J.SURENDER KUMAR,
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,..

ధర్మపురి పట్టణంలోని 8 రేషన్ షాపుల పరిధిలో మొత్తం 5,407 నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్క కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకులు పొందడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు.

👉 ప్రజల అవసరాలను గుర్తించి వారికి మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆహార భద్రత, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

👉 కార్డులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
