మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం !

👉 ఈగల్ వ్యవస్థతో డ్రగ్స్ ముఠాలపై నిరంతర నిఘా నషా ముక్త్ తెలంగాణకు సమిష్టి సంకల్పం !


👉 ప్రతి జిల్లాలో నషా ముక్త్ భారత్ అభియాన్‌ను ఉద్యమంలా నిర్వహించాలి !


👉 సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువత భవిష్యత్తు పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ !


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను ఛిన్నాభిన్నం చేసే సామాజిక విపత్తుగా మారుతోందని, దీనిని అరికట్టడం కేవలం పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నషా ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్  శివ ప్రతాప్ శుక్లాతో కలిసి పాల్గొన్నారు
.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ...

కుటుంబాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా సమన్వయంతో ముందుకు సాగితేనే మత్తు రహిత తెలంగాణ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృత ప్రజా చైతన్య ఉద్యమంగా నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు.


👉 ప్రతి జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు యంత్రాంగం, విద్యా శాఖలు, సంక్షేమ శాఖలు, యువజన సంఘాలు కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.


👉 గ్రామ స్థాయి నుంచి పట్టణ వార్డుల వరకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.


👉 ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుందని మంత్రి తెలిపారు.

👉 మత్తు పదార్థాల సరఫరా గొలుసును ఛేదించేందుకు, అక్రమ రవాణా మార్గాలను గుర్తించేందుకు, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఈగల్ విభాగం ద్వారా డ్రగ్స్ ముఠాలు, సరఫరాదారులు, వినియోగదారుల నెట్‌వర్క్‌లపై నిఘా మరింత బలోపేతం అవుతోందని చెప్పారు.


👉 డ్రగ్స్ కేసుల్లో ఎటువంటి రాజీ ఉండబోదని, యువతను మత్తు బారిన పడేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో, మత్తు అలవాటుకు గురైన యువతను నేరస్థులుగా చూడకుండా వారికి వైద్య సహాయం, కౌన్సెలింగ్, పునరావాసం అందించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.


👉 పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, హాస్టళ్లు, విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, కౌన్సెలింగ్ శిబిరాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.


👉 తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహ వర్గం, అలవాట్లపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


👉 “మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం యువత భవిష్యత్తును కాపాడుకోవడానికి తొలి అడుగు. ఆరోగ్యవంతమైన యువతే బలమైన తెలంగాణకు పునాది” అని మంత్రి అన్నారు.


👉 ప్రతి కుటుంబం మత్తు వ్యతిరేక సందేశాన్ని తమ ఇంటి నుంచే ప్రారంభించాలని, ప్రతి విద్యార్థి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటానని సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు.

👉నషా ముక్త్ భారత్ అభియాన్‌ను ప్రతి జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో అందరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు నిచ్చారు.