సర్దార్ పాపన్న గౌడ్ పోరాటం నేటి తరానికి ఆదర్శం!


👉 మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి !


J.SURENDER KUMAR,


అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శం అని ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి అన్నారు.
మంగళవారం ఘనంగా జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్  పాల్గొని  పట్టణంలోని చింతామణి చెరువు కట్టపై ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


👉 ఈ సందర్భంగా చైర్ పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ…


తెలంగాణ వీర చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీరుడు సర్వాయి పాపన్న గౌడ్. నాటి సామాజిక అసమానతలకు, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన గొప్ప యోధుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

గౌడ కులంలో జన్మించినప్పటికీ, సర్వాయి పాపన్న గౌడ్  పోరాటం ఒక్క కులానికి పరిమితం కాలేదు. సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం, గౌరవం, సమాన హక్కులు దక్కాలనే లక్ష్యంతో ఆయన పోరాడారు. అందుకే సర్వాయి పాపన్న గౌడ్  ఆశయాలు, త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

అలాంటి మహనీయుడిని జయంతి సందర్భంగా స్మరించుకోవడం, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజల ఐక్యత కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో  గౌడ సంఘ సీనియర్ నాయకులు సుధ వేణి నర్సాగౌడ్ , మండల అధ్యక్షులు ఎల్లా గౌడ్ , సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు నేరెళ్ల సర్పంచ్ గడ్డం బాల గౌడ్ , ఎంపీటీసీ గంగాధర్ ,  గౌడ కులస్తులు మరియు తదితరులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  కు నివాళులు  అర్పించారు.