కేసీఆర్ ముఖం చూసి ఓట్లేసే పరిస్థితి ఉందా ?
లక్సెట్టిపేటలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందా?
ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్!
J. SURENDER KUMAR,
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ను నడిపించేది కేసీఆరేనని అన్నారు. అట్లాంటప్పడు కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు కాంగ్రెస్ లో ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ ను ఓడించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని కేటీఆరే చెబుతున్నారని.. ఆత్మాభిమానమున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు. ‘‘మహా జన్ సంపర్క్ అభియాన్’’లో భాగంగా బుధవారం లక్సెట్టిపెటలో జరిగిన మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ బహిరంగ సభకు బండి సంజయ్ తోపాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు రఘు, పాయల శంకర్, రాష్ట్ర కార్యదర్వి పల్లె గంగారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

👉 బీజేపీ మీటింగ్ ఉందంటే కేసీఆర్ సార్ పెగ్గులేసుకుని టీవీల ముందు కూసుంటడు. మంచిర్యాల ప్రజల్లో మస్త్ జోష్ కన్పిస్తోంది. ఈ జోష్ ఇంకా 5 నెలలుండాలే… కేసీఆర్ అంతు చూద్దాం..
👉 తెలంగాణ అంతటా తిరుగుతున్నా. టీఆర్ఎస్ మీటింగ్ లకు ఎవరూ రావడం లేదు. ఒక్కొక్కరికి ఫుల్ బాటిల్, వెయ్యి రూపాయలిస్తానన్న రావడం లేదు..
👉 మోదీ పేద కుటుంబం నుండి వచ్చినోడు… పేదల కష్టాలు తెలిసినోడు. పీఎం కాగానే పేదల కష్టాలను తొలగించేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నడు. పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించారు. మరి కేసీఆర్ ఏం చేసిండు? లక్సెట్టిపేటలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారా? కొబ్బరికాయ కొట్టడానికే పరిమితమయ్యారు. మందు తాగుతూ మందిని ఎట్లా ముంచాలా? అని ఆలోచిస్తుంటడు.
👉 మోదీ ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే… ఎందుకు కట్టివ్వలేదు. మంచిర్యాల ప్రజలు చేసిన పాపమేంది? కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతల గల్లా పట్టి అడగండి…
👉 ఉచితంగా 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత మోదీదే. మస్కట్ లో కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఒక్కొక్కరు రూ.16 వేలు ఖర్చు చేస్తే…. మోదీ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చారు.
👉 వడ్ల కొనుగోలు పైసలన్నీ మోదీ ప్రభుత్వం ఇస్తున్నవే. సుతిలీ తాడు నుండి రవాణా దాకా పైసలన్నీ కేంద్రం ఇస్తున్నవే. పల్లె ప్రగతి, స్మశానవాటిక, వడ్డీలేని రుణాలుసహా అన్ని మోదీ ఇస్తున్నవే. కేసీఆర్ మాత్రం సిగ్గులేకుండా వాటివద్ద తన ఫోటోలు పెట్టుకోవడం సిగ్గు చేటు.
👉 తెలంగాణ ఉద్యమంలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలిస్ కిష్టయ్య, శ్రీకాంతాచారి, సుమన్, ఇషాంత్ రెడ్డి సహా ఎందరో పేదలు తెలంగాణ కోసం చచ్చిపోయారు. పేదోళ్లు చస్తే తెలంగాణ వస్తే… ఇయాళ పెద్దోళ్లు పెత్తనం చెలాయిస్తున్నరు? కేసీఆర్ కుటుంబం ఏ త్యాగం చేసిందో చెప్పాలి. పేదలు బలిదానమైతే… బలిసినోళ్లు పాలిస్తున్నరు.
👉 ప్రభుత్వ తప్పిదాల పసిపిల్లలు చనిపోతున్నరు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు. నిరుద్యోగులు చనిపోయారు. అయినా సీఎం స్పందించరు. కేసీఆర్ పాలనలో పేదల బతుకులు బర్ బాద్ అయినయ్.
👉అందుకే తెలంగాణను అభివ్రుద్ధి చేసే బాధ్యతను నరేంద్రమోదీ తీసుకుని పెద్ద ఎత్తున నిధులిస్తున్నారు. అభివ్రుద్ధి చేసేందుకు ముందుకొస్తే కేసీఆర్ సహకరించడం లేదు. ప్రశ్నిస్తే బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నరు. జైళ్లకు పంపుతున్నరు.
👉 ఎమ్మెల్యేలు మందు, మనీ పంచి గెలుస్తున్నరట. కేసీఆర్ కొడుకు మాత్రం పైసలు పంచరట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు… మీ ముఖాలను చూసి ఓట్లు వేయడం లేదట. ప్రజల్లో మీకు విలువ లేదని కేసీఆర్ కొడుకు అంటుంటే స్పందించరా? ఆత్మాభిమానమున్న వాళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈసారి కేసీఆర్ ఫొటో పెట్టుకుని ఓట్లు అడిగితే మీ సంగతి చెప్పడం ఖాయం.
👉 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారిలో పోతుంటే మహిళలు ఇండ్లలోకి పోయి దాచుకునే పరిస్థితి వచ్చింది.
👉 బీజేపీ పోరాటాలకు భయపడి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. అన్నారు.