J.SURENDER KUMAR,
నవంబర్ లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలిచి.. హ్యాట్రిక్ సాధించబోతున్నామని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది.
సీఎం కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రి హరీశ్‌రావు, నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, రఘోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత విద్యుత్, తాగు నీటి సమస్యలు పరిష్కరించాను అని కేసీఆర్. వివరించారు.
గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం.. ప్రతి నెల ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గానికి కేటాయిస్తానని చెప్పారు. ప్రజల మధ్యే గడుపుతూ అభివృద్ధి సమీక్షిస్తానని తెలిపారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారం పది రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్ష ద్వారా తగిన ఆదేశాలు జారీ చేస్తానన్నారు. ఈ క్రమంలోనే తాను గెలిచిన తర్వాత మళ్లీ సీఎం హోదాలో తొలి సమావేశం ఈ హాలులోనే ఏర్పాటు చేసుకుందామని.. గజ్వేల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతానని కేసీఆర్ స్పష్టం చేశారు.