రేపే రామగుండం లో ప్రధాని మోడీ పర్యటన!

మధ్యాహ్నం 3-30 కి చేరుకోనున్న ప్రధాని!

రెప్పవాల్చని పటిష్ట భద్రత.!


( J. Surender Kumar )


ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామనేలా, అక్కడక్కడ వినిపిస్తున్న వ్యతిరేక స్వరాలను అడ్డుకునేలా పోలీసు అధికారులు భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సభ లోపల, బయట ఎలాంటి అలజడులు, ఆందోళనలు జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది.

ప్రధాని ప్రయాణించే రోడ్డు మార్గంలోనూ రక్షణ ఏర్పాట్లపై పీఎం రక్షణలో కీలకమైన ఎస్‌పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) బృందాలు దృష్టిని కేంద్రీకరించాయి. ఇప్పటికే ఈ బృందం ఉన్నతాధికారి అనిల్‌కుమార్‌, స్వయంగా పర్యవేక్షించారు. వేదిక నిర్మాణం పూర్తవడంతో నేటి మధ్యాహ్నం నుంచి ఈ మైదానం పూర్తిగా కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లనుంది.
ఎన్టీపీసీ పర్మినెంటు టౌన్‌షిప్‌లోని మహాత్మాగాంధీ, క్రీడా మైదానంలో వేదికతో పాటు, ప్రజలు కూర్చునేలా మూడు గుడారాలు ఏర్పాటు చేశారు. మొత్తం 20 వేల మంది వరకు హాజరయ్యే సభా ప్రాంగణంలో మోదీ ప్రసంగాన్ని వినేందుకు రైతులతో పాటు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్టీపీసీ ఉద్యోగుల కుటుంబాలు హాజరుకానున్నాయి. శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు రామగుండం చేరుకోనున్న ప్రధాని హెలికాఫ్టర్‌ దిగిన వెంటనే ఆర్‌.ఎఫ్‌.సీ.ఎల్‌ను సందర్శించనున్నారు. అక్కడ గంట పాటు అధికారులతో మాట్లాడి నేరుగా సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట వెళ్లనున్నారు. రెండు గంటల పాటు రామగుండంలో పర్యటించనున్న ప్రధాని మోదీ పర్యటనకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్‌పీజీ, సీఐఎస్‌ఎఫ్‌, కేంద్ర బలగాలు దిగాయి. ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉద్యోగుల కుటుంబాలు 2000 మందికి ప్రత్యేక పాస్‌ల ద్వారా అనుమతించనున్నారు., సాధారణ ప్రజలను క్రీడా మైదానం వెనుక భాగం నుంచి అనుమతించనున్నారు. వారికి సంబంధించిన వాహనాలను పర్మినెంటు టౌన్‌షిప్‌లోని, కాకతీయ ఫంక్షన్‌హాల్‌తో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు.

సాధారణ ప్రజలను ఎన్టీపీసీ బీ-టైప్‌ గేటు నుంచి అనుమతించనున్నారు. బి-టైప్‌ గేటు నుంచి వీఐపీ గెస్టు హౌస్‌మీదుగా, క్రీడా మైదానానికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానీ రాకకు ఎన్టీపీసీ క్రీడా మైదానం సమీపంలోని హెలిప్యాడ్‌ వద్ద ఏర్పాట్లు చేస్తుండగా, తాజాగా రామగుండం పోలీసు కమిషనరేట్‌ హెడ్‌క్వార్టర్‌లో, మరో హెలిప్యాడ్‌ను తయారు చేస్తున్నారు. ఇక్కడ దిగితే పోలీసు హెడ్‌క్వార్టర్‌ నుంచి ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోకి తీసుకెళ్లేలా రాజీవ్‌ రహదారిపై ఉన్న రోడ్డు డివైడర్లను తొలగిస్తున్నారు. కమిషనరేట్‌ నుంచి బి-టైపు గేట్‌ నుంచి క్రీడా మైదానం వరకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఏ హెలిప్యాడ్‌ను వినియోగించుకుంటారో ? అన్నది స్పష్టత లేదు. మొత్తం 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాకుండా సమీపంలోని మరో ఐదు జిల్లాల నుంచి పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తుకు కేటాయిస్తున్నారు.

బహిరంగ సభ!
బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్న బిజేపి పార్టీ శ్రేణులు, ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేలా భాజపా నాయకులు సన్నద్ధమవుతున్నారు., కాషాయపార్టీకి చెందిన ముఖ్యనేతలు రైతులు, ప్రజలను ఎన్టీపీసీలోని పీటీఎస్‌ (పర్మినెంట్‌ టౌన్‌షిప్‌) మైదానానికి పెద్దఎత్తున సమీకరించేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి భగవంత్‌ కూబా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను సందర్శించడంతోపాటు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభకు రైతులను పెద్ద మొత్తంలో తీసుకువచ్చేలా బాధ్యతల్ని ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులకు అప్పగించారు.