ఈడీ కేసు విచారణకు హాజరు కాని
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.

(J. Surender Kumar).

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంగళవారం ఈడి ఎదుట హాజరుకావాలని నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టులో సోమవారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ కేసును పూర్తిగా కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. ఈనెల 15న పీఎంఎల్‌ఏ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.  ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాగంగానే ఈడీ అధికారులు ఈసీఐఆర్‌ 48/2022 నమోదు చేసి రోహిత్‌రెడ్డిని రెండు రోజుల పాటు ప్రశ్నించారు. ఇదే కేసులో అభిషేక్‌ అనే గుట్కా వ్యాపారికి కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. వీరిద్దరితో పాటు నందకుమార్‌ను కూడా ఈడీ అధికారులు చంచల్‌గూడ  జైల్లో ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మనీలాండరింగ్ లేకుండానే  ఈడీ అక్రమంగా తనపై కేసు నమోదు చేసిందని రోహిత్‌రెడ్డి నిన్న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

దీనికి సంబంధించి రోహిత్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో మీడియా ముఖంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈడీ పరిధి దాటి విచారణ జరుపుతోందని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా  వేధిస్తున్నారని కూడా రోహిత్‌రెడ్డి బాహటంగానే చెప్పారు. అయితే, హైకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌లో ఈడీ  అధికారులు నమోదు చేసిన ఈసీఐఆర్‌ 48/2022ను పూర్తిగా రద్దు చేయాలని, ఎక్కడా మనీలాండరింగ్‌ జరగకుండానే ఈడీ దర్యాప్తు చేస్తోందని  పేర్కొన్నారు. కేంద్రంతో పాటు ఈడీ, ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. రేపు రిట్ పిటీషన్ పై విచారణ జరగనున్న దృష్ట్యా… న్యాయవాదులతో సంప్రదించిన తర్వాత వ్యక్తిగతంగా ఈడీ ఎదుట హాజరు కావాలా?  వద్దా.. అనేది నిర్ణయం తీసుకుంటానని రోహిత్‌రెడ్డి తెలిపారు. ఈడీ కేసులకు భయపడనని.. ధైర్యంగా ఎదర్కొంటానని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.