J.SURENDER KUMAR,
దేశాన్నే గడగడలాడించి హిట్ టార్గెట్ అయిన ఓ మావోయిస్ట్ అగ్రనేత పేరు గురించి చెప్పుకునే ముందు. అసలు పేరుకెందుకంత విలువ… ఆయన ఆ పేరు పెట్టుకోవడం వెనుక కారణాలేంటో ఓసారి చూద్దాం…
పేరుకెంత విలువుందో… పుట్టిన తమ పిల్లలకు ఈనాటి తల్లిదండ్రులు పెట్టే పేర్ల గురించిన అన్వేషణ, చూపించే ఆసక్తిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తమ బిడ్డ పేరు విభిన్నంగా ఉండాలని.. అంతకు ముందెవ్వరికీ అలాంటి పేరుండకూడదని… అలాగే, ఆ పేరు అందరికీ ఆమోద యోగ్యమవ్వాలనీ, ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే పేరులోనేముంది అని ప్రశ్నించేవాళ్లకు… పేరులో’ నే ఉంది ‘ అనే బదులు సమాధానం నేటి తల్లిదండ్రుల నుంచి ఠకీమని వస్తుంది.
ఇక సంప్రదాయ కుటుంబ చరిత్ర కల్గిన భారత్ లో ఇప్పుడంటే కొత్త పేర్లు కొంత ఆశ్చర్యపరుస్తున్నాయేమోగానీ… నాటి తరాల నుంచీ మొన్న మొన్నటివరకూ తాతలు, తండ్రుల పేర్లను… లేదా, ఏదైనా దైవం పేరు వచ్చేలా పిల్లలకు పేర్లు పెట్టడం ఓ ఆనవాయితీగా వస్తోంది. తమ పిల్లల పేర్లలో ఆ దైవనామస్మరణ ఉంటే బాగుంటందనుకోవడమో… లేక, తమ కొడుకు రాముడిలా ఆదర్శ పురుషుడిగా ఎదగాలన్న తపనో.. లేక, జీవితంలో కొంత లౌక్యమవసరమనుకునేవాళ్లు కృష్ణుడిలా కొంటెగా ఉండాలని కోరుకోవడమో.. ఇలా ఏదో ఒక బలమైన కారణం ఒక పేరు పెట్టడం వెనుక కచ్చితంగా ఉండి ఉంటుంది. పుట్టిన ఓ బాబుకో, పాపకో పేరు పెట్టడం వెనుక ఇంత ఆలోచనా కసరత్తు ఉన్న నేపథ్యంలో.. ఓ మావోయిస్ట్ అగ్రనేత పేరు వెనుక ఎలాంటి కసరత్తు జరిగింది… పేరుకు భిన్నంగా కనిపించే ఆ అగ్రనేత.. మరి ఆ పేరే ఎందుకు పెట్టుకున్నట్టో ఓసారి తెలుసుకుందాం.
గణేషుడి పేరును.. గణేష్ , విఘ్నేష్ , లక్ష్మీగణేష్ ఇలా రకరకాల పేర్లతో తమ పిల్లలకు పెట్టుకోవడం చూస్తుంటాం. అలాగే కొందరు గణపతి అని కూడా పెట్టుకునేవారున్నారు. అందులో ఒకరు పీపుల్స్ వార్ చీఫ్ గణపతి కూడా ఒకరు. మరి గణపతి మీద భక్తితో పీపుల్స్ వార్ చీఫ్ గణపతి తన పేరును గణపతి అని పెట్టుకున్నారా..? వామపక్ష భావజాలమున్న వాళ్లు ఆల్ మోస్ట్ నాస్తికత్వం లేదా.. హేతువాదుల్లానే కనిపిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ఒక్క కుదుపు కుదిపిన మావోయిస్ట్ ఉద్యమంలో తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమనే కాన్సెప్ట్ తో బరిలోకి దిగి గిరిగీసి కొట్లాడిన మావోయిస్ట్ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావ్, అలియాస్ గణపతి.. తన పేరులో ఆది దేవుడైన గణనాథుడి పేరు వచ్చేలా పెట్టుకోవడం వెనుక కారణమేంటి..? మావోయిస్టులు, పీపుల్స్ వార్, జనశక్తి నక్సలైట్స్ వంటి అంశాల గురించి ఎన్నో వార్తా కథనాలు ఇప్పటివరకూ జనబాహూళ్యంలో కనిపించినా… గణపతి వంటి అగ్ర మావోయిస్ట్ నేత పేరు వెనుక మర్మమేంటన్న కోణంలో మాత్రం ఎక్కడా మనకు ఆ అన్వేషణ కనిపించదు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ నుంచి ఉద్యమమే ఊపిరిగా ఎదిగాడు గణపతి. ఉన్న ఊరును, ఉన్నత ఉద్యోగాన్ని, కుటుంబ సభ్యులను, భార్యా పిల్లలను ఇలా అందరినీ కాదనుకున్న త్యాగనిరతి గణపతంటే. రాజ్యంలో కనిపిస్తున్న బూర్జువా, పెట్టుబడిదారీ, నియంతృత్వ, దొరల పెత్తనంపై ఘీంకరించి.. వామపక్ష భావజాలానికి ఆకర్షితుడై తుపాకీగొట్టం ద్వారానే బడుగు, బలహీనవర్గాల సంక్షేమం సాధ్యమనే కాంక్షతో అరణ్యవాసం చేస్తున్నవాడు గణపతంటే! అలాంటి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి అనే పేరు తల్లిదండ్రులు పెట్టిందేమీ కాకపోవడమే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం. ఆ వినాయకుడిపైన భక్తితోనో… ఆ ఆదిదేవుడిపైనున్న విశ్వాసంతోనో ముప్పాల లక్ష్మణ్ రావు, గణపతిగా రూపాంతరం చెందాడనుకుంటే వాళ్లు బొత్తిగా సరైన కారణాన్ని అన్వేషించిన హేతువాదులు కానట్టే లెక్క!
గణపతి పేరు వెనుక మర్మమేంటి..?
ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి పేరు వెనుక మర్మమేంటన్నది తెలుసుకోవాలంటే మరో ఐదు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. అదీ శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతానికి వెళ్లి.. అక్కడి ఓ నక్సలైట్ నాయకుడి చరిత్రను ఓసారి పరిశీలించాలి. పలాస మండలం బొడ్డపాడులో లో జన్మించిన తామాడ గణపతి గురించి తెలుసుకోవాలి. రామకృష్ణ పరమహంస, వివేకానందుడి వంటి ఆధ్యాత్మికవేత్తల చరిత్రలపై మక్కువ పెంచుకున్న తామాడ గణపతి.. అగ్రవర్ణంలో పుట్టినా.. నిమ్నవర్గాల శ్రేయస్సుకై పరితపించాడు. గణపతి కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజర్‌గా మారి 1954లో బొడ్డపాడు యువజన సంఘం బ్యానర్‌లో కృష్ణమూర్తితో పాటు యువకులను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి గ్రామంలో యువతను చైతన్యవంతం చేశారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఆ ప్రాంత ప్రజల మనస్సు చూరగొన్నాడు. నాడు ప్రజాకోర్టులు నిర్వహించి.. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిని శిక్షించడం సర్వసాధారణంగా కొనసాగుతున్న రోజులవి. ఆ సమయంలో ప్రజాకోర్ట్ ఆదేశానుసారం ప్రజాశత్రువుగా భావించిన కామేశుణ్ని తన దళంతో వెళ్లి హతమార్చాడు తామాడ గణపతి. నాటి బూర్జూవాల పాలనతో అతలాకుతలమవుతున్న సోంపేట తాలూకా విముక్తి పోరాటానికి నాయకత్వం వహించిన తామాడ గణపతి.. తన సహచరుడు చాగంటి భాస్కర్ రావుతో కలిసి శత్రువుల చేత చిక్కాడు. ఆ తర్వాత 1969, సెప్టెంబర్ 22 న పోలీసులు తామాడ గణపతిని కాల్చిచంపిన ఎన్ కౌంటర్ ఘటనలో తామాడ అసువులు బాసాడు.
అలా నాటి తామాడ గణపతి ప్రభావానికి గురైన వ్యక్తే జగిత్యాల జిల్లా బీర్పూర్ కు చెందిన ముప్పాల లక్ష్మణ్ రావు, అలియాస్ గణపతి.. నేటి వార్ అగ్రనేత. తపాలాపూర్ ఘటనలో కూడా గణపతి పేరు అప్పటికి ‘ రాధాకృష్ణ’ గానే ఉండేది. కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో 1976 సెప్టెంబర్ లో ఆదిలాబాద్ జిల్లాలోని తపాలాపూర్ కు చెందిన ఓ భూస్వామిని, అతని కుమారులను హతమార్చిన సంఘటనలో మొత్తం 16 మందిపై ప్రస్తుతం జన్నారంలో ఉన్న నాటి కలమడుగు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అందులో A1గా కొండపల్లి
సీతారామయ్య, A2 డాక్టర్ చిరంజీవితో పాటు మరో 14 మందిలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతిపై A8 గా రాధాకృష్ణ పేరుతో ఎఫ్ఐఆర్ నమోదై.. లక్షేటిపేట్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లులోనూ లక్ష్మణరావు అలియాస్ రాధాకృష్ణ అలియాస్ మల్లన్నగా పేర్కొనడం గమనార్హం.
కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడిగా, హుస్నాబాద్ ఏరియా దళ నాయకుడిగా కొనసాగిన సమయం నుంచి మొదలుకుంటే.. 1992లో వార్ రాష్ట్ర కార్యదర్శిగా గణపతి పేరు రోజురోజకూ ప్రాచుర్యాన్ని పొందింది. నేటికీ ముప్పాల లక్ష్మణ్ రావ్ అలియాస్ గణపతి అనే ఓ బీర్పూర్ వాసి పేరు వింటే యావత్ దేశం వెంట్రుకలు నిక్కబొడ్చుకోవాల్సిందే.
ఓ ఉపాధ్యాయుడు..

1972-73లో అజ్ఞాతవాసం పట్టి.. మావోయిస్ట్ ఉద్యమ అగ్రనేతగా ఎదిగి అయినవారందరికీ దూరమైపోయిన ఓ విశేష జీవిత చరిత్ర గణపతి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా.. తన తలకు ₹ 2 కోట్ల పైన రివార్డ్ ను ప్రకటింపజేసుకున్న పీపుల్స్ వార్ ఆదిదేవుడిగా ఎదిగిన నాయకుడు గణపతి. పుట్టింది అగ్రవర్ణంలో. నియంతగా శాసించే అవకాశం ఉన్న కుటుంబంలో. బాంఛన్ దొర అని పిలిపించుకునే స్థాయిలో.. దర్జాగా జీవితాన్ని అనుభవించే ఆస్తులున్న కుటుంబంలో.. కానీ తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కూడా తోసిరాజని.. అణగారిన వర్గాల పట్ల సానుభూతి, దయ, ప్రేమ, వారి వ్యథల పట్ల ఉన్న కన్సర్న్ తో.. బందూకు చేతపట్టిన రాజ్య తిరుగుబాటుదారుడు.. మొత్తంగా నిస్వార్థజీవి గణపతి.
ఇప్పటికీ ఇంకా గణపతి అంతు చిక్కనేలేదు. ఆయన జాడ తెలియనే లేదు. ఆయన్ని మట్టుబెట్టాలనుకునేవారి నెత్తుటి కలలకు ఎర్రతివాచీ పర్చినా.. అంతుచిక్కని అదృశ్యశక్తైన మాయావి గణపతి. ఆయనెప్పుడూ రాజ్యానికి పెనుసవాల్ గానే నిల్చాడు. విప్లవ సాహిత్యాన్ని అణువణువునా నింపుకుని.. చీమలు దూరని చిట్టడవుల్లో.. కాకులు దూరని కీకారణ్యంలో.. శిక్షణలతో.. మందుపాతర్లతో.. ఎదురు కాల్పులతో సహవాసం చేస్తూ.. వాటినే తన ఎర్రరక్త కణాలుగా చేసుకుని బతికేస్తున్న అడవిమనిషి గణపతి. భూమికోసం.. భుక్తికోసం అడవిబాట పట్టి.. నిమ్నవర్గాల సంక్షేమంకై తన జీవితాన్నే త్యాగం చేసిన గణపతి జీవితం ఓ జంగల్ మహల్.. అంతేకాదు, ఏ జనం కోసమైతే తన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడో వారందరికీ జనం మహల్ కూడా ఆ గణపతే!
అయితే ఈ గణపతి చవితి రోజున.. ఎవరైనా ముప్పాల లక్ష్మణ్ రావ్, అలియాస్ గణపతి.. తన పేరును గణపతిగా ఎందుకు మార్చుకున్నాడన్న డౌట్ లో ఉంటే గనుక.. అందులోనూ అది ఆదిదేవుడిపై భక్తి, విశ్వాసంతోనే అని అనుకుంటే గనుక… ఆ అభిప్రాయం తప్పేమో ఓసారి పరిశీలించాల్సిన సమయమిది. ముప్పాల లక్ష్మణ్ రావ్ తన పేరును గణపతిగా మార్చుకునే నేపథ్యంలో.. వామపక్ష ఉద్యమ కీలక పాత్రధారుడైన శ్రీకాకుళం జిల్లా బొడ్డనపాడువాసి తామాడ గణపతి ప్రభావమే అందుకు ప్రధాన కారణమనీ గమనించాలి.