చెరువులు బతికితేనే హైదరాబాద్ బతుకుతుంది !

👉 ఆక్రమణల నుంచి విముక్తి.. పునరుజ్జీవంతో జలవనరులకు కొత్త జీవం!

👉 మూసీ ప్రక్షాళనకు అనుమతులన్నీ పూర్తి.. త్వరలో టెండర్లు

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


J.SURENDER KUMAR,

ఒకప్పుడు వందలాది చెరువులు.. ప్రకృతి అందాలతో అలరారిన హైదరాబాద్ నగరం.. నేడు చిన్నపాటి వర్షానికే జలమయం అవుతోంది. రోడ్లు చెరువులవుతున్నాయి.. బస్తీలు నీట మునుగుతున్నాయి.. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీనికి కారణం ప్రకృతి వైపరీత్యం ఒక్కటే కాదు.. ప్రకృతి ప్రసాదించిన చెరువులు, నాలాలు, జలవనరులను మనమే ఆక్రమించుకోవడం కూడా నీరు నిలవాల్సిన చోట నిర్మాణాలు చేపడితే.. చివరకు మన నివాసాలనే వరద నీరు ముంచెత్తుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించి చెరువులకు పునర్జీవం పోయడం, ఆక్రమణల నుంచి విముక్తి కల్పించడం, జలవనరులను భవిష్యత్తు తరాలకు అందించడం అత్యవసరంగా మారింది.

👉 చెరువుల పునరుద్ధరణతో పర్యావరణానికి కొత్త ఊపిరి!

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం ఈ దిశగా ప్రాధాన్యత సంతరించుకుంది. 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును సుమారు 30 ఎకరాలకు విస్తరించి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పునరుద్ధరణకు సినీనటుడు అక్కినేని నాగార్జున రెండు ఎకరాల స్థలాన్ని అందించి సహకరించారని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

👉 ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..

హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్ అండ్ రాక్స్ అని, ఒకప్పుడు నగరంలో 1,372 చెరువులు ఉండేవని, వివిధ కారణాలతో వాటిలో సుమారు 50 శాతం కనుమరుగయ్యాయని గుర్తుచేశారు. ఆక్రమణలు, పట్టణీకరణ, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా జలవనరులు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు.

👉 చెరువులు ఎందుకు అవసరం?

చెరువు అంటే కేవలం నీరు నిల్వ ఉండే ప్రదేశం కాదు. అది ఒక ప్రాంతానికి సహజమైన రక్షణ కవచం. వర్షాకాలంలో వరద నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాలను పెంచి, పరిసర ప్రాంతాల పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. పక్షులకు, జలచరాలకు ఆవాసంగా నిలుస్తుంది. వేసవిలో నీటి కొరత తీవ్రతను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

చెరువులు ఆక్రమణలకు గురైతే వర్షపు నీటికి వెళ్లే దారి మూసుకుపోతుంది. ఫలితంగా కాలనీలు, రహదారులు ముంపునకు గురవుతాయి. భూగర్భ జలాలు తగ్గిపోతాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అందుకే చెరువుల పరిరక్షణ అనేది ఒక ప్రభుత్వ శాఖకు సంబంధించిన పని మాత్రమే కాదు.. సమాజమంతటి బాధ్యత.

👉 హైడ్రా చర్యలు.. జలవనరులకు పునర్జీవం !

నగరంలోని తమ్మిడికుంటతో పాటు బతుకమ్మకుంట, బుమ్-రుక్నుద్దౌలా, సున్నం చెరువు, నల్లచెరువు, ఫాక్స్ సాగర్, మియాపూర్ చెరువు తదితర జలవనరుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
చెరువుల ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణ, సుందరీకరణలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

👉 మూసీ ప్రక్షాళన.. హైదరాబాద్ భవిష్యత్తుకు కీలకం.!

55 కిలోమీటర్ల పొడవున్న మూసీ నదిలో తొలివిడతగా 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులన్నీ లభించాయని, త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

మూసీ ప్రక్షాళన కేవలం సుందరీకరణ కార్యక్రమం కాదని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, నగర ఆర్థిక అభివృద్ధితో ముడిపడిన కార్యక్రమమని వివరించారు. మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించారు.

👉 చరిత్ర చెబుతున్న జలవనరుల ప్రాధాన్యత !

1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వరదలు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఆ విపత్తు తర్వాత నిజాం ప్రభుత్వం ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను వినియోగించుకుని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించింది. వందేళ్లకు పైగా గడిచినా నేటికీ ఆ జలాశయాలు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడంలో కీలకంగా ఉన్నాయి. అంటే ప్రకృతి వనరులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మన చరిత్రే చెబుతోంది. గత తరాలు నిర్మించిన జలవనరులు నేటి తరానికి ఉపయోగపడుతున్నట్లే.. మనం కాపాడే చెరువులు రేపటి తరాలకు జీవనాధారంగా నిలవాలి.

👉 సుందరీకరణతో పాటు నిర్వహణ కూడా ముఖ్యం!

తమ్మిడికుంట చెరువును పునరుద్ధరించినంత మాత్రాన బాధ్యత పూర్తికాదని, నిరంతర నిర్వహణతోనే దాని ప్రయోజనాలు ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్‌తో పాటు ఇందిరా మహిళా శక్తి మహిళలకు నిర్వహణ బాధ్యతల్లో భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. మహిళా శక్తి స్టాళ్ల ద్వారా చిన్నచిన్న ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తూ లేక్ ఎకానమీని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.
చెరువుల పరిసరాలు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలుగా నిలవాలని, మన సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలని సూచించారు.

👉 ప్రకృతిని కాపాడటం.. మనల్ని మనం కాపాడుకోవడమే!

హైదరాబాద్ అభివృద్ధి అంటే ఆకాశహర్మ్యాలు, విశాలమైన రహదారులు, ఐటీ కారిడార్లు మాత్రమే కాదు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పచ్చదనం, ఆరోగ్యకరమైన జీవన వాతావరణం కల్పించడం కూడా నిజమైన అభివృద్ధిలో భాగమే.
చెరువులను ఆక్రమణల నుంచి కాపాడటం, నాలాల ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడటం, మురుగునీరు నదుల్లో కలవకుండా శుద్ధి చేయడం, పునరుద్ధరించిన జలవనరులను నిరంతరం నిర్వహించడం ప్రభుత్వంతో పాటు పౌరుల బాధ్యత కూడా.


👉 పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీనటుడు అక్కినేని నాగార్జున  విశిష్ట అతిథిగా, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , వేం నరేందర్ రెడ్డి , కొండా విశ్వేశ్వర రెడ్డి , కుందూరు రఘువీర్ రెడ్డి  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గద్వాల విజయలక్ష్మి , శాసనమండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి , పలువురు ప్రజాప్రతినిధులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.