సంక్షేమ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి !

👉 పెద్దపల్లి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో..

👉 ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి  శ్రీధర్ బాబు !

J SURENDER KUMAR,

సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు.

పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రోటోకాల్ & ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణు గోపాల్ , ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు ,జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పెద్దపల్లి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.

వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, ఇరిగేషన్ , పంచాయతీరాజ్,పట్టణాభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్లు, వైద్య శాఖ, విద్యా శాఖ, ఎస్సి, తీసి, మైనారిటీ సంక్షేమ శాఖ, పరిశ్రమల, రెవెన్యూ శాఖ, వీబీజీ రామ్ జీ, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా , అటవీ శాఖ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

👉  సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… …

ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా రెండున్నర సంవత్సరాలకు పైగా పదవీకాలం ఉందని, ఈ కాలంలో ప్రతి అధికారి మరింత బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేయాలని మంత్రి అన్నారు.


👉 ప్రజలకు సమయం కేటాయించి వారి సమస్యలను ఓపికగా వినాలని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎలాంటి విసుగు లేకుండా ప్రతి దరఖాస్తును పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుల్లో లోపాలు ఉంటే లేదా ఏదైనా పని ఆలస్యం అవుతుంటే దానికి గల కారణాలను ప్రజలకు స్పష్టంగా, వారికి అర్థమయ్యే విధంగా వివరించాలని ఆదేశించారు.


👉 అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు. చిన్న సమస్య అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. తెలిసి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ప్రతి అధికారి అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు.


👉 ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై జిల్లా స్థాయిలో సమగ్ర శ్వేతపత్రం (వైట్ పేపర్) సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు, సూచన, అభిప్రాయం ప్రభుత్వానికి చేరేలా చర్యలు తీసుకోవాలని, వాటి ఆధారంగా లోపాలు, పెండింగ్ అంశాలు, బ్యాక్‌లాగ్‌లను గుర్తించి వెంటనే సరిదిద్దే కార్యాచరణ చేపట్టాలని సూచించారు.


👉 పెద్దపల్లి జిల్లా పరిపాలన, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నాయకత్వంలో అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని అభినందించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సేవల మెరుగుదల, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు.


👉 రైతుల కోసం పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించిన యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. జిల్లాలో ప్రతి అర్హ రైతుకు అవసరమైన సమయంలో యూరియా తప్పనిసరిగా అందేలా చూడాలని, అవసరం లేని వారికి యూరియా పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.


👉 సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని, ముఖ్యంగా ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి పంటల సాగును విస్తరించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించాలని సూచించారు.


👉 ప్రభుత్వం బోనస్ ప్రకటించిన ఏడు రకాల వరి వంగడాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి మండలంలోని రైతు వేదికల్లో ఆ ఏడు రకాల విత్తనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


👉 జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన విత్తన మేళా తరహాలో రైతులకు నాణ్యమైన విత్తనాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.
వ్యవసాయ అధికారులు రైతులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ క్షేత్రస్థాయిలో పంటలను పర్యవేక్షించాలని, రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని తెలిపారు.


👉 అనధికారిక, నాణ్యతలేని విత్తనాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు.జిల్లాలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణను ప్రాధాన్యత క్రమంలో వేగవంతం చేయాలని, భూసేకరణ ప్రక్రియలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పారదర్శకంగా ముందుకు సాగాలని సూచించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ సమావేశంలో మాట్లాడారు.


ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్ డి వో లు సురేష్, గంగయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎ. అన్నయ్య గౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్. మల్లయ్య, జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.