నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం !

కను మరుగౌతున్న పెద్ద పులులు..

పెద్దపులి ని రాజసానికి చిహ్నంగా భావిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పులులు మనుగడ కోల్పోతున్నాయి. పులిని  బిగ్‌ క్యాట్‌ అని కూడా పిలుస్తారు. ఈ బిగ్ క్యాట్ జీవ జాతిలో అతి పెద్దది పులి.


2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవంప్రకటించబడింది. అప్పటి నుండి ప్రతి ఏటా జులై 29న అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం జరుపుతున్నారు. పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, పులి సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచి వారినుండి సహాయాన్ని అందుకోవడం ఈ దినోత్సవ ముఖ్యోద్ధేశ్యం.i

పెద్దపులి శరీరాకృతి..

పెద్ద పులుల బరువు అంటే పదేళ్ల వయసుండే పులి బరువు 363 కిలోలు ఉంటుంది. తోక నుంచి తల వరకూ 11 అడుగులు పొడవు ఉంటుంది. భారత్‌లోని బెంగాల్‌ టైగర్‌ బరువు 250 కిలోలు. పొడవు 10 అడుగులు. పులులు చెట్లు ఎక్కగలవు. కానీ…అవి చాలా అరుదుగా ఈ పని చేస్తుంటాయి. పులి పంజా చెట్టు ఎక్కి కొమ్మల్ని గట్టిగా పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ వాటి బరువు పెరుగుతుంది. ఆ సమయంలో చెట్టు ఎక్కినా, వాటి బరువుని అవి ఆపుకోలేవు. అందుకే వయసు పెరిగే కొద్ది చెట్లు ఎక్కడం తగ్గించేస్తాయి. అయితే కోతి పిల్లలను వేటాడే సమయంలో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో చెట్లు ఎక్కుతాయి. 
పులి ఒకప్పుడు పశ్చిమాన తూర్పు అనటోలియా ప్రాంతం నుండి అముర్ నదీ పరీవాహక ప్రాంతం వరకు, దక్షిణాన హిమాలయాల పర్వత ప్రాంతాల నుండి సుంద ద్వీపాలలో బాలి వరకూ విస్తృతంగా ఉండేది. 20 వ శతాబ్దం ఆరంభం నుండి, పులి జనాభా కనీసం 93% తగ్గిపోయింది. పశ్చిమ, మధ్య ఆసియాలో, జావా, బాలి ద్వీపాల నుండి, ఆగ్నేయ, దక్షిణ ఆసియా, చైనాల్లోని విశాలమైన ప్రాంతాలలో పులి కనుమరుగై పోయింది. నేటి పులి జనాభా సైబీరియా సమశీతోష్ణ అడవుల నుండి భారత ఉపఖండం, సుమత్రాల్లోని ఉపఉష్ణమండల, ఉష్ణమండల అడవుల మధ్య ప్రదేశాల్లో చెదురుమదురుగా విస్తరించి ఉంది. పులిని, 1986 నుండి ఐయుసిఎన్ రెడ్ జాబితాలో అంతరించిపోతున్న జాబితాలో చేర్చారు.

టైగర్ ప్రాజెక్ట్..

1973 లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ అనేక పులుల సంరక్షణా స్థలాలను స్థాపించింది. 1973 లో 1,200 ఉన్న అడవి బెంగాల్ పులుల సంఖ్య 1990 నాటికి 3,500 దాటింది. సంఖ్యను మూడు రెట్లు పెంచిన ఘనత ఈ ప్రాజెక్టుకు దక్కింది, కాని 2007 జనాభా లెక్కల ప్రకారం, ఇది తిరిగి 1400 కు తగ్గింది. పులులు వేటగాళ్ళకు బలవడమే దీనికి కారణం.2022 నాటికి మరలా వీటి సంఖ్య 3160 వరకు చేరింది.
ప్రస్తుతం అడవులు తగ్గి పోవడంతో పులులు వంటి అనేక వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి.దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారు. మానవ మనుగడకు జీవ వైవిధ్యం అత్యంత అవసరం. అడవులను రక్షించడం ద్వారానే వన్యప్రాణులను కాపాడుకోగలం.


వ్యాసకర్త :  యం.రాం ప్రదీప్ తిరువూరు.
ఫోన్ నెంబర్: 9492712836