J.SURENDER KUMAR,
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించిన దిగ్గజం లియోనెల్ మెస్సీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ మైదానంలో కొన్ని నిమిషాలు గడపడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.
👉 యావత్ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, ఉత్తేజపరిచిన GOAT లియోనెల్ మెస్సీ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన జీవితం, ఆయన ప్రయాణం భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
👉 “2005లో హంగేరీతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ ద్వారా అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన లియోనెల్ మెస్సీ, పాతికేళ్లకు పైగా తన అసాధారణ ప్రతిభ, నిరంతర శ్రమ, అచంచలమైన పట్టుదలతో ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ఒక ఆటగాడిగా మాత్రమే కాకుండా, క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా, కోట్లాది మంది యువతకు ఆదర్శంగా నిలిచిన ఆయన ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.
👉 ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవడంతో పాటు, తన వృత్తిపరమైన జీవితంలో అనేక అరుదైన రికార్డులను నెలకొల్పి ఫుట్‌బాల్ ప్రపంచంలో చిరస్థాయి ముద్ర వేశారు.
👉 మైదానంలోనే కాదు, సమాజ సేవలోనూ మెస్సీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2010 నుంచి యునిసెఫ్‌తో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా, లియో మెస్సీ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. ఈ సేవలకు గుర్తింపుగా అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకోవడం ఆయన వ్యక్తిత్వానికి మరో నిదర్శనం.
👉 భారతదేశ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు విచ్చేసి తెలంగాణ క్రీడాభిమానులను ప్రోత్సహించిన తీరు చిరస్మరణీయం. క్రీడలను మరింతగా ప్రోత్సహిస్తూ కొత్త తరాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తెలంగాణకు ఆయన సందర్శన విశేష స్ఫూర్తిని అందించింది.
👉 క్రీడాస్ఫూర్తి, పట్టుదల, ఏకాగ్రత, నిరంతర సాధన, వినయం, అంకితభారం – ఈ విలువలన్నింటికీ మెస్సీ ఒక ప్రతిరూపం. ఫుట్‌బాల్ ఉన్నంతకాలం ఆయన పేరు, ఆయన ముద్ర, ఆయన స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. తెలంగాణ ప్రజలు, క్రీడాభిమానులు ఆయన అందించిన ప్రేరణను ఎన్నటికీ మరువలేరు.
👉 అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతున్న ఈ సందర్భంగా లియోనెల్ మెస్సీకి హృదయపూర్వక అభినందనలు. ఇకపై తన సేవా కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంతో భాగస్వామి అవుతూ, సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాం. ఆయన జీవితం, ఆయన ప్రయాణం భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగానే నిలిచిపోతుంది” అని పేర్కొన్నారు.
