సమరయోధుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు!


J. SURENDER KUMAR,


దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు రాంపల్లి కిష్టయ్య సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఇటీవల మృతి చెందిన రాంపల్లి కిష్టయ్య కుటుంబ సభ్యులను గురువారం మంథనిలో మంత్రి పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా రాంపల్లి కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన సాగించిన పోరాటం, దేశభక్తి, అసమాన ధైర్యసాహసాలను మంత్రి స్మరించుకున్నారు.

స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయుల త్యాగాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వారి పోరాటాల ఫలితంగానే దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందని అన్నారు. రాంపల్లి కిష్టయ్య వంటి స్వాతంత్ర్య సమరయోధుల సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

అనంతరం కిష్టయ్య కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి, ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.