ధర్మపురి నరసింహుడి పూల దండలలో దండి కొడుతున్నారు.!

నరహరి నీ దయ…

J.SURENDER KUMAR,

సాలిన కోట్లాది రూపాయల ఆదాయం గల ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీస్వామివారి కి అలంకరించే పూల దండలలో ఉద్యోగులు దండి కొడుతు దండుకుంటున్న బాగోతం వెలుగు చూసింది. బ్రహ్మ దేవుడు, బలరామకృష్ణ విగ్రహాలకు నిత్యం దండలు వేస్తున్నట్టు రికార్డులలో నమోదు చేసి బిల్లులు పెట్టి డబ్బులు స్వాహా చేస్తున్నారనే చర్చ జరుగుతుంది.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి నిత్య కళ్యాణం, అభిషేకం, జరుగుతాయి. స్వామివారికి భక్తులు అప్పుడప్పుడు సమర్పించుకునే పూల దండాలు, తులసి మాలలు, కాకుండా, దేవాలయం పక్షాన నిత్యం స్వామివారి అలంకరణకు పూలదండలు
ఆన్లైన్ / ఆఫ్ లైన్ టెండర్ ద్వారా సంవత్సర కాలానికి సరఫరా చేసే ఒప్పందం చేసుకుంటారు. నిబంధనల మేరకు ప్రతిరోజు పూలదండల తో పాటు పాలు పెరుగు, కూరగాయలు, ఆలయానికి నిత్యం తెల్లవారుజామునే బాధ్యులు అందజేస్తారు.

రికార్డులలో అదనంగా పూల దండల నమోదు

బ్రహ్మ దేవుడికి వేసిన పూల దండలు ఇలా..

ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు, నిత్య అన్నదానం తయారీకి గోదాము నుండి నిత్యవసర సరకులను అప్పగించే ( దిట్టం బాధ్యతల బాధ్యుడు ) ఉద్యోగి కి పూలదండలు అప్పగిస్తారు. ప్రతినెల చివరిలో ఆయా ఆలయాల విగ్రహాల స్వామివారి అలంకరణకై అందించిన పూలదండల వివరాలను ధిట్టం ఉద్యోగి నమోదుచేసి, అర్చకుల, అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగుల తో ఆలయానికి వచ్చిన పూలదండల వివరాల నమోదు పుస్తకంలో సంతకాలు చేయించుకుంటారు. 2023 జూలై మాసంలో ప్రధాన ఆలయ ప్రాంగణంలో గల బ్రహ్మదేవుడు, బలరామకృష్ణ విగ్రహాలకు పూలమాలను పంపిణీ చేసినట్టు, పూల దండల ధర, మరియు ఎన్ని రోజులపాటు అందించిన వివరాలను రికార్డులలో నమోదు చేశారు.

బలరామకృష్ణ విగ్రహానికి దండలు

వాస్తవానికి అర్చకులు అక్కడి ఉద్యోగులు సంతకం చేయాల్సి ఉంటుంది. వారు ఆ రికార్డులపై సంతకాలు చేయడానికి నిరాకరించినట్లు సమాచారం.

వెలుగు చూపింది ఇలా
బ్రహ్మదేవుడు, బలరామకృష్ణులకు పూల దండలు ఎప్పుడు ఇచ్చారు ? శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అలంకరించిన పూలదండలు వాడిపోకుండా ఉండడంతో మరుసటి రోజున బ్రహ్మ, బలరామకృష్ణుని విగ్రహాలకు మేము వేస్తున్నాం, తప్ప ప్రత్యేకంగా వీటి కోసం ఎప్పుడు దండలు పంపించారు ? అంటూ, బాధ్యులైన ఉద్యోగులు తప్పుడు బిల్లులు పెట్టడం వేలాది రూపాయలు స్వాహా చేయడం అలవాటుగా మారిందని అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, మరి కొందరు భక్తుల సమక్షంలో గత కొన్ని రోజుల క్రితం ఆలయ మంటపంలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. పూలదండల పంపిణీ రికార్డులపై వారు సంతకం చేయడానికి నిరాకరించినట్టు సమాచారం. జూలై మాసంలో 31 రోజులకు దండాలు రెండు కలిపి ₹120 రూపాయలు చొప్పున ₹ 3,720/- నమోదు చేశారు.

పూలదండల రికార్డులలో నమోదు చేసిన బ్రహ్మ బలరామకృష్ణ పేర్లు

ఓచర్ పెడతారు డబ్బులు డ్రా చేస్తారు !

ప్రధాన సందర్భాల్లో పూలదండలు, పాలు పెరుగు, కూరగాయలు అదనంగా కొనుగోలు చేసినట్టు రికార్డులలో నమోదు చేసి ఓచర్ ద్వారా బాధ్యులైన ఉద్యోగులు ఆలయ నిధుల నుంచి ఇలా డబ్బులు డ్రా చేయడం షరా మామూలే అనేది ఉద్యోగ వర్గాల కొనసాగుతున్న చర్చ.

బెల్లం ప్రసాదమే..?
జూన్, జూలై మాసంలో ఓ భక్తుడు దాదాపు క్వింటాల్ కు పైగా బెల్లం ముద్దలను, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కానుకగా సమర్పించి ఇక్కడి ఆలయంలో విధులు నిర్వహించే అర్చకులు, ఉద్యోగులు బెల్లం ప్రసాదము ను తీసుకోవాల్సిందిగా కోరినట్టు సమాచారం. అయితే అర్చకులు, అక్కడి ఉద్యోగులు ఈ బెల్లం కార్యాలయంకు వెళ్లి అప్పగించాలని భక్తుడిని కోరగా, తాను మీకే ఇస్తానని వారికి ఇవ్వనని చెప్పడంతో, వారు బెల్లం ప్రసాదం తీసుకున్నట్టు సమాచారం. విషయం తెలిసిన ఆలయాధికారులు భక్తుడు ఇచ్చిన క్వింటాల్ కు పైగా బెల్లం కార్యాలయానికి అప్పగించాల్సి ఉండగా, మీరు ఎలా తీసుకుంటారు ? అని హెచ్చరించినట్టు సమాచారం.. దీంతోపాటు స్వామివారికి కానుకగా వచ్చిన ప్రతిదీ కార్యాలయానికి అప్పగించాలని వారికి ఆదేశ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

కొత్త నరసింహస్వామి ప్రాంగణ విగ్రహాలకు దండలు ఏవి ?

ఇదే ఆలయ లో కొత్త నరసింహ స్వామి ఆలయానికి ఉత్తర ముఖంగా కుబేరుడు, ఈశాన్యంలో గణపతి, వాయువ్యంలో ఇంద్రుడు అగ్ని దేవుడి అపూర్వ అరుదైన విగ్రహాలు ఉన్న వాటికి పూలదండలు కొనుగోలు చేసినట్టు రికార్డులలో మాత్రం నమోదు కాలేదు.

శ్రీ యమధర్మరాజు ఆలయం ఎక్కడ ?

బొమ్మల గాజుల దుకాణం రెండవ గుర్తు యమధర్మరాజు ఆలయం

ధర్మపురి క్షేత్రానికి ఓ విశిష్ట ప్రత్యేకతను సంతరింప చేసిన శ్రీ యమధర్మరాజు స్వామి ఆలయం భక్తులకు ప్రాంగణంలోకి రాగానే అగుపించేది. ప్రస్తుతం బొమ్మలు, గాజుల దుకాణం, విస్తరించడంతో శ్రీ ధర్మరాజు స్వామి వారి ఆలయం కోసం కొన్ని నిమిషాల పాటు తేరిపార చూడాల్సిన దుస్థితి భక్తులకు ఏర్పడింది. ప్రతి భరణి నక్షత్రం రోజున శ్రీ స్వామివారికి అభిషేకం, ఆయుష్ హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలను, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

వెంకటేశ్వర స్వామి ఆలయం మండపంలో స్టాక్ నిలువలు

అయితే అగ్రిమెంట్ నిబంధనలకు విరుద్ధంగా దుకాణం విస్తరించినా, బొమ్మల, గాజుల నిలువలు (స్టాక్) శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మంటపంలో కాటన్ బాక్సులు పెట్టినా, కాళీ కాటన్ డబ్బాలు అక్కడే వదిలేసినా ,

కాళీ కాటన్ డబ్బాలు అక్కడే..

దుకాణం కు కేటాయించినా, స్థలం కంటే అదనంగా విస్తరించినా, పట్టించుకునే, ప్రశ్నించే అధికారి లేడు, అనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి ఉదంతాలు వెలుగు చూసిన సందర్భాల్లో ఆ ఉదంతాలపై చర్చలు జరుగుతాయి తప్ప, బాధ్యులపై చర్యలు ఉండవు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజుల శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలకు హాజరు కాలేదని కొందరు వేద పండితులకు ఆలయ అధికారులు మెమోలు జారీ చేసినట్టు సమాచారం.