ధర్మపురిని ఆదర్శ పుష్కర క్షేత్రంగా తీర్చిదిద్దుతాం!

👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో ముందస్తు కార్యాచరణ !


👉 ధర్మపురి అభివృద్ధికి ఇప్పటికే ₹117 కోట్లు.. అదనంగా ₹50–60 కోట్ల ప్రతిపాదన!


👉 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీక్ష!


J.SUERENDER KUMAR,

2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ధర్మపురిలో ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.



👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో బాసర నుంచి భద్రాచలం వరకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

👉 గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹ 1,000 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించగా, అందులో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి ₹117 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ నిధులతో పుష్కర ఘాట్లు, రహదారులు, ఆలయ పరిసరాల అభివృద్ధి, ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం వంటి కీలక పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

👉 ధర్మపురిలో భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగేందుకు అదనంగా ₹ 50–60 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. కొత్త బ్రిడ్జి, వీఐపీ ఘాట్, ప్రత్యామ్నాయ రహదారులు, రాయపట్నం వైపు నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక ప్రవేశ–నిష్క్రమణ మార్గాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు వివరించారు.

👉 అదేవిధంగా కోటిలింగాల కోటీశ్వర స్వామి ఆలయానికి హైవే నుంచి నేరుగా చేరుకునే డబుల్ రోడ్డు నిర్మాణాన్ని కూడా ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ అంశాలపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

👉 రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రశంసనీయమని మంత్రి అన్నారు. ధర్మపురిని కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

👉 రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను టెంపుల్ సిటీలుగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. బాసర, శ్రీకాళేశ్వరం, భద్రాద్రి, యాదాద్రి తరహాలో ధర్మపురి కూడా ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాబోయే గోదావరి పుష్కరాల విజయవంతమైన నిర్వహణకు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సహకరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.