కెసిఆర్ నేషనల్ లుక్ కోసం ఐప్యాక్

టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ రాజకీయ మనుగడకు సర్వే లు అవసరమా ? సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి కూడా.. ప్రశాంత్ కిషోర్ సర్వేలు దోహదపడుతాయా.. ? రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి పీకే సర్వేలవసరం లేకున్నప్పటికీ… జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం కోసమే పీకేనా…? ఇప్పుడిదీ చర్చ!దేశంలో ట్రెండింగ్ లో ఉన్న రాజకీయ వ్యూహకర్త, ప్రముఖ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ (పీకే) దాదాపు పది నెలల క్రితమే ఎన్నికల సర్వేలకు స్వస్తి అంటూ స్వయంగా ప్రకటించడం జగమెరిగిన సత్యం. కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో పీకే బృందం టీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నదని… అందులో భాగంగా సర్వేలు చేస్తోందని ప్రసార మాధ్యమాల్లో, ఆ పార్టీకే చెందిన కొందరు శాసనసభ్యులూ మాట్లాడుతుండటం మరోవైపు కనిపిస్తోంది. అయితే ఇది రాజకీయ ఎత్తుగడా…? అందుకే పీకే సర్వే పేరిట లీకులిస్తున్నారా ? అన్నదీ మరో చర్చ!

కెసిఆర్ కు, తెలంగాణ కొట్టిన పిండి !!తెలంగాణ ఉద్యమ రాజకీయ ప్రస్థానం నుంచీ మొదలై.. ఇప్పటికీ కేసీఆర్ మౌనంగా ఉన్నా వార్తే! మాట్లాడినా వార్తే!! ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కూడా కొందరికి వారి, వారి నియోజకవర్గ సమస్యల పట్ల ఎంత సంపూర్ణ అవగాహన ఉంటుందో తెలియదుగానీ… సీఎం కేసీఆర్ కు మాత్రం తెలంగాణా ఉమ్మడి పది జిల్లాల్లోని మండలాలు, అక్కడి గ్రామాలు, ఆ ప్రాంతానికి చెందిన వాగులు, కుంటలు, గుట్టలు, అడవులు, పంటల సాగు, ప్రజల జీవన విధానం, పండుగల తీరుతెన్నులు, ఆయా ప్రాంతాలా యాస ,భాష భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులన్నింటిపైనా.. ఒక ప్రస్ఫుటమైన అవగాహన ఉండటమే ఆయన్ను, నల్గురిలో ఒకేఒక్కడిగా ప్రత్యేకంగా నిలబెట్టిన సలక్షణం. అయితే అదేమంతా సులువుగా ఆయనకు దక్కలేదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పుష్కర కాలం పాటు, అవగాహన చేసుకునేందుకు పడ్డ కష్టముంది దాని వెనుక. అందుకే ఏ ఊరు గురించైనా, ఏ ప్రాంతం గురించైనా.. ఎక్కడి సామాజిక, ఆర్థిక స్థితిగతులనైనా అలవోకగా చెప్పగలడు. అంతేకాదు.. రాజకీయ యుద్ధతంత్రంలో ఎవరికి మొక్కాలో.. ఎవరిని తొక్కాలో బాగా తెలిసిన వ్యూహరచన కేసీఆర్ సొంతం. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా ఇంతటి అవగాహన కలిగి ఉండరంటే ఆయన్ను అతిగా పొగుడ్తున్నట్టనిపిస్తుందేమోగానీ… కెసిఆర్ కు తెలంగాణ కొట్టిన పిండి.. ఇది అక్షర సత్యం! అలాంటి అవగాహన, అనుభవం రంగరించిన కేసీఆర్.. తన గులాబీపార్టీని, తిరిగి మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి, ప్రశాంత్ కిషోర్ సర్వేలు, సలహాలను కోరుతారా…? ఇదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు, మేధావులతో పాటు… కేసీఆర్ శైలిని ఉద్యమకాలం నుంచీ గమనిస్తున్న సగటు తెలంగాణా పౌరుడిలోనూ ఉద్భవిస్తున్న ఓ మౌలికమైన ప్రశ్న..? ఎవరి ప్రశాంత్ కిషోర్ ?బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్, ప్రస్తుతం దేశంలో ట్రెండింగ్ లో కొనసాగుతున్న రాజకీయ వ్యూహకర్త. రాజకీయ ఎత్తులు, చిత్తులు రచించడంలో… ఆయన స్నేహితుడు రాబిన్ శర్మ, ఆయన దగ్గరే పనిచేసిన సునీల్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నప్పటికీ… ప్రతిపక్ష క్యాంపులకు వారు పనిచేస్తున్నప్పటికీ… పీకే పేరే రాజకీయ వ్యూహకర్తగా ఇప్పటికైతే పాప్యులర్ నేమ్! ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని, తిరిగి గుజరాత్ సీఎం చేయడం కోసం 2011లో పీకే వ్యూహాలు ఫలించిన చరిత్ర తెలిసిందే! 2014 లో జనరల్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని ప్రధానిగా ప్రొజెక్ట్ చేయడంలోనూ ఐప్యాక్ గా పిల్చుకునే ఆయన బృందం ఇండియన్ పొల్టికల్ యాక్షన్ కమిటీ లక్ష్యాన్ని సాధించిన సంగతీ విదితమే!! 2015లో బీహార్ లో జేడీయూ వెనుకా.. 2017లో పంజాబ్ లో కాంగ్రెస్ వెనుకా.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ వెనుకా.. 2020 ఢిల్లీలో ఆప్ వెనుకా.. 2021 పశ్చిమబెంగాల్లో తృణ మూల్ కాంగ్రెస్ వెనుకా.. 2021లో తమిళనాడులో డీఎంకే వెనుకా.. ప్రభుత్వాలేర్పాటు చేయడంలో ఐప్యాక్ ది కీలక భూమిక! ఆయా పార్టీలతో కుదిరిన ఒప్పందాల మేరకు… కొన్ని పార్టీలను చాలా ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడంలో పీకే టీమ్ కృతకృత్యులై ఉండొచ్చుగాక! కానీ, 2017 లో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో మాత్రం ఐప్యాక్ బొక్కబోర్లాపడింది. కాంగ్రెస్ పార్టీకి పీకే ఐప్యాక్ సర్వేలేమాత్రం ఉపయోగపడలేదు సరికదా.. బీజేపికి 300 స్థానాలను అక్కడి ప్రజలు కట్టబెడితే… కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ స్థానాలు కూడా దాటని ,దక్కని ఓటమి చరిత్రా ఐప్యాక్ దేనన్నది గమనించాల్సిన మరో ప్రధానాంశం! తమ ఐప్యాక్ పక్షాన సర్వే చేస్తే.. తాము ఏ పార్టీకైతే వ్యూహకర్తలుగా ఉంటామో.. ఆ పార్టీలు అధికారం హస్తగతం చేసుకోవడం తథ్యమంటూ, ప్రశాంత్ కిషోర్ అనేక సందర్భాల్లో బహిరంగంగా … ప్రసార మాధ్యమాల ద్వారా ఢంకా భజాయించిన సంగతీ ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే!! అయితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పక్షాన తాము సర్వే చేస్తున్నామని, నేటి వరకూ కూడా ఐప్యాక్ ఎక్కడా ప్రకటించలేదు. 2014 జనరల్ ఎన్నికల్లో మోడీ గురించి.. చాయ్ పై చర్చ, త్రీడీ ర్యాలీలు, రన్ ఫర్ యూనిటీ, సోషల్ మీడియాలో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ వంటి పలు రకాల ఎత్తుగడలను ప్రదర్శించిన ఐప్యాక్… 2017 లో వైసీపీని అధికారంలోకి తేవడం కోసం… సమర శంఖారావం, అన్న పిలుపునివ్వడం… ప్రజాసంకల్పయాత్ర, తదితర పేర్లతో సభలు-సమావేశాలు ఊరేగింపులు నిర్వహించమూ మనమెరిగిందే! సర్వే నుంచి తప్పుకుంటానన్న ప్రశాంత్ కిషోర్ !పశ్చిమ బెంగాల్ లో మమతాబెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఎందుకో ప్రశాంత్ కిషోర్ తను ఇకపై ఐప్యాక్ తరపున రాజకీయ పార్టీలకు పనిచేయడానికి విముఖత వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తాను చేసిన సర్వేలు, రాజకీయ పార్టీల కోసం చేసిన వ్యూహరచన చాలంటూ… ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీకి (NDTV) 2021, మే 2న శ్రీనివాసన్ జైన్ అనే ప్రెజెంటర్, టీవీ జర్నలిస్ట్ తో ప్రత్యక్ష ప్రసారంలో చెప్పుకొచ్చారు కూడా! హుజురాబాద్ ఫలితాలతో ఉలిక్కి పడ్డారు !!దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపిన హుజురాబాద్ ఎన్నికల ఫలితాలతో అధికార టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంలో తెలియని ఆందోళన మొదలైంది. తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సామ, దాన, భేద, దండోపాయాలతో పాటు.. రాష్ట్ర యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, అనేక సర్వే సంస్థలు ,నిఘా వ్యవస్థలు అంతా కలిసి గడపగడపకూ తిరిగినా.. ఫలితాలు మాత్రం ప్రతికూలంగా రావడంతో… ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ సర్వేలు పనిచేస్తాయా ? అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులతో పాటు… ఏకంగా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల్లోనే నెలకొన్న పరిస్థితి! ఐప్యాక్ సర్వే ఇలా.. 2014 జనరల్ ఎన్నికల్లో ఆ సంస్థకు చెందిన కేవలం పది మందిలోపు ఉద్యోగులు తెలంగాణ, ఏపీలో సర్వే నివేదికలు ప్రతిరోజు ప్రశాంత్ కిషోర్ కు అప్పగించే వారని సమాచారం. దాదాపు వందమంది ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ భావజాలం గల ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా ఓ బృందంగా ఏర్పడి.. సోషల్ మీడియాలో, ప్రసార సాధనాల్లో, మార్కెటింగ్, ప్రచారం చేస్తూ ప్రశాంత్ కిషోర్ కు చేరవేసేవారనీ సమాచారం. నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం మహోత్సవ సందర్భంగా ” ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐటీ బృంద నాయకుడిని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆహ్వానించి… అప్పటి బీజేపి పార్టీ అధ్యక్షుడి హోదాలో, నేటి హోంశాఖా మంత్రి అమిత్ షా, మోడీలు ప్రత్యేకంగా అభినందించారు కూడా! ” మౌనంగా ఉన్నా.. మాట్లాడినా .. మాటల తూటాలు.! హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ కొంతకాలం పాటు మౌనంగా ఉన్నారు. ఆయన మౌనం వెనుక మర్మమేంటా ? అన్న చర్చా.. ప్రతిపక్ష రాజకీయ నాయకులు, విశ్లేషకుల్లో విస్తృతంగా జరిగింది. అయితే పార్లమెంట్ బడ్జెట్ తర్వాత.. ప్రగతి భవన్ లో ఆయన ప్రెస్ మీట్ మాటల తూటాలతో బిజెపి పార్టీ వ్యతిరేకించిన వారినీ, ఇతరులు సైతం మంత్రముగ్ధులను చేసిందని చెప్పుకోవాల్సిందే. రాఫెల్ యుద్ధ విమానాల, కొనుగోళ్లలో అవినీతి నుంచి మొదలుకుంటే నదుల అనుసంధానం, మీదుగా… ఏకంగా రాజ్యాంగాన్నే మార్చాలంటూ, ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం తెలంగాణా రాష్ట్రానికే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా చర్చకు తెరతీశాయి. ఇకపై జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని మరోమారు కేసీఆర్ నొక్కివక్కాణించాడో, లేదో… మరోవైపు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్, తదితర రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి… వేడుకలు జరుపడం, కేకులు కట్ చేయడం.. ఏకంగా నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ తో పాటు… ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ పరిధిలోనూ… కేసీఆర్ ఫ్లెక్సీలు కనిపించడం.. అందులో ” దేశ్ కీ నేత.. కేసీఆర్ ” అంటూ నినాదాలుండటం.. పశ్చిమబెంగాల్ తో పాటు, ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఇంగ్లీష్ , ప్రాంతీయ దినపత్రికల్లోనూ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటనలు జారీ చేయడం వెనుక మొత్తంగా పీకే టీం సలహాలు, వ్యూహాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికితోడు మార్చి 3న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో మోడీని వ్యతిరేకించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో నిన్న ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన లంచ్ సమావేశం.. మాజీ ప్రధానమంత్రి దేవగౌడ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వంటివారు కేసీఆర్ కు ఫోన్ చేయడం వంటి తదితర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీం.. కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లో ప్రమోట్ చేయడం కోసం సలహాలు, సూచనలు ఇస్తున్నట్టుగా కనిపిస్తుందే తప్ప… రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయడం లేదన్నదీ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్న చర్చ! అయితే దేశం మొత్తంలోనే కీలకమైన యూపీ ఎన్నికల ఫలితాలు మార్చి10న వెలువడ్డాకగానీ.. భవిష్యత్ రాజకీయాలు, సమీకరణాలు ఇంకే టర్న్ తీసుకోబోతున్నాయన్నది మరింత స్పష్టత రానుంది.