్యమండలి ప్రస్థానం ఇది.

నాట్య మండలి ఆవిర్భావం తీరు !!

జాగీర్ ఈనామ్ మక్త ( అగ్రహారం ) గా పేరుగాంచిన ధర్మపురి క్షేత్రం లోని జాగీర్ దార్లు, వారి మిత్రులు జాగీర్ పనులపై, హైదరాబాదుకు వెళ్తుండేవారు. అక్కడ ప్రసిద్ధ కంపెనీల నాటక ప్రదర్శనలు తిలకించేవారు. కాసర్ల వెంకట్ రాజయ్య, రాపాక రామకృష్ణయ్య, పెద్దమ్మ బట్ల నరహరి ,పాత కాంతయ్య, ఇందారపు చిన్న రామకృష్ణయ్య, ఓ నాటక ప్రదర్శన అక్కడ అ తిలకించి ,వారు తాము ఒక నాటక మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే సందర్భంలో మైలవరం కు చెందిన నరసమ్మ నాటక కంపెనీ శాఖ ధర్మపురిలో నాటకాలు ప్రదర్శించింది ఆ నాటకాన్ని తిలకించిన వారిలో కొందరు జగ్గన్న గారి విశ్వనాథం, కజ్జాల శివరామయ్య, విట్టాల రామన్న, కాకరి లక్ష్మీ కాంత శాస్త్రి, రొట్టె చంద్రశేఖరశాస్త్రి నటులుగా “సతీ సావిత్రి” నాటకాన్ని ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. కాసర్ల వెంకట రాజయ్య సారథ్యంలో ” శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి” గా ఆవిర్భవించింది. మొదటి నాటకం 12 జూన్ 1938 న ” సతీ సావిత్రి ” నాటక ప్రదర్శన ఈ నాట్య మండలి ద్వారా ప్రదర్శించారు.

మొదటి నాటకం తర్వాత నెల రోజులకు ద్రౌపతి వస్త్రాపహరణం, నాటకం ప్రదర్శించారు. మరో నెల రోజుల తర్వాత భక్త ప్రహల్లాద, మూడవ నాటకం. నాలుగవ నాటకం గయోపాఖ్యానం తరువాత వరుసగా భక్త రామదాసు, సతీ సక్కుబాయి, సతీ తులసి, రాయబారం, తులాభారం, లవకుశ తదితర నాటకాలు క్రమం తప్పకుండా ప్రదర్శించేవారు.