J.Surender Kumar,
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ, బండి సంజయ్ సారథ్యం లోనే ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలు నిర్వహించాలని, సీనియర్ లీడర్లు, సిన్సియర్ లీడర్లు, అనే అంశం పై చర్చించాల్సిన అవసరం లేదు అని, ఆ పార్టీ జాతీయ నాయకత్వం కొందరు లీడర్లకు సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మార్చి 21,22 తేదీలలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ నాయకులు పార్టీ తీరుతెన్నులపై చర్చించినట్లు సమాచారం.

“సంజయ్ బండి సారధ్యంలోనే లీడర్లు, క్యాడర్ కార్యక్రమాలు చేపట్టాలని” ఏకవాక్య తీర్మానం చేసినట్లు తెలిసింది. కొందరు సీనియర్ నాయకులు కొన్ని రోజుల క్రితం కరీంనగర్, హైదరాబాదులో రెండు మూడు సార్లు రహస్య సమావేశమై, బండి సంజయ్ తీరు గురించి, ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని, పార్టీ కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి కొనసాగిన తమను గుర్తించడం లేదని, సంజయ్ ఒంటెత్తు పోకడలు, తదితర అంశాలపై వారు చర్చలు జరిపినట్టు ప్రసార మాధ్యమాల్లో కనిపించిన వినిపించిన విషయం తెలిసిందే.

ఈ సమావేశం పై సీనియర్ లీడర్ ను పార్టీ అధిష్టానం నియమించి వారితో చర్చించి నివేదికలు కోరిన ఉదంతాలు జగమెరిగిన సత్యం. ఇలాంటి సమావేశాల అంశం శృతిమించడంతో కేంద్ర నాయకత్వమే నేరుగా రంగంలోకి దిగి కొందరిని ఢిల్లీకి పిలిపించి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. సీనియర్ లీడర్లు, సిన్సియర్ లీడర్లు పాత , కొత్తవారు అనే అంశం పార్టీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోదు అనీ వారికి వివరించినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి అంశాలపై చర్చించాల్సిన అవసరం లేదు, వారి వివరణలు అవసరం లేదని, వారి ఇష్టం వారిది, పని తీరుతోనే పదవులు, ప్రాధాన్యత, ఉంటుందని ప్రజాక్షేత్రంలో ఎవరు ఎలాంటి పాత్ర నిర్వహిస్తున్నారు అనేది అధిష్టానానికి అనుక్షణం నివేదికలు అందుతున్నాయని, వారికి జాతీయ నాయకత్వం వివరించినట్టు తెలిసింది.

దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి రానున్న రాష్ట్రం తెలంగాణ మొదటిదని వారికి వివరించినట్లు సమాచారం. ప్రజాబలం, క్లీన్ చిట్ ఉన్న వివిధ రాజకీయ పార్టీలలోనీ లీడర్లతో సంప్రదింపుల కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఆ దిశగా కార్యాచరణ ప్రణాళిక అమలు జరుగుతున్నదని హైకమాండ్ వీరికి వివరించినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో గత రెండు మూడు రోజుల క్రితం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి B.L సంతోష్ , పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గల ఇన్చార్జి లతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ , మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు, జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తమిళనాడు ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, ఈటెల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు , విజయశాంతి లతో చర్చించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ స్థితిగతులు, చేపడుతున్న కార్యక్రమాలు, 19 ఎస్ సి, 12 ఎస్ టి అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ అమలు పరుస్తున్న రూట్ మ్యాప్ ,తదితర వివరాలను నివేదిక రూపంలో సేకరించినట్టు సమాచారం. ప్రస్తుత తరుణంలో బండి సంజయ్ సారథ్యంలోనే ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష పోరాటాలకు లీడర్లు, క్యాడర్, కార్యకర్తల అనుక్షణం అప్రమత్తం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూప కల్పనకు పార్టీ హైకమాండ్ కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.