మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలు !

👉 గవర్నర్‌కు వివరించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివరించారు. నషా ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో  గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నషా ముక్తి భారత్ కార్యక్రమం, ఈగల్ టీం ద్వారా చేపడుతున్న నిఘా, నియంత్రణ చర్యలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన నమోదైన కేసులు, అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలను గవర్నర్‌కు వివరించారు.

యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్న కార్యక్రమాలను గవర్నర్ వివరించారు.

ప్రతి జిల్లాలో నషా ముక్తి భారత్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ, విద్యార్థులు, యువతలో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.


మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ సమిష్టిగా పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని మంత్రి పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రహిత తెలంగాణ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని  మంత్రి  లక్ష్మణ్ కుమార్ వివరించారు.