1928లో లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చి నందుకు గాను 1931 మార్చి 23 న భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ లతో పాటు ఉరి తీయబడిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యుడు హరి శివరాం రాజ్ గురు. దేశ స్వాతంత్రం కోసం అనేకమంది ప్రాణాలను అర్పించారు. అటువంటి వారిలో భగత్ సింగ్ ఒకరు.
1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్ జిల్లా బంగాలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్‌సింగ్ జన్మించారు. చిన్ననాటి నుంచే నరనరాల్లో దేశభక్తినిఇనుమడింపచేసుకున్నాడు భగత్ సింగ్. అందుకే దశాబ్దాలు గడిచినా ఆ విప్లవవీరుడి త్యాగం ఇంకా సజీవంగానే ఉంది. దేశవిదేశాల్లో ఎన్నో పోరాటాలకు ఆజ్యం పోసింది. కోట్లాదిమందిలో తెగువ నింపింది.
ఉరకలేస్తున్న తనయవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు.12 ఏళ్ల వయసులోనే జలియన్ వాలాబాగ్ దారుణాలను చూసి భగత్ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగాసహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్‌సింగ్‌కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు.
సైమన్ కమిషన్..పోలీసుల దాడి.. లాలాలజపతిరాయ్ మృతి 1928లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో… లాలాలజపతిరాయ్ చనిపోవటంతో భగత్‌సింగ్ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్ వేశారు. విజిటర్స్ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు.
1908 ఆగస్టు 24 న పూనా సమీపంలోని భీమా నది ఒడ్డున ఉన్న ఖేద్ గ్రామంలో పార్వతి దేవి, హరినారాయణ దంపతులకు రఘునాద్ (రాజ్‌గురు ) జన్మించాడు. ఆరేళ్ల వయసులో తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత అతని అన్నయ్య దిన్‌కర్ మీద పడింది. రాజ్ గురు ఖేద్ వద్ద ప్రాథమిక విద్యను పూర్తిచేసి, తరువాత పూనాలోని న్యూ ఇంగ్లీష్ హైస్కూల్లో చదువు తుండగా అతని 14 వ ఏట ఇంగ్లీష్ పరీక్షలో తప్పాడు . ఆ కుర్రాడి అన్నయ్య అతడిని పరీక్ష తప్పినందుకు తెగ తిట్టేశాడు . కుర్రాడికి కోపం వచ్చింది . అవమానం భరించలేక పోయాడు . కట్టుకున్న బట్టలతో , నూనె కొనమని అమ్మ ఇచ్చిన 9 పైసలతో , అక్క పళ్ళు కొనమని ఇచ్చిన 2 పైసలతో ఇల్లు వదిలి వెళ్ళి పోయాడు.
అక్కడ నుండి బయలుదేరి నాసిక్, అక్కడనుండి కాశీ వెళ్ళాడు . భారత్ సేవా మండల వారి జిమ్నాజియం లో , లైబ్రరీ లో గడపడం , ఉపన్యాసాలు వినడం , ఇదే అతడి నిత్య కృత్యం గా మారింది. ఆ సమయం లో మదన్ మోహన్ మాలవీయ గారి హిందూ యూనివర్సిటీ స్వాతంత్ర్య సమర పోరాటాలలో వీరులను తయారు చెయ్యడం లో ప్రసిద్ది చెందింది . మన యువకుడికి అప్పుడు పరిచయం అయ్యాడు చంద్ర శేఖర ఆజాద్ . ఆజాద్ విప్లవ బీజాలను వేస్తుంటే వాటిని తనలో పాతుకుని స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని ఫణంగా పెడతాను అనే నిర్ణయానికి వచ్చేశాడు ఈ యువకుడు . వీరిద్దరి కాంబినేషన్ చూసి అందరూ ఆశ్చర్య పోయేవారు . బ్రిటిష్ వారిని చంపి నేను నా దేశం కోసం ఆత్మ బలిదానం ఇవ్వడానికి సిద్ధం అంటూ ఉండేవాడు .

ఒకనాడు రాజగురుతో స్వాతంత్ర్య సాధనకొరకు నీకు అప్పగించే పనిని నిర్వహించడం కోసం నువ్వ్ ఇక్కడే ఉండు అని చెప్పి ఆజాద్ కాశీని వదిలి వెళ్ళిపోయాడు .
అదేసమయంలో సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా భారతదేశంలో చేస్తున్న అహింసాయుత రాలీ పై పోలీస్ ఆఫీసర్ జే పి సాండర్స్ లాఠీ చార్జి చేసి కొట్టిన దెబ్బలకు లాలా లజపతి రాయ్ చనిపోవడం జరిగింది . ఆయన సంస్మరణ సభలో చిత్తరంజన్ దాస్ భార్య ఆయన చితిమంటలు ఆరే లోపులో ఈ చర్యకు ప్రతిచర్య చేసే ధైర్యం ఎవరికి ఉంది అని ఓపెన్ చాలెంజ్ చేసారు.
ఆ చర్యకు ప్రతిచర్య గా సాండర్స్ ను చంపుతాను అని , కోర్టులో ఎందుకు చంపానో చెబుతాను అనీ సర్దార్ భగత్ సింగ్ తన ప్రోపోజల్ చెప్పాడు .అప్పుడు అందరూ కలిసి ప్రణాలిక రచించారు . జయగోపాల్ అనే యువకుడిని మాల్ రోడ్ పోలీస్ స్టేషన్ పై నిఘా పెట్టి స్కాట్ కదలికలను గమనించి భగత్ సింగ్ , రాజగురులకు సంకేతాన్ని ఇవ్వాలనీ వెంటనే వారు సాండర్స్ ను చంపాలని ప్రణాళిక వేశారు.
అయితే వారి ఆశలు నాలుగు రోజులపాటు ఫలించలేదు . సాండర్స్ లోపల నుండి బయటకు రాలేదు . ఐదవ రోజున ఒక ఆఫీసర్ , స్టేషన్ నుండి బయటకు వచ్చాడు . వెంటనే జయ గోపాల్ సంకేతం ఇచ్చాడు . భగత్ సింగ్ కాదని వారించే లోపులోనే రాజ గురు ఆ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ పై కాల్పులు ప్రారంభించాడు . భగత సింగ్ కూడా వెంటనే తన తుపాకీతో ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపి అతడు చనిపోయాడు అని నిర్ధారించుకున్నారు . ఇంతలో స్టేషన్ లోపలి నుండి పోలీస్ లు బయటకు బిలబిలా వచ్చారు .
అందులో ఒక పోలీస్ ఆఫీసర్ రాజ గురు వైపుకు వచ్చాడు . ఆసమయానికి రాజ గురు పిస్టల్ పని చెయ్యలేదు .రాజ గురు తన శక్తికొలది ఆ ఆఫీసర్ తలపై గట్టిగా కొట్టేసరికి ఆతను నేలపై పడిపోయాడు మరి లేవలేదు . అతడికి అదేచివరి రోజయింది . అపుడే వారిద్దరూ గమనించారు తాము చంపినది సాండర్స్ ని అని. లాలా లజపతి రాయ్ హత్యకుకారకున్ని మట్టుపెట్టిన విజయానందంతో వారిద్దరు అక్కడి నుండి లాహోరు పారిపోయారు .
తరువాత భగత్ సింగ్ ఒక మిలటరీ ఆఫీసర్ గా, విప్లవ సభ్యుడు భగవతీ చరణ్ వోహ్రా భార్య దుర్గ భగత్ సింగ్ భార్యగా, వారి కుమారుడు కుటుంబ సభ్యుడిగా, ఈ ముగ్గురూ ఒక కుటుంబంగా రాజ గురు వారి సేవకుడిగా , చంద్ర శేఖర ఆజాద్ మధుర నుండి వారితో వచ్చిన పురోహితుడిగా మారువేషాల్లో రాజకోట్ చేరుకున్నారు . తర్వాత రాజ గురు కాశీలో మారు వేషం లో విప్లవ వీరులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పేవాడు . అతడు పబ్లిక్ గా ప్రదర్శనలు ఇచ్చినా ఒక్కరు అతడిని గుర్తించలేక పోయారు . అలా నెలలు గడిచాయి. కానీ చివరకు 1929 సెప్టెంబరులో బ్రిటీషు వార్కి పట్టుబడ్డాడు . జైలు పాలయ్యాడు. అదేసమయానికి భగత్ సింగ్, సుఖ్ దేవ్ లను కూడా అరెస్టు చేసి ఒకే జైలులో బంధించారు.
ఈ ముగ్గురుతో బాటు, 21 మందిఇతరసహ-కుట్రదారులను 1930 లో ప్రత్యేకంగా నిబంధనల ప్రకారం బ్రిటీషు వాళ్లు విచారించారు. “జె.పి. సాండర్స్” ను కాల్చి చంపినందుకు గాను ముగ్గురు విప్లవకారులుకు ఉరిశిక్ష విధించి మార్చి 24న ఉరికి ఆదేశించారు.
కానీ భారతీయులలో పెల్లుబుకుతున్న స్వాతంత్ర్య జ్వాలలకు భయపడి భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఒక్కరోజు ముందుగానే 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 సమయానికి ఉరి తీశారు. వారి మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళి సట్లెజ్ నది తీరాన హుస్సేన్‌వాలా అనే ఊరిలో దహనం చేశారు.భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్.ల ఇచ్చాపూర్వక బలిదానం వారి భావావేశాల ఫలితం కాదు.అది దేశ ప్రజలను ఉత్తేజ పరిచి, భారత స్వాతంత్ర్య సమరంలో వారిని క్రియాశీలక కార్యాచరణ వైపు నడిపించాలనే ఉత్తమ సందేశం ఇవ్వడానికి వారెంచుకున్న మార్గం , త్యాగం.
ప్రతి సంవత్సరం మార్చి 23 న హుస్సేన్‌వాలా లో అమరవీరుల దినోత్సవం (షాహీద్ దివాస్) నిర్వహించి ముగ్గురు విప్లవకారులను జ్ఞాపకం చేసుకుంటారు. అక్కడే నిర్మింప బడ్డ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించుతారు.
రాజ్‌గురు గౌరవార్థం అతని జన్మస్థలమైన ఖేద్ కు రాజ్‌గురునగర్ గా పేరు మార్చబడింది. నేడు రాజ్‌గురునగర్ మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఖేద్ తహసీల్‌లోని ముఖ్య రెవెన్యూ పట్టణం.పూణే – నాసిక్ రోడ్‌లోని భీమా నది ఒడ్డున రాజ్‌గురు జన్మించిన పూర్వీకుల ఇల్లు 2,788 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిని శివరామ్ రాజ్‌గురు జ్ఞాపకార్థం రాజ్ గురు వాడగానిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థ, హుతాత్మా రాజ్‌గురు స్మారక్ సమితి (హెచ్‌ఆర్‌ఎస్ఎస్) 2004 నుండి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాజ్ గురు జ్ఞాపకార్ధం ఢిల్లీలో వసుంధర ఎన్‌క్లేవ్ లో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలో షాహీద్ రాజ్‌గురు కాలేజ్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఫర్ ఉమెన్ నిర్వహించ బడుచున్నది.ఇరవై మూడేళ్ళ పిన్నవయసులోనే భారతమాత స్వాతంత్ర్య సాధనకోసం రాజ్ గురు చేసిన త్యాగం భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపింది. భగత్ సింగ్ , రాజ్‌గురు ల సహచరుడు సుఖ్ దేవ్ థాపర్. అసెంబ్లీ బాంబు సంఘటనలో 7 ఏప్రిల్1929 తేదీన భగత్ సింగ్ అరెస్ట్ అయాడు, 15ఏప్రిల్ తేదీన జరిగిన రైడ్ లో సుఖదేవ్ కూడా అరెస్ట్ అయాడు. 30 సెప్టెంబర్ 1929 తేదిన పోలీస్ డిఎస్పి సయ్యద్ అహ్మద్ షా రాజగురుని అరెస్ట్ చేసాడు. సుఖదేవ్ హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థలో ముఖ్యమైన నాయకుడు. లాహోర్ నేషనల్ కాలేజిలో భారత పురాతన ఔన్నత్యాన్ని అధ్యయనం చేయడానికి, ప్రపంచ విప్లవ పరిణామాలు పరిశీలించడానికి ఒక అధ్యయన కేంద్రాన్ని (స్టడీ సర్కిల్) ప్రాంభించాడట. తన సహచరులైన భగత్ సింహ్, కామ్రేడ్ రామచంద్ర, భగవతీ చరణ్ వోహ్రా లతో కలిసి లాహోరులో “నవ జవాన్ భారత సభ” ప్రారంభించాడు. దేశ స్వాంతంత్ర్యానికి యువతను ఉత్తేజితులను చేయడం, ప్రజలలో హేతువాదాన్నిపెంపొందించడం, మతవైషమ్యాలను నిరోధించడం, అంటరానితనాన్ని అరికట్టడం ఆ సంస్థ ఆశయాలు.పండిట్ రామప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర ఆజాద్‌ల ప్రభావం సుఖదేవ్‌పై బలంగా ఉంది. ఖైదీలపట్ల చూపుతున్న అమానుష విధానాలకు వ్యతిరేకంగా 1929లో జరిగిన నిరాహార దీక్షలోసుఖదేవ్ పాల్గొన్నాడు. చరిత్ర వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధులే మన భగత్‌సింగ్, రాజ్ గురు ,సుఖదేవ్ .భరతమాత దాస్య సంకెళ్లను తెంచేందుకు, ఉరితాడునే పూలమాలగా మెడలో వేసుకున్న ధైర్యశీలురు వారు. ఇటువంటి వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి.
వ్యాసకర్త..
యం.రాం ప్రదీప్ తిరువూరు 9492712836