డిసెంబర్ లో తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ !

👉 రక్షణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ ను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజ‌రు కావాల‌ని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ ను ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. స‌దస్సులో భాగంగా నిర్వహించే డిఫెన్స్ ఎక్స్‌పో 2026ను ప్రారంభించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు.

👉 ముఖ్య‌మంత్రి  పలువురు ఎంపీలతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి  తెలిపారు.


👉 దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే డిఫెన్స్ ఎక్స్‌పోకు రక్షణ శాఖ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే రక్షణ ఎక్స్‌పో-2026కు స్వాగతం పలికేందుకు తమ ప్రభుత్వం ఎదురుచూస్తోందని వివరించారు.


👉 అంతర్జాతీయ ప్రమాణాలతో రక్షణ ఎక్స్‌పో-2026ను విజయవంతంగా నిర్వహించేందుకు రక్షణ శాఖ సహకరించాలని కేంద్ర మంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని కోరారు.


👉 స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు కూడా సహకరించాలని ముఖ్యమంత్రి గారు కోరారు. సైనిక, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయాలని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.


👉 హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, ఎండీఎల్‌ తదితర రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, DRDO ప్రయోగశాలలు రక్షణ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాలని కోరారు. విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


👉 ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాలు భూసేకరణ చేపట్టిందని రాజ్‌నాథ్ సింగ్ గారికి ముఖ్యమంత్రి  వివరించారు. రక్షణ శాఖ కోరినట్లు మొత్తం 1500 ఎకరాలు కోరినందున, మరో 750 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.


👉 మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (DRDL) ఆధ్వర్యంలో చేప‌ట్ట‌నున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇప్పటికే TGIIC అంగీకరించిందని చెప్పారు. ఎకరానికి కాకుండా మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం ₹ 1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. అవసరమైతే దానిని మరో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవకాశం ఉందని చెప్పారు.


👉 కేంద్ర మంత్రి తో జరిగిన సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , డాక్టర్ మల్లు రవి, సురేష్ కుమార్ షెట్కార్ , పోరిక బలరాం నాయక్ , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్‌) హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు  పాల్గొన్నారు.