విద్యార్థుల రోజువారీ బడి కార్యక్రమాలు ప్రార్థనతో ప్రారంభం అవుతాయి. అందులో భాగంగా జాతీయగీతం. జాతీయ గేయంతో పాటు ‘ భారతదేశం నా మాతృభూమి ‘ అనే జాతీయ ప్రతిజ్ఞను కూడ విద్యార్థులు చదువుతారు. ఇంతకీ జాతీయ ప్రతిజ్ఞను రాసింది ఎవరో తెలుసా ? ఆయనే మన తెలుగు జాతి ఆణిముత్యం నల్గొండ జిల్లా ముద్దు బిడ్డ పైడిమర్రి వేంకట సుబ్బారావు వర్ధంతి నేడు.
నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10న రాంబాయమ్మ, రామయ్య దంపతులకు వేంకట సుబ్బారావు జన్మించాడు.1988 ఆగస్టు 13 న మృతి చెందారు. ఈయనకు చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి ఎక్కువ. సాహిత్యం పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. సాహిత్య కార్యక్రమాల్లో, సమ్మేళనాల్లో తరుచుగా పాల్గొంటుండేవాడు. పైడిమర్రికి తెలుగుతో పాటు సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబ్బీ, పారసీ, ఇంగ్లీష్ భాషలు కూడా వచ్చు. 1962లో విశాఖపట్నంలో ట్రెజరీ విభాగంలో పనిచేస్తున్నప్పుడు, భారత్ చైనా యుద్ధం జరిగింది. ఆ సమయంలో చైనా ప్రభుత్వం తమ దేశ విద్యార్థులకు దేశభక్తిని పెంపొందించే గేయాలను పాఠ్యపుస్తకాలలో పెట్టింది. అది తెలుసుకొన్న పైడిమర్రి భారత దేశ విద్యార్థులకు కూడా ఏదైనా అలాంటి రచన ఉండాలనుకొన్నాడు. అందుకే జాతీయ సమైక్యతను తెలిపేవిధంగా ప్రతిజ్ఞను రూపొందించారు. ఈ ప్రతిజ్ఞ ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని పెంపొందింపజేసి జాతీయ సమైక్యతను సమగ్రతను కాపాడి మన దేశ వారసత్వ సంపదను కాపాడుకోవాలని ప్రతి వారిని గౌరవించి వారితో సహోదరులకు మెలగాలని బోధిస్తుంది. విద్యార్థులలో క్రమశిక్షణ నెలకొల్పి వారు సన్మార్గంలో వెళ్లడానికి ప్రతిజ్ఞ తోడ్పడుతుంది.

పైడిమర్రి తాను రాసిన ప్రతిజ్ఞను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలిసిందిగా ప్రముఖ సాహితీవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాథంకు, చెప్పారు. అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా, పీవీజీ రాజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తెన్నేటి ప్రతిపాదనతో ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞను అచ్చువేసింది. ఇదే సమయంలో పైడిమర్రి విశాఖపట్నం నుండి బదిలీ కావడం వల్ల ఆ విషయం అతనికి తెలియలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రచయిత పేరు లేకుండానే ప్రతిజ్ఞను ముద్రించడం వలన ప్రతిజ్ఞను రాసింది ఎవరో చాలా మందికి తెలియకుండా పోయింది.1964లో కేంద్రీయ విద్యామండలి బెంగుళూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞను జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరిస్తూ 1965 జనవరి 26 నుండి అన్ని పాఠాశాలలో విద్యార్థులు తప్పనిసరిగా జాతీయగీతం, జాతీయ గేయంతో పాటు జాతీయ ప్రతిజ్ఞను కూడా చదవాలని తీర్మానించింది. కానీ అందులో కూడ పైడిమర్రి పేరును ముద్రించలేదు. ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో పెట్టిన ప్రతిజ్ఞను తానే రాశానని చెప్పుకొనే దుస్థితి ఆయనకు ఏర్పడింది. ప్రముఖ రచయిత ఎలికట్టె శంకర్రావు, జనవిజ్ఞాన వేదిక మొదలగు సంస్థలు ప్రతిజ్ఞతో పాటు పైడిమర్రి వేంకట సుబ్బారావు పేరును కూడా పాఠ్యపుస్తకాలలో ముద్రించాలని తీవ్ర ప్రయత్నాలు చేయడం వలన 2015 – 16 విద్యాసంవత్సరం నుండి ప్రతిజ్ఞతో పాటు పైడిమర్రి వేంకట సుబ్బారావు పేరును కూడా రెండు తెలుగు రాష్ట్రాలలోని పాఠ్యపుస్తకాలలో ముద్రిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ముద్రించిన ఐదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం వెనుకవైపు అట్ట మీద కూడా పైడిమర్రికి సంబంధించిన వివరాలను పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిజ్ఞను ఇంగ్లీష్ తో పాటు మరికొన్ని భారతీయ భాషల్లోకి కూడ అనువాదం చేయించింది.
కాలనుగుణంగా కొన్ని స్వల్ప మార్పులతో ఇప్పుడు ప్రతి పాఠశాలలో ఉదయం గంట మోగగానే జాతీయగీతం జాతీయగేయంతో పాటు జాతీయగేయం పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించిన ప్రతిజ్ఞ పలుకులు కూడా విద్యార్ధుల నోట ప్రతిధ్వనిస్తున్నాయి. పైడిమర్రి వారి జాతీయ ప్రతిజ్ఞను “ది ఫర్గాటెన్ పెట్రియాట్” పేరుతో ఆంగ్లంలో ఎం. రాంప్రదీప్ అనువదించగా, హిందీలో ‘ భారత్ మేరీ మాతృభూమి హై’ పేరుతో ఆర్. రఘునందన్ అనువాదం చేశారు. వ్యక్తి కన్నా వ్యవస్థ బాగుండాలని కోరుకునే పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవితం నేటి తరం వారందరికీ ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యక్తి కంటే దేశం ముఖ్యమని భావించే ఉన్నత వ్యక్తిత్వం కలవాడతడు. ప్రతిజ్ఞ రచయిత గురించి తెలుసుకోవాలనే వారికి రాం ప్రదీప్ రాసిన “భారత దేశం నా మాతృభూమి” అనే పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. గురజాడ అప్పారావు దేశభక్తి గీతంలాగా వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ ప్రతి భారతీయుడి మదిలో దేశభక్తి భావాన్ని పెంపొందింపజేస్తుంది. భారతీయులంతా ఒకటేనని ఐకమత్య భావాన్ని చాటిన ప్రతిజ్ఞకు ప్రభుత్వం మరింత ప్రాముఖ్యతను కల్పించి, భారతీయ భాషలన్నింటిలోకి ప్రతిజ్ఞను తర్జుమా చేయించి, అన్ని రాష్ట్రాల పాఠశాలలోని విద్యార్థులచే ప్రతిజ్ఞను చదివించాలి. పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చి భావితరాలకు స్ఫూర్తిని నింపాలి.
వందేమాతరం తదితర గీతాలన్ని దేశం యొక్క భౌగోళక స్వరూపాన్ని చక్కగా వర్ణించాయి. ఈ గీతాలలో ప్రజల ప్రస్తావన లేదు. ‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ దేశం యొక్క ఔన్యత్యాన్ని వర్ణించడంతోపాటు మానవ సంబంధాలు, కుటుంబ విలువలు, సోదరభావం తదితర విషయాలను గురించి చక్కగా వివరించింది. వందేమాతరం, జనగణమన తదితర గీతాలన్ని భారతీయుల్లో దేశభక్తిని పెంచుతాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. వివరిస్తే తప్ప ఆ గీతాల సారాంశం విద్యార్థులకు తెలియదు. ప్రతిజ్ఞ అంటే ఒక హామీ, అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం, రాజ్యాంగంలో ఉన్న విలువల్ని ప్రతిజ్ఞలోని పదాలు తెలియజేస్తాయి. పౌరుల యొక్క హక్కులతోపాటు విధులను కూడా ప్రతిజ్ఞ గుర్తు చేస్తుంది. ప్రతిజ్ఞ పదాలు సులభంగా, సరళంగా ఉంటాయి. విద్యార్థులలో దేశభక్తిని, జాతీయ సమైక్యతని మరియు నైతిక విలువలను పెంపొందించడానికి ప్రతిజ్ఞ దోహదపడుతుంది. ప్రతిజ్ఞ లోని తొమ్మిది వాక్యాలను అందరూ పాటిస్తే భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.
వ్యాసకర్త: యం. రాం ప్రదీప్
ఫోన్ నెంబర్ : 9492712836