పై తారక మంత్రం లాంటి ఈ మూడు పదాలు ఒక జీవితాన్నే మార్చాయి.
” నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ రాజేశ్వరరావు పదవి విరమణ సందర్భంగా ”
J. Surender Kumar,
ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి తన పన్నెండవ ఏటనే తండ్రిని కోల్పోయి, విపరీత పరిస్థితుల ప్రభావంతో తన పద్దెనమిదవ ఏట ప్రావిడెంట్ ఫండ్ విభాగంలో క్లర్క్ గా ప్రయాణం ప్రారంభించి, భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా వరకు సాగిన అసాధారణ ప్రస్థానం ఎంతో స్ఫూర్తి దాయకం.

తెలంగాణలో గల్లీ బడులలో చదివి భారతదేశ అభివృద్ధి ప్రణాళికల రచనలకు మార్గదర్శకం చేసే’ నీతి ఆయోగ్’ కు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసి నేడు పదవి విరమణ చేస్తున్న కొలనుపాక రాజేశ్వరరావు, ఐఏఎస్ ప్రస్థానం ఇది.
నల్గొండ జిల్లాకు చెందిన రాజేశ్వరరావు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. నలుగు తోబుట్టువులు ఇద్దరు సోదరులు, పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి మెరిట్ స్కాలర్షిప్ తో ఇంటర్ ,డిగ్రీ నల్గొండలో చేశాడు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ లో ఉద్యోగంలో చేరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో బంగారు పథకం సాధించారు.
1985 లో కామారెడ్డిలో డివిజనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా (DPRO) పని చేశారు. ఆ సమయంలో వివిధ దినపత్రికలకు ఆసక్తికరమైన వార్త కథనాలు పంపించేవారు. ప్రత్యేకంగా జోగినిల వ్యవస్థపై సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఆయన రచనలకు కేంద్ర ప్రభుత్వం నాడే అవార్డులు ప్రకటించింది.

జాతీయస్థాయిలో 61 ర్యాంక్ !
సివిల్సర్వీస్ పరీక్షలలో రెండుసార్లు రాసి ఇంటర్వ్యూల లో ఎంపిక కాకపోవడంతో, కసి, పట్టుదలతో, 18 గంటల పాటు చదువుతూ మూడవసారి జాతీయ స్థాయిలో 61 ర్యాంకు సాధించి త్రిపుర క్యాడర్ కు రాజేశ్వరరావు ఎంపిక అయ్యారు.
చరిత్ర, తెలుగు సాహిత్యం ఐచ్ఛిక విషయాలుగా రాసి ఐఏఎస్ కు ఎంపిక అయ్యారు. ఆయన తన గదిలో రాసుకున్న మాటలు “చరిత్ర చదమడం మంచిదే కాని చరిత్ర సృష్టించడం ఉత్తమం “ ఆయనలో ఉత్తేజం నింపి చరిత్రలో అత్యధిక మార్కులు సాధించడానికి ఉపకరించాయి.

అసాధ్యం అంటూ ఉండదు !
అసాధ్యాలను సుసాధ్యాలు చేయడానికి అడ్డదారులు ఉండవని అంకిత భావం కఠోర దీక్ష, నిరంతర శ్రమ, మడమ తిప్పని మనోధర్యం కలిగి ఉన్నవారే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు అని రాజేశ్వరరావు అనేక సభలు సమావేశాలలో రాజేశ్వరరావు
యువతకు వివరించారు.

గిరిజనుల ఆత్మీయ బంధువు !
త్రిపుర రాష్ట్రం ఉదయపూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అత్యధిక శాతం గిరిజన గూడెం తాండాలను సందర్శించి వారిలో మనోధైర్యాన్ని వారి అభివృద్ధికి ఆ ప్రాంతంలో 200 పాఠశాలలు 100 అంగన్వాడి కేంద్రాలను ఆయన ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి త్రిపుర సీఎం ఓ కార్యాలయానికి బదిలీ సందర్భంలో గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టారు. 1997 నుంచి.2003 వరకు సీఎం మాణిక్ సర్కార్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగారు.
భారత ప్రభుత్వంలో రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల్లో సంయుక్త కార్యదర్శిగా విశేష సేవలందించారు.
సుప్రీం కోర్ట్ ఆధ్వర్యంలోభారత మైనింగ్ పాలసీ రూపకల్పనలో రాజేశ్వరరావు పాత్ర కీలకం.
ఈయన ఎన్నో దేశాల్లో శిక్షణ పొందారు. అర్బన్ డెవలప్ మెంటు లో కేంద్రీయవిశ్వ విద్యాలయం నుండి డాక్టరేటు పట్టా పొందారు.

అమ్మ మాట ,తమ కుటుంబ సభ్యులకు రాచబాట !
అనేక సందర్భాల్లో రాజేశ్వర్ రావు. తనకు తమ కుటుంబ సభ్యులకు మా అమ్మ రుక్మిణి మాట వేదవాక్కని ఆమె మాట మా అందరికీ రాచ బాటగా మారిందని, చదివే ముఖ్యం ,చదివే బతుకు తెరువు అంటూ, నిత్యం చెప్పడంతో తాము ఈ స్థితిలో ఉన్నామంటారు ఆయన.
ముగ్గురు ఐఏఎస్ లు !
రాజేశ్వరరావు ఇద్దరు మేనల్లుళ్లు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఐఏఎస్ అయ్యారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మధ్యప్రదేశ్ లో కృష్ణ చైతన్య కలెక్టర్ గా పనిచేస్తున్నారు. మరో మనవడు కుందన్ కృష్ణ భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ లో గ్రూప్ ఏ అధికారి గా విధులు నిర్వహిస్తున్నారు.
ధర్మపురి తో అనుబంధం !
ఐసిఐసి ఐ బ్యాంకు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ అధికారి గుండి విష్ణు ప్రసాద్ ,రాజేశ్వరరావు చిరకాల మిత్రులు. ఆయన అనేకసార్లు ధర్మపురి కి రావడం ఇక్కడ మనలో ఒకడిగా సాధారణ వసతులమధ్యలో గడిపడం జరిగేది . గోదావరి స్నానం, స్వామి వారి దర్శనం ఆయనకు ఎంతో ఇష్టం. మన పరిసర ప్రాంతాలు మనతో పాటుగా తిరిగేవారు. గుళ్ళో రాత్రి జరిగే కార్యక్రమాలు స్నేహితులతో కలసి నేల పైన కూర్చొని తిలకించేవారు. తన హోదాను గాని, పేరును గాని ఎక్కడ చెప్పడానికి ఇష్టపడేవారు కాదు

నీటి రంగ నిపుణుడు స్వర్గీయ విద్యాసాగర్ రావుగారికి స్వయానా అల్లుడు !
నీళ్లు నిధులు నియామకాల రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకం. నీటి దోపిడి వివరాలను విశ్లేషించి విపులంగా ప్రజలకు వివరించి ఉద్యమాన్ని ఉధృతం చేసిన స్వర్గీయ విద్యాసాగర్ రావు కూతురు అపర్ణ రాజేశ్వరరావు ధర్మపత్ని.