విధ్వంసానికి గురైన తెలంగాణను వికాసం వైపు కోసం

👉 వెయ్యి రోజుల ప్రజా ప్రభుత్వ పరిపాలనలో విప్లవాత్మకమైన నిర్ణయాలు !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,

విధ్వంసానికి గురైన తెలంగాణను వికాసం వైపు నడిపించడం కోసం గడిచిన వెయ్యి రోజుల ప్రజా ప్రభుత్వ పరిపాలనలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు. వెయ్యి రోజుల పాలనలో రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలతో పాటు కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అనేక సామాజిక అంశాల్లో దూరదృష్టితో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించారు.

👉“తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడిన తెలంగాణలో గడిచిన వెయ్యి రోజుల్లో రూపాయి రూపాయి కూడబెట్టి ముళ్లబాట నుంచి హైవేకు తీసుకొచ్చాం. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తుంటే, చూసి ఓర్వలేక కొందరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ఒక్కటొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ పరిపాలనను పట్టాలెక్కించాం. ప్రభుత్వాన్ని సాఫీగా నడిపిస్తా. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తా..” అని ముఖ్యమంత్రి  ఘాటుగా స్పందించారు.

👉 మూసీ నదిపై మూసారాంబాగ్ వద్ద కొత్తగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి  ప్రసంగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ (GHMC), మల్కాజిగిరి (MMC), సైబరాబాద్ (CMC) మున్సిపల్ కార్పొరేషన్ల లోగోలను ఆవిష్కరించారు.

👉 ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పరిపాలనపై చేసిన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సభలో సోదాహరణగా వివరించారు.

👉 “ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి 1వ తేదీ నుంచి గడిచిన 32 నెలలుగా ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మొదటి తారీఖున చెల్లించాలని చెప్పాం.

👉 ఉద్యోగులు పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచిన కారణంగా ఇప్పుడు నెలకు దాదాపు వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైరవుతున్న భారం పడుతోంది. గత ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹ 8 వేల కోట్లు బకాయి పెట్టింది. వారి బెనిఫిట్స్ కోసం వంద రోజుల్లో ₹ 6 వేల కోట్లు చెల్లించాం.

👉 ఆరోగ్య భద్రత కార్డు లేకపోతే ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య భద్రత కార్డులను పునరుద్ధరించాం. తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసిన ఆర్టీసీ ఉద్యోగుల్లో 60 మంది చనిపోగా, ఆ కుటుంబాలను పట్టించుకోకపోతే ప్రజాప్రభుత్వం వారికి అండగా నిలబడి కారుణ్య నియామకాలు చేపట్టాం. ఈ విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి” అని కోరారు.

👉 “రైతులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 27.50 లక్షల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తో పాటు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం.

👉 నియామకాల కోసం తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నిరుద్యోగులకు గడిచిన పదేండ్ల పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గ్రూప్ 1, 2, 3, 4లతో పాటు డాక్టర్లు, నర్సులు, పోలీసు ఉద్యోగాలు వేటిలోనూ నియామకాలు చేపట్టలేదు. రెండేండ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి, దేశంలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టాం.

👉 ఈ వెయ్యి రోజుల పరిపాలనలో రైతులు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ₹ 1 లక్షా 70 వేల కోట్లు ఖర్చు పెట్టింది. 30 నెలల్లో రైతుల వడ్లు కొనడానికి ₹ 90 వేల కోట్లు చెల్లించాం. ₹36 వేల కోట్లు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందించాం. 25 లక్షల మంది రైతులకు ₹ 2 లక్షల మేరకు రుణమాఫీ చేశాం. ఉచిత కరెంటు కోసం ₹30 వేల కోట్లు ఖర్చు చేశాం. గిట్టుబాటు ధరతో పాటు సన్న వడ్లకు ₹ 500 బోనస్ చెల్లించాం. అప్పులు లేని రైతులు తెలంగాణలో ఎక్కువ ఉన్నారని కేంద్రం ప్రకటించింది. రైతుల సంక్షేమం కోసం నిరంతరం తపన పడుతున్నాం.

👉 వెయ్యి రోజుల పరిపాలనలో రాష్ట్రం దివాలా తీసిందంటారా? మా ప్రభుత్వ గొప్పతనం ఆడబిడ్డ కళ్లల్లోని వెలుగుల్లో కనిపిస్తుంది. కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించాం. స్వయం సహాయక సంఘాలకు ₹ 60 వేల కోట్లు బ్యాంకు లింకేజీ కల్పించాం. ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యమే కాకుండా వెయ్యి బస్సులకు ఆడబిడ్డలను యజమానులుగా చేశాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి గడిచిన 32 నెలల్లో మహిళల తరఫున ఆర్టీసీకి ,₹ 11 వేల కోట్లు చెల్లించాం.

👉 సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయిస్తున్నాం. హైటెక్ సిటీ శిల్పారామం వద్ద విలువైన 3.5 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి స్టాళ్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాం. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేశాం. 200 యూనిట్ల వరకు ఆడబిడ్డలకు ఉచిత విద్యుత్ అందించాం. రాష్ట్రంలో 1 కోటి 17 లక్షల రేషన్ కార్డులు జారీ చేశాం. 3.48 లక్షల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నాం.

👉 గ్రామీణ ప్రాంతాల్లో ఆడబిడ్డలకు 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చాం. కోర్ అర్బన్ ఏరియా పరిధిలో పేదలకు 1 లక్ష ఇందిరమ్మ ఇండ్లను (అపార్ట్‌మెంట్లు) కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం” అని విడమరిచి చెప్పారు.

👉 “రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విశేష కృషి చేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి  పేరును సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రికి పెట్టుకున్నాం. త్వరలోనే అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రులను ప్రారంభిస్తాం. అల్వాల్ టిమ్స్‌కు మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య పేరును, ఎల్బీనగర్ టిమ్స్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్  పేరును పెడతాం” అని ముఖ్యమంత్రి  ప్రకటించారు.

👉 “గతంలో పేదల గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయని వారు ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూలిపోతున్నా పట్టించుకోలేదు. ₹ 2 వేల కోట్ల ఖర్చుతో పూర్తయ్యే ఆసుపత్రిని నిర్మించాలన్న ఆలోచన చేయలేదు.

👉 సచివాలయం ఎదురుగా బహుజనుల ఆరాధ్యదైవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని, చదువులే మన బతుకులు మార్చుతాయని చెప్పిన జ్యోతీరావు పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేశాం. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టాం” అని గుర్తుచేశారు.

👉 “ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రజా ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎలా అంటారు? గత పాలనలో ఆడబిడ్డలు, రైతులు, నిరుద్యోగులకు చేసిందేమిటి? ప్రజలు ఈ తేడాను గమనించాలి. ఆలోచన చేయాలి. వెయ్యి రోజుల పాలనలో ఏం చేశావని అడిగే వారికి 8 వేల రోజుల పాలనలో, వెయ్యి రోజుల ప్రజా పాలనలో చేసిందేమిటన్నది అసెంబ్లీలో చెబుతాం” అని అన్నారు.

👉“40 ఏళ్లుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాం. 1931 తర్వాత వందేళ్లుగా జరగని కులగణన చేసి లెక్కలు తేల్చాం. గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం చట్టం చేయడం, స్పోర్ట్స్, ఐటీ, హెల్త్, టూరిజం, ఎండోమెంట్ పాలసీలను తీసుకొచ్చాం. అత్యద్భుతంగా సమ్మక్క – సారలమ్మ దేవాలయం నిర్మించుకున్నాం.

👉 హైదరాబాద్ నగరం గొప్పగా అభివృద్ధి చెందుతోంది. నగరమే కాదు.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ఓఆర్ఆర్ లోపు కోర్ అర్భన్ రీజియన్ ఎకానమీగా, ఓఆర్ఆర్ అవతలివైపు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య భాగం పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా, రీజినల్ రింగ్ రోడ్డు బయటి ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా.. మూడు భాగాలుగా చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం.

👉 ఇవన్నీ ప్రజా ప్రభుత్వ వెయ్యి రోజుల పరిపాలన విజయం కాదా. మాతో పోలికేంటి? పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నాం. పరిపాలన పట్టాలెక్కింది. అభివృద్ధి వైపు నడిచే ప్రయాణంలో ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలబడాలి” అని ముఖ్యమంత్రి  అన్నారు.