👉 పీఆర్సీ, ఇంక్రిమెంట్ల వంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా !
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
రెండు సంవత్సరాలపాటు సహకరించి వెసులుబాటు కల్పిస్తే పీఆర్సీ, ఇంక్రిమెంట్ల వంటి ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టిన ఈ దశలో తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశానికి ఒక దిక్సూచిలా నిలబెట్టడానికి ఉపాధ్యాయులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
👉 కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వ సలహదారు కే కేశవరావు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
👉 భారతదేశ మాజీ రాష్ట్రపతి, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ….
“ఆర్థిక వెసులుబాటును బట్టి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మిగతా శాఖలతో పోల్చితే విద్యా శాఖ ఆదర్శంగా నిలబడాలి. పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకులు మీరే. రెండేండ్లు సమయం ఇవ్వండి. రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడికి విజ్ఞప్తి చేస్తున్నా. రెండేండ్లలో సమస్యలన్నింటినీ సామరస్యంగా మీరు అడక్కుండానే పరిష్కరించే బాధ్యత నాది” అని స్పష్టం చేశారు.
👉 “తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశానికి ఒక రోల్ మాడల్‌గా నిలబెడుదాం. అందుకు కథానాయకులు ఉపాధ్యాయులే. అందుకు ఉపాధ్యాయులంతా పునరంకితం కావాలి. ఇంట్లో సొంత పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో మీ వద్ద చదువుకుంటున్న విద్యార్థుల విషయంలోనూ అంతే శ్రద్ధ పెట్టాలి. ఉపాధ్యాయులపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది.

👉 “జాతీయ విద్యా విధానంతో విద్యా రంగంలో ఎన్నో మార్పులొస్తున్నాయి. మనం కూడా విధానాలు మార్చుకోవాలి. నిరుపేద పిల్లలు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశిస్తున్నారు. కాలం తీరిపోయిన విద్యా విధానంతోనే వెళదామా. అప్ డేటెడ్ విద్యా విధానాన్ని అందిపుచ్చుకుందామా?
👉 పాలిటెక్నిక్ కాలేజీలు టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నాలెడ్జ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తేస్తే, ప్రైవేటీకరణ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం వల్ల ఈరోజు ఫలితాలను చూస్తున్నాం.
👉 పాలిటెక్నిక్‌లో రెండేళ్లు థియరీ, మూడో సంవత్సరం కార్పొరేట్ సంస్థల్లో ఇంటర్న్‌గా పనిచేసే విధానం తీసుకొస్తున్నాం. ఇంటర్న్‌గా ఉన్నప్పుడు కార్పొరేట్ కంపెనీలు ₹9 వేల వరకు స్టయిఫండ్ కూడా ఇస్తాయి.
👉 పాలిటెక్నిక్ ఇప్పటివరకు డిప్లమాలే జారీ చేస్తున్నాయి. విదేశాల్లో మాస్టర్స్ చదువుకోవడానికి వీలుగా డిగ్రీ పట్టాను అందించే విధంగా మార్పులు చేశాం. పాలిటెక్నిక్ పూర్తి చేస్తే ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరడానికి అవకాశం కోల్పోతామన్న తప్పుడు ప్రచారంపై విద్యార్థులు మోసపోవద్దు. నిస్సందేహంగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరడానికి వీలుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు.

👉 అలాగే లెక్చరర్లకు సర్వీసు నిబంధనల విషయంలోనూ ఎలాంటి ధోకా ఉండదు. సర్వీస్ రూల్స్ వేరు, విద్య విధానం వేరు. ఈ విషయంలో ఇంకా అనుమానాలు ఉంటే సలహాదారు కేశవరావు గారితో కూర్చొని మాట్లాడండి. ప్రభుత్వం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. జీతభత్యాలు, పీఆర్సీ, ఇంక్రిమెంట్లు నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది” అని విస్పష్టం చేశారు.
👉 “మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో స్కిల్స్ నేర్పించడానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి ఏటీసీలు మార్చాం. కార్పొరేట్ కంపెనీల సమన్వయంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను ప్రారంభించాం.
👉 నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్య (నాలెడ్జ్ అండ్ కమ్యునికేషన్) ను అందించి 12వ తరగతి తర్వాత నైపుణ్యంలో శిక్షణ ఇప్పించాలి. సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రపంచంలో రాణించగలరు. ఇంజనీరింగ్ పట్టా ఉన్న వారికన్నా నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి” అని వివరించారు.

👉 “ప్రపంచ వ్యాప్తంగా ఫోకస్ మారింది. స్కిల్స్ ఉన్నవారికి జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. స్కిల్స్ తర్వాత ఇన్నొవేషన్ అండ్ ఎంప్లాయిమెంట్ వైపు దృష్టి సారించాలి. యూనికార్న్‌గా నిలబడాలి. ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఈనాడు ఎలాన్ మస్క్ కంపెనీతో పోటీ పడుతోంది. ఇన్నొవేషన్‌పై ఫోకస్ పెట్టాలి.
👉 ఇలాంటి వాటిల్లో ప్రభుత్వం అండగా ఉంటుంది. వాటన్నింటికీ వారధి, సారథులు ఉపాధ్యాయులే. రెండేళ్లు ఫోకస్డ్‌గా పనిచేయండి. ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకోండి. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిద్దాం” అని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.
👉 “పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు. విద్యా రంగంలో జాతీయ సగటులో 28 స్థానంలో ఉన్న తెలంగాణను 17వ స్థానానికి ఎదగడం ఉపాధ్యాయుల వల్లే సాధ్యమైంది. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 80 వేలకు పైగా విద్యార్థులు అధికంగా అడ్మిషన్లు తీసుకున్నారంటే ఆ విజయానికి టీచర్లే కారణం.

👉 30-35 ఏళ్లు కష్టపడి ప్రజలకు సేవలు అందించి రిటైరైన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వకపోగా పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 చేయడం వల్ల 2025 నుంచి రిటైర్మెంట్లు మొదలయ్యాయి. గత ప్రభుత్వం దాదాపు ₹8 వేల కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా పెండింగ్‌లో పెడితే, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ నిధులను కూడదీసి వంద రోజుల్లో ₹ 6 వేల కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చెల్లించాం” అని గుర్తుచేశారు.
