👉 త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభ. !
J.SURENDER KUMAR,
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులకు తగిన గౌరవం, అధికారిక గుర్తింపు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అర్హులైన ఉద్యమకారుల వివరాలను నమోదు చేసుకునేందుకు ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది.
శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఈ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె. కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి, శ్యామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో ఇప్పటివరకు జరిగిన పురోగతిని సభ్యులు సమీక్షించారు. వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు, కళాకారులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో ఇప్పటికే నిర్వహించిన సంప్రదింపుల వివరాలను ఈ సమావేశంలో చర్చించారు.

ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా సాగాలంటే ఆన్‌లైన్ నమోదు కీలకమని కమిటీ అభిప్రాయపడింది. ఇందుకోసం రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్‌సైట్ ప్రస్తుత స్థితిగతులను పరిశీలించి, త్వరలోనే దాని ప్రారంభ తేదీని ప్రకటించాలని సభ్యులు నిర్ణయించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలతో పాటు, ఉద్యమ సమయంలో జైలు జీవితం గడిపిన వారు, పోలీసు కేసులు ఎదుర్కొన్న వారు, గాయపడిన వారిని అధికారికంగా గుర్తించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఈ ఆకాంక్షను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మే 2026లో సాధారణ పరిపాలన శాఖ ద్వారా జీఓ ఆర్టీ నంబర్ 679 జారీ చేసి, డాక్టర్ కేశవరావు సారథ్యంలో ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
