ఫ్లాష్ – ఏసీబీ ఎంట్రీతో ధర్మపురి విండో భూమిలో కదలిక !

👉 ఆరేళ్ల తర్వాత సొసైటీ ఖాతాలోకి 0-13 గుంటల భూమికి సంబంధించిన సొమ్ము !

👉 ఎకరం కొనుగోలుకు తీర్మానం.. రిజిస్ట్రేషన్ మాత్రం 27 గుంటలకేనా ?

👉 ఏసీబీకి ఫిర్యాదు చేసిన సొసైటీ సభ్యుడు..బాధ్యులపై చర్యలు తీసుకుంటారా ?


J.SURENDER KUMAR,


రైతుల వాటాధనం, సొసైటీ నిధులతో చేపట్టిన భూమి కొనుగోలు వ్యవహారంలో 6 సంవత్సరాలుగా సమాధానం లేని ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఎకరం భూమి కొనుగోలుకు తీర్మానం చేసినట్లు రికార్డుల్లో ఉండగా, సొసైటీ పేరుపై 0- 27 గుంటల భూమి మాత్రమే రిజిస్టర్‌ కావడం.. మిగిలిన 0-13 గుంటల భూమి వ్యవహారంపై స్పష్టత లేకపోవడం.. ఏసీబీకి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఆ భూమికి సంబంధించిన సొమ్ము సొసైటీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి దీంతో ధర్మపురి సింగిల్ విండోలో  ఇన్నాళ్లూ పరిష్కారం కాని ఈ వ్యవహారంపై ఇప్పుడు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


👉 ఎకరం కొనుగోలుకు తీర్మానం.. రిజిస్ట్రేషన్‌ 0-27 గుంటలకే !

జగిత్యాల జిల్లా ధర్మపురి సింగిల్ విండో సొసైటీ పరిధిలో పది గ్రామాలకు చెందిన సుమారు 3000 నుంచి 4000 మంది రైతులు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. రైతుల వాటాధనం సుమారు ₹ 1.30 కోట్ల వరకు ఉండవచ్చని, సొసైటీలో ఏటా ₹15 కోట్ల నుంచి ₹ 20 కోట్ల వరకు ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్టు సమాచారం.

ఈనేపథ్యంలో సొసైటీ అభివృద్ధి అవసరాల కోసం ఎకరం భూమి కొనుగోలుకు తీర్మానం చేసి నిధులు విడుదల చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే, ధర్మపురి మండలం నాగారం గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 84ఈ లో పట్టాదారు ఎడమల రాజేశ్వర్‌రెడ్డి నుంచి 2020 జూలై 6న జగిత్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ నంబర్‌ 4052/2020 ద్వారా 0- 27 గుంటల భూమి మాత్రమే సొసైటీ పేరుపై రిజిస్టర్‌ చేయించుకున్నారు.

ఎకరం కొనుగోలుకు సంబంధించిన తీర్మానం, వాస్తవంగా జరిగిన రిజిస్ట్రేషన్‌ మధ్య ఉన్న వ్యత్యాసమే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మిగిలిన 0- 13 గుంటల భూమి ఎందుకు సొసైటీ పేరుపై రిజిస్టర్‌ కాలేదు? ఆ భూమి కొనుగోలుకు కేటాయించిన సొమ్ము ఏమైంది? ఈ అంశాలపై విండో కార్యవర్గం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సొసైటీ సభ్యులు కోరుతున్నారు.

👉 27 గుంటలకు ₹ 5,10,662 ఖర్చు చేసినట్లు నమోదు !

సొసైటీ రికార్డుల ప్రకారం 27 గుంటల భూమి కొనుగోలుకు మొత్తం ₹.5,10,662 ఖర్చు చేసినట్లు నమోదు చేసినట్టు సమాచారం. ఇందులో భూమి పట్టాదారుకు ₹.4,85,100, సబ్‌ రిజిస్ట్రార్‌ చలాన్‌ ద్వారా ₹.9,062, నాలా చార్జీలకు ₹.10,000, సర్వే ఖర్చులకు ₹.6,500 చెల్లించినట్లు పేర్కొంటున్నారు.
అయితే, ఎకరం కొనుగోలుకు సంబంధించిన మిగిలిన 0- 13 గుంటల భూమి రిజిస్ట్రేషన్‌ ఎందుకు పూర్తికాలేదు? ఆ భూమికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? సొసైటీ ఆడిట్‌ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, కొనుగోలు ఒప్పందాలను పరిశీలిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

👉 ఏసీబీకి ఫిర్యాదు ఆ తర్వాతే కదలికలు….!

సొసైటీ పేరుపై రిజిస్టర్‌ కావాల్సిన మిగిలిన 0- 13 గుంటల భూమి గురించి గతంలో జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో సంబంధిత పత్రాలతో గత ఏడాది డిసెంబర్‌లో ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు ఆదేశాలు జారీ కాగా, జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కూడా ఆరోపణలను పరిశీలించాల్సిందిగా సంబంధిత యంత్రాంగానికి పంపినట్లు ఫిర్యాదుదారుల వివరాలు సూచిస్తున్నాయి.

ఇదే సమయంలో 0-13 గుంటల భూమికి సంబంధించిన సొమ్మును పట్టాదారు ద్వారా సొసైటీ బ్యాంకు ఖాతాలో సెప్టెంబర్ లో జమ చేయించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. ఆ మొత్తాన్ని ఎప్పుడు, ఏ కారణంతో జమ చేశారు? ఈ లావాదేవీకి సంబంధించిన పత్రాలు ఏమి చెబుతున్నాయి? ఏసీబీ విచారణలో ఈ అంశాలు కీలకంగా మారే అవకాశం ఉంది.

👉 ఏసీబీకి ఇచ్చిన వివరణపై స్పష్టత ఏది ?

మిగిలిన 0- 13 గుంటల భూమిని రిజిస్టర్‌ చేయలేకపోయినట్లు పట్టాదారు నుంచి వాంగ్మూలం తీసుకున్నారని, పాలకవర్గానికి అవినీతితో ఎలాంటి సంబంధం లేదని చూపించే నివేదికలు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల అధికారిక స్పందన, ఏసీబీ విచారణలో తేలిన అంశాలు ప్రజలకు తెలియాల్సి ఉంది.


సొసైటీ ఖాతాలో డబ్బులు జమ చేసినంత మాత్రాన గత లావాదేవీలపై తలెత్తిన ప్రశ్నలకు సమాధానాలు లభించినట్లు కాదు. అసలు ఎంత మొత్తం చెల్లించారు? ఆ డబ్బు ఎవరి వద్ద ఎంతకాలం ఉంది? సొసైటీకి జరిగిన ఆర్థిక నష్టం ఏమైనా ఉందా? నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారా? అన్న అంశాలను సంబంధిత పత్రాలు, బ్యాంకు రికార్డులు, విచారణ నివేదికల ఆధారంగా నిర్ధారించాల్సి ఉంది.

👉 పదవీకాలం పొడిగింపు వేళ మళ్లీ తెరపైకి భూముల వ్యవహారం!


ధర్మపురి సింగిల్ విండో అధ్యక్షుడిగా ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి 2020 నుంచి నేటి వరకు కొనసాగుతున్న పాలకవర్గ పదవీకాలం 2025 ఫిబ్రవరి 15తో ముగియాల్సి ఉండగా, తొలుత ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు, అనంతరం మరో ఆరు నెలల పొడిగింపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు  వెలువడి నేటికీ కొనసాగుతున్నారు.
పదవీకాలం పొడిగింపు నేపథ్యంలో సొసైటీ పేరుపై రిజిస్టర్‌ కాని 0-13 గుంటల భూమి అంశం మరోసారి చర్చకు వచ్చింది.

👉 రైతుల సొమ్ముకు జవాబుదారీతనం ఎక్కడ ?

వేలాది మంది రైతులు సభ్యులుగా ఉన్న సొసైటీలో ప్రతి రూపాయికి లెక్క ఉండాల్సిందే. భూమి కొనుగోలుకు సంబంధించిన తీర్మానం నుంచి చెల్లింపులు, రిజిస్ట్రేషన్‌, బ్యాంకు లావాదేవీల వరకు అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరగాలని సొసైటీ సభ్యులు కోరుతున్నారు.

👉 ప్రధాన ప్రశ్నలు ఇవే…..

☝️ఎకరం భూమి కొనుగోలుకు తీర్మానం చేసినప్పుడు 0- 27 గుంటలే ఎందుకు రిజిస్టర్‌ చేశారు?

☝️మిగిలిన 0- 13 గుంటల భూమికి సంబంధించిన సొమ్ము సొసైటీ ఖాతాలోకి ఇంతకాలం తర్వాత ఎందుకు వచ్చింది ?

☝️నిధుల చెల్లింపులు, భూమి రిజిస్ట్రేషన్‌ మధ్య ఉన్న వ్యత్యాసానికి బాధ్యులెవరు ?

☝️ఏసీబీ విచారణలో ఆర్థిక అవకతవకలు నిర్ధారణ అయితే బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారా ?

☝️రైతుల సొమ్ము వినియోగంపై సమగ్ర ఆడిట్‌, విచారణ నివేదికలను బహిర్గతం చేస్తారా ?

👉 రైతుల కష్టార్జిత నిధులతో నడిచే సహకార సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి.

ధర్మపురి సింగిల్ విండో భూముల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను అధికార యంత్రాంగం వెలికితీసి, తప్పు జరిగినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల సొమ్ముకు లెక్క చెప్పేది ఎవరు? ఏసీబీ విచారణ తేల్చబోయే వాస్తవాలేమిటి? అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది.