విశాఖలో శ్రీనివాస కళ్యాణం- పాల్గొన్న టీటీడీ చైర్మన్ దంపతులు!!

Surender Kumar,

విశాఖ‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాసకల్యాణం క‌న్నుల పండువ‌గా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు కళ్యాణం లో పాల్గొన్నారు.


మధ్యాహ్నం 3.30 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.

నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు.

అనంతరం జిల్లా లోని చిన్నముషిడివాడ లో, శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానదేంద్ర స్వామి వారిని, శ్రీ స్వాత్మానదేంద్ర స్వామి వారిని దర్శించుకొని. వై.వి సుబ్బారెడ్డి దంపతులు ఆశీస్సులు పొందారు.