ఉపాధ్యాయులకు కష్టం రానివ్వను సీఎం రేవంత్ రెడ్డి!

J.SURENDER KUMAR,

ఉపాధ్యాయులు, లెక్చరర్లకు అణాపైసా కష్టం రానివ్వను. పీఆర్సీ, ఇంక్రిమెంట్‌లతో పాటు మిగతా సమస్యలు వేటిలోనూ చిన్న కష్టం రానివ్వను. సలహాదారు కేశవరావు తో కూర్చొని మాట్లాడండి. నన్ను విశ్వసించి సహకరించండి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఉపాధ్యాయులను కోరారు

కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం  నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  మంత్రి దామోదర రాజనర్సింహ , ప్రభుత్వ సలహదారు కే కేశవరావు  ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ……

మీరు ప్రభుత్వ సర్వీసులో 30 ఏళ్లకు పైగా సేవలందిస్తారు. రాజకీయ నాయకులం మేము  ప్రతి ఐదేళ్లకు ఒకసారి మీముందుకొచ్చి పరీక్షలు రాయాల్సిందే. నేను చెప్పిన ప్రకారం చేయకుండా ఉంటే.. నిర్ణయం తీసుకోవలసింది మీరే. అందుకు మార్కులు వేయాల్సిందీ మీరే. మీ చేతిలోనే కలం ఉంది. మీ చేతిలోనే బలం ఉంది” అని ముఖ్యమంత్రి  వ్యాఖ్యానించారు.

👉 “ఉపాధ్యాయులే వీధుల్లోకి వస్తే ప్రభుత్వానికి, రాష్ట్రానికి శుభ సూచకం కాదు. మిగతా శాఖలు వేరు. పిల్లల భవిష్యత్తుకు నిర్దేశకులు మీరు. మీరే ధర్నాలు చేస్తానంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా, రెండేళ్లు సమయం ఇవ్వండి.

👉 “గత ప్రభుత్వంలో పదేండ్ల పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. విధ్వంసం చేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే శక్తి ఉపాధ్యాయులపైనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 80 వేల అడ్మిషన్లు పెరిగాయంటే ఆ గొప్పతనం ఉపాధ్యాయులదే.

👉 ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి వివాదం లేకుండా బదిలీల ప్రక్రియ పూర్తి చేశాం. జీవో 317 కింద తలెత్తిన సమస్యలను పరిష్కరించాం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించాం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కాదు ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడానికి ఉపాధ్యాయులను విదేశాలకు పంపించాం.

👉 దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా కమిషన్ నియమించి ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఉపాధ్యాయుల ఆలోచనలను పరిగణలోకి తీసుకుని సాంకేతిక నైపుణ్యంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాం.


👉 ప్రభుత్వ విధానంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి. మనమంతా లక్షలాది విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉన్నాం. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. సహకరించండి. నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తుంది”  అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు