👉 సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే టాప్ !
👉 ఏడు రాష్ట్రాల డీజీపీల సమావేశంలో….
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…!
J SURENDER KUMAR,
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నిర్వహించిన ప్రగతి సమీక్ష సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు రాష్ట్రాన్ని పూర్తిగా నక్సల్స్ రహితంగా మార్చడంలో విశేష కృషి చేసిన తెలంగాణ పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసింగ్‌లో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను వివరించి నేరరహిత ప్రాంతంగా తీర్చిదిద్దడంలో రాష్ట్రాల మధ్య సమన్వయ అవసరాన్ని ముఖ్యమంత్రి అన్నారు.
👉 దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు తెలంగాణ అనుసరిస్తున్న సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు.
👉 “ఆయా రాష్ట్రాలు తమ సొంత వనరులు, ప్రయత్నాలతో మాత్రమే నేరరహిత రాష్ట్రాలుగా మార్చడం సాధ్యం కాదు. అందుకు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరం. అత్యంత కీలకమైన ఇలాంటి అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి” అని సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి కోరారు.
👉 “దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు, నేరాల రేటును అత్యంత కనిష్ఠ స్థాయికి తగ్గించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయంతో పనిచేసేందుకు పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయండి.
👉 సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఐసీసీసీ (ICCC) వ్యవస్థను సమన్వయం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మనమందరం సమష్టిగా కృషి చేద్దాం” అని పిలుపునిచ్చారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనడానికి ఈ సదస్సు ఫలవంతమైన, నిర్మాణాత్మక చర్చలతో సాగాలని ఆకాంక్షించారు.
👉 “భద్రత, రక్షణ, నిస్పాక్షికంగా, నైతిక విలువలతో కూడిన సమర్థవంతమైన వ్యవస్థగా పోలీసింగ్ పనిచేయాలని ప్రజలు కోరుకుంటారు. పోలీసు వ్యవస్థకు ప్రభుత్వం సమకూర్చే వనరులను ఖర్చుగా భావించకుండా మెరుగైన సమాజ నిర్మాణానికి, పౌరుల భద్రతకు పెట్టే పెట్టుబడిగా నేను భావిస్తాను. అందుకు ఎప్పటికప్పుడు అవసరమైన సంస్కరణలను తీసుకురావాలని భావిస్తా.

👉 రోజురోజుకు నేరాల స్వభావం మారుతున్న ఈ కాలంలో ఎస్ఆర్పీసీసీ వంటి వేదికలు ఎంతో కీలకంగా మారుతాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ కూడా మారాలి. పోలీసింగ్‌లో సంస్కరణలు నిరంతర ప్రక్రియగా కొనసాగాలి అని చెప్పారు.
👉 పోలీసు వ్యవస్థకు సంబంధించి తెలంగాణలో చేపట్టిన పలు సంస్కరణలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలను అరికట్టడం, వామపక్ష తీవ్రవాద హింసకు ముగింపు పలకడం వంటి రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభను చాటుకుని గుర్తింపు పొందింది.
👉 ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి హైదరాబాద్ మహానగరంలో పోలీస్ వ్యవస్థను మూడు కమిషనరేట్లుగా విభజించాం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లుగా విభజించాం. ఈ విభజన వల్ల పోలీసు కమిషనర్లు తమ భౌగోళిక పరిధిపై ప్రత్యేక దృష్టి సారించి మరింత మెరుగైన ఫలితాలు అందించడానికి అవకాశం ఏర్పడింది.
👉 దీంతో పాటు నేరాల స్వభావానికి అనుగుణంగా ప్రత్యేక దృష్టిని సారించడానికి వీలుగా హైడ్రా (HYDRAA), ఈగల్ (EAGLE), టీజీ-సేఫ్ (TG-Safe), టీజీ టీమార్స్ (TG-TMARS) వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశాం.
👉 ఈరోజుల్లో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు అత్యంత కీలకమైన అంశాలుగా మారాయి. ప్రతి విభాగం, ప్రత్యేక విభాగాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, శిక్షణపై దృష్టి సారించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించగలుగుతాం.
👉 “మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ (EAGLE) విభాగం సాధించిన పనితీరుకు కేంద్ర ప్రభుత్వం 80 శాతానికి పైగా మార్కులిచ్చింది. సైబర్ నేరాల బాధితులకు కోల్పోయిన సొమ్మును తిరిగి అందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.
👉 అమెరికాలోని ఎఫ్‌డీఏ (FDA) తరహాలో ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణను బలోపేతం చేయడం కోసం సమన్వయంతో పనిచేసే కొత్త విభాగం టీజీ-సేఫ్ (TG-SAFE) ను ప్రారంభించాం” అని సదస్సులో వివరించారు.
👉 తెలంగాణ ప్రారంభించిన హైడ్రా (HYDRAA) చెరువులు, జలవనరులను పరిరక్షించడం, పునరుద్ధరించడం, వాటికి పూర్వవైభవం తీసుకురావడం ద్వారా ప్రజల మనసులను గెలుచుకుంటోంది. అదే సమయంలో ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తుల భద్రతను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోంది అని తెలిపారు.
👉 హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
👉 “ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు సంక్షేమం విషయంలో కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యనిస్తోంది. వృత్తి రీత్యా పోలీసు సిబ్బంది ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో వారి పిల్లల భవిష్యత్తు ఒకటి.
👉 పోలీసు కుటుంబాల పిల్లలకు దేశంలోని అత్యుత్తమ సైనిక్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు హైదరాబాద్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేశాం. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల్లోని సిబ్బంది పిల్లలకు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించే అవకాశం కల్పించాం.

👉 ఎంతో ధైర్యసాహసాలతో ప్రాణత్యాగం చేసిన పోలీసుల కుటుంబాల భవిష్యత్తుకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారి వరకు, వారి హోదా, సర్వీసు ఆధారంగా కనీసం ₹1 కోటి నుంచి గరిష్ఠంగా ₹2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం. ఇంటి స్థలంతో పాటు కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించడం వంటివి అమలు చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి పోలీసు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
👉 ఎస్ఆర్పీసీసీ (SRPCC) సదస్సును తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని సాధించేందుకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని చెప్పారు.
👉 ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ , కర్ణాటక డీజీపీ డాక్టర్ ఎంఏ సలీమ్ , తమిళనాడు డీజీపీ డాక్టర్ మహేష్ అగర్వాల్ , పుదుచ్చేరి డీజీపీ శ్రీమతి షాలిని సింగ్ , లక్షద్వీప్ ఏడీజీ బి. శంకర్ జైస్వాల్ , కేరళ ఐజీ అజీతా బేగం, ఆంధ్రప్రదేశ్ ఐజీపీ రవి కృష్ణ పాల్గొన్నారు.
👉 అలాగే, తెలంగాణ ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య , తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్ , తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA) డైరెక్టర్ అభిలాష బిష్త్ , లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ , సీఐడీ డీజీ చారు సిన్హా , హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ , ఆపరేషన్స్ విభాగం డీజీ అనిల్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
