జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల భూమి !


👉 అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యా విప్లవానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం !

👉 మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ గురువారం రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.

👉 జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ద్వారా జిల్లా విద్యార్థులకు సీబీఎస్ఈ విధానంలో నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగుల పిల్లలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మెరుగైన విద్యా అవకాశాలు విస్తరించనున్నాయని మంత్రి పేర్కొన్నారు.


👉 ఈ విద్యాలయం జిల్లా విద్యా ప్రగతికి అలాగే పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, జాతీయ స్థాయి అవకాశాలకు విద్యార్థులను మరింత సన్నద్ధం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


👉 కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయింపుపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం జగిత్యాల ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చిందన్నారు. విద్యాభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభంగా భావిస్తూ దూరదృష్టితో నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి జగిత్యాల జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


👉 “విద్య అందరికీ అందుబాటులోకి వస్తేనే సమానత్వ తెలంగాణ సాకారమవుతుంది”  అనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం అంబేద్కర్ ఆశయాల సాకార దిశగా మరో ముందడుగేనని పేర్కొన్నారు. విద్యా రంగానికి ప్రజా ప్రభుత్వం ఇస్తున్న అత్యున్నత ప్రాధాన్యతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.


👉 రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యనే సామాజిక మార్పుకు ప్రధాన ఆయుధంగా భావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేస్తున్నాయని తెలిపారు.


👉 విద్య ద్వారా పేదరికం, వివక్ష, వెనుకబాటుతనాన్ని అధిగమించవచ్చని డా. అంబేద్కర్ బోధించిన స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.


👉 ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, గురుకుల విద్యా సంస్థల అభివృద్ధి, నాణ్యమైన మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు సమాన అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.