జనగామ-సిద్దిపేట ప్రధాన దారిలో ట్రాఫిక్ జామ్!
తండాలో విగ్రహ సందర్శనకు రాక !
J.Surender Kumar,
‘నటన వృత్తిలో క్రూరత్వం, నిజజీవన గమనంలో మానవత్వం’ ప్రదర్శిస్తున్న ప్రముఖ హిందీ నటుడు సోనూసూద్ కు బుధవారం చేర్యాలలో మండలంలో ఘన స్వాగతం లభించింది. స్వాగతం పలకడానికి తరలివచ్చిన అశేష జనవాహిని, యువత, భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో రియల్ హీరోకు స్వాగతం పలికారు. దీంతో జనగామ- సిద్దిపేట ప్రధాన రహదారి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది.

అభిమానుల కేరింతలు ఆప్యాయంగా, రియల్ హీరో రియల్ హీరో జిందాబాద్ అంటూ నినాదాలు, చేస్తున్న అభిమానుల ఉత్సాహాన్ని సోనూసూద్ తన సెల్ ఫోన్ లో రికార్డు చేసుకున్నారు. ఓ తండాలో తన విగ్రహం ఏర్పాటుచేసిన యువత ఆహ్వాన మేరకు ఆ తండా కు వచ్చారు.

కరోనా కష్టకాలంలో, అనేక మందిని ఆర్థికంగా, మానసికంగా ఆదుకొని మానవత్వ దృక్పథంతో చేయూతను అందించిన రియల్ హీరో సోనూసూద్ సేవలకు కృతజ్ఞతా భావంతో దుల్మిట మండలం, చెలిమితండాకు చెందిన యువకులు ప్రజలు, గత కొంత కాలం క్రితం సోనూసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

విగ్రహ సందర్శనకు రావాల్సిందిగా అనేకసార్లు చేసిన అభ్యర్థన మేరకు సోనూసూద్ బుధవారం రాజీవ్ రహదారి గుండా, కొమురవెల్లి, చేర్యాల మండల మీదుగా ఆ తండాకు చేరుకున్నారు. చేర్యాల బస్టాండ్ వద్ద ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు.
