అసెంబ్లీ సాక్షిగా 388 ఎకరాలపై..!

👉 కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై విచారణకు సీఎం రేవంత్‌ ఆదేశాలు !

👉 ప్రభుత్వ భూమి ఎంత..? ప్రైవేటు భూమి ఎంత..? తేల్చాలని ఆదేశం !

👉 నిజమైతే 800 దళిత కుటుంబాలకు పట్టాలు..!

👉 అధికారులపై చర్యలకు హెచ్చరిక !


J.SURENDER KUMAR,

తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ పరిధిలో కేసీఆర్‌ కొనుగోలు చేసిన భూమి ఎంత..? ప్రస్తుతం ఆయన ఆధీనంలో ఉన్న భూమి ఎంత..? ప్రభుత్వానికి చెందాల్సిన 388 ఎకరాల భూమి ఎక్కడ ఉంది..? ఎవరి ఆధీనంలో ఉంది..? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

👉 అసెంబ్లీలో బుధవారం మాట్లాడిన సీఎం..

కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి భూముల వివరాలను పరిశీలించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందా? భూముల రికార్డుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా? అన్నది నిజ నిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి తేల్చాలని స్పష్టం చేశారు.

👉 30 రోజుల్లో తేల్చాల్సిందే..!

విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి 30 రోజుల గడువు విధించారు. రెవెన్యూ అధికారులు నిర్దేశిత వ్యవధిలో విచారణ పూర్తి చేయకపోతే అధికారులతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజా నివేదికల ప్రకారం ఫామ్‌హౌస్‌ పరిధిలోని భూముల విస్తీర్ణం, ప్రభుత్వ భూమి అంశాలను నిర్ధారించేందుకే ఈ విచారణ చేపట్టనున్నారు.

👉 800 దళిత కుటుంబాలకు పట్టాలు ?

ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు విచారణలో నిర్ధారణ అయితే, దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దళిత కుటుంబాలకు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. సుమారు 800 కుటుంబాలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని అక్కడే నిర్వహిస్తానని అసెంబ్లీలో వెల్లడించారు.

ఇటీవల ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద దళిత కార్యకర్తలు నిర్వహించిన నిరసన, అనంతరం అక్కడ పసుపు నీటితో ‘శుద్ధీకరణ’ కార్యక్రమం జరిగిందన్న వివాదం కూడా రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది.

👉 భూముల లెక్కలు.. రాజకీయ వేడి!

ఒకవైపు 22-A భూముల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.