నేడు డా॥ సతీష్ ధావన్ జయంతి !
***
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అవడంతో నేడు ఇస్రో అంటే అందరికీ ఆసక్తి పెరిగింది. దీని అభివృద్ధికి ఎందరో కృషి చేశారు.విక్రం సారాభాయ్ నుండి నేటి సోమనాధ్ వరకు అందరూ విశేష కృషి చేశారు. అటువంటి వారిలో ధావన్ ఒకరు.
మాజీ రాష్ట్రపతి డా. కలామ్ గారు స్వయంగా పలు సందర్భాలలో డాక్టర్ సతీష్ ధావన్ గారి గురించి చెప్పిన మాటలు….
అది 1975. ఇస్రోలో తాను (కలాం గారు) డైరెక్టరుగా ఉన్న సమయం. ఆరోజు ఎన్. ఎల్.వి. మిషన్లో భాగంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రయోగించిన ఉపగ్రహం విఫలమైంది. ఆ ఉపగ్రహం తిన్నగా బంగాళాఖాతంలో పడింది. పత్రికా విలేకరులకు వారి ద్వారా బయట ప్రపంచానికి ఈ విషయం చెప్పవలసి వచ్చింది. నేను ఎలా చెప్పాలో తెలియక ఖిన్నుడయ్యాను. సరిగా అదే సమయంలో పత్రికా విలేకర్ల సమావేశంలో మా చైర్మన్ సతీష్ ధావన్ గారు బాధ్యతతో విలేకరులతో “మా ప్రయోగం విఫలమైంది. ఉపగ్రహంలోని ఇంధనం కారిపోయింది. ఎక్కువ ఇంధనం ఉంది. కొంత కారిపోయినా ప్రమాదం లేదనుకున్నాము. కానీ మా అంచనా తప్పింది. దీనికంతటికి నేనే బాధ్యుడను.డా| కలామ్ గానీ అతని సహచరులు గానీ ఈ పొరపాటుకు బాధ్యులు కారు,ఈ పర్యాయం మేం విజయం సాధించలేకపోయాం. నాకు నా టీమ్ మీద పూర్తి విశ్వాసం ఉంది, మళ్ళీ ప్రయత్నంలో తప్పక విజయం సాధిస్తాం” అని ధైర్యంగా చెప్పారు. అని పరాజయాన్ని తన మీద వేసుకున్నారు.
1980లో అదే ప్రయోగం సఫలమైంది. భారతదేశం అంతరిక్ష క్షేత్రంలో కాలు మోపిన శుభగడియ. దీనికంతటికీ ఆధ్యుడు చైర్మన్ సతీష్ ధావన్ . అప్పుడు మరలా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటైంది. ఈ పర్యాయం ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్ తెరపరుగున ఉండి నన్ను నా సహచరులును సఫలమైన ప్రయోగం గురించి మీడియాకుతెలియజేయమన్నారు. అది డా॥ సతీష్ దావన్ ఔదార్యం, నాయకత్వ లక్షణం అని చెప్పి ఆయన మంచి తనానికి కలాం గారు పలుమార్లు జోహార్లు అర్పించారు. దేశ హితం కోసం నిర్విరామంగా, నిస్వార్ధంగా ఆయన చేసిన సేవను మించిన తపస్సు లేదు అనేవారు.

1920 సెప్టెంబర్ 25న కశ్మీర్ లోని శ్రీనగర్లో జన్మించిన సతీశ్ ధవన్ అంతరిక్ష విజ్ఞానశాస్త్రంలో చాలా పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తి. ఆయన సేవాకాలంలోనే భారతదేశం ఎస్. ఎల్.వి. అంతరిక్షనౌకలను ప్రయోగించింది. నేడు భారతదేశం ఈ రంగంలో అత్యుత్తమ స్థానంలో ఉందంటే కారణం డాక్టర్ ధవన్. ధావన్ లాహోరలోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. అప్పుడు భారతదేశం బ్రిటిషు పాలనలో ఉండేది. అప్పటికింకా పాకిస్తాన్ ఏర్పడలేదు. లాహోర్లోనే మెకానికల్ ఇంజనీరింగు చదివి (1947) ఇంగ్లీషు లిటరేచరులో మాస్టరు ఆఫ్ ఆర్ట్ డిగ్రీ చేశారు. అయినా ఆయన విద్యాపిపాస చల్లారలేదు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసాటా నుంచి ఎయిర్ స్పేస్ అంశంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చదివారు. అప్పటికీ ఆయన తృప్తి పడలేదు. చదువు చాలించలేదు. కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఏరో నాటికల్ ఇంజనీరింగు డిగ్రీ చదివారు.
తదనంతరం డా.హన్స్ డబ్ల్యూ లోపమేన్ సలహాతో, ఆయన పర్యవేక్షణలోనే రెండు డాక్టరేట్లు (మేథమేటిక్స్, ఎయిర్ స్పేస్ ఇంజీనిరింగు) చేసి డాక్టరేటు పట్టా పొందారు. అదే యూనివర్సిటీలో కొంతకాలం పనిచేశారు. తర్వాత భారతదేశంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నేషనల్ ఎయిర్ స్టేస్ లేబరేటరీస్లో పనిచేయడమే కాక, సేన్ కమీషన్ చైర్మన్ గా, ఇసో సెక్రటరీగా కొంతకాలం పనిచేశారు.
1972లో ఇస్రో ఛైర్మన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆయన ఇస్రోలో చైర్మన్ గా పనిచేస్తున్న కాలంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డా||ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ఇస్రోలో డైరెక్టరుగా పనిచేసేవారు.ఎయిర్ స్పేస్ రంగంలో ధవన్ అకుంఠిత దీక్షతో పని చేసారు. ఆయన చేసిన ముఖ్యమైన పరిశోధనల పత్రాల విషయాలు బౌండరీ లేయర్ థీరీ అనే పుస్తకంలో చోటు చేసుకున్నాయి. డా॥ సతీశ్ ధావన్ ఏ పని చేసినా అది సమాజ మేలుకోరి చేసినదే.
81 సంవత్సరాల వయసులో 2002, జనవరి 3 న బెంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు.1971లో పద్మభూషణ్, 1981లో పద్మవిభూషణ్, 1999లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డులు ఆయన పొందారు.ఆయన గౌరవార్థం శ్రీహరికోటలో షార్ కేంద్రానికి సతీష్ ధావన్ షార్ కేంద్రంగా పేరుపెట్టబడింది.
వ్యాసకర్త : యం.రాం ప్రదీప్, జేవివి . తిరువూరు
మొబైల్ : 9492712836