రైతు సంక్షేమం వ్యవసాయ అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం!

👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…!


J.SURENDER KUMAR,


శుక్రవారం ఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో చిట్యాల మండలం వడితల గ్రామంలో₹ 2.2.కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….


విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీటి సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.


👉 గత రెండున్నరేళ్లలో ఉప ముఖ్యమంత్రి చొరవతో జిల్లాలో 12 కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయానికి విద్యుత్ పరంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.

👉 భూగర్భ జలాల ఆధారంగా వ్యవసాయం చేసే రైతులకు బోర్లు, మోటార్ల ద్వారా సాగు చేసుకునేందుకు విద్యుత్ సదుపాయాలను మెరుగుపరుస్తూ అండగా నిలుస్తున్నామని వివరించారు.

👉 గోదావరి నది జలాలను, అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను రైతులకు చేరువ చేసేందుకు డీబీఎం-38 ద్వారా నీటిని అందించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు నీటి వసతి కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు.

👉 రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేకూర్చేలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ, మహిళలకు బస్సు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

👉 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో సుమారు ₹ 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

👉 రైతుల సంక్షేమం, విద్యుత్, సాగునీరు, విద్యా రంగాల అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిరంతరాయ విద్యుత్తు సరఫరా చేస్తున్నారని మంత్రి విద్యుత్తు సిబ్బందిని అభినందించారు.

👉 విద్యుత్ రంగంలో గణనీయమైన అభివృద్ధి: ఎమ్మెల్యే గండ్ర

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 14 వేల మెగావాట్ల నుంచి 21 వేల మెగావాట్లకు పెంచిందని తెలిపారు. రైతులకు సాగు అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

👉 భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్ గుట్ట ప్రాంతంలో కూడా 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. గోదావరి జలాలను వినియోగించుకుంటూ డీబీఎం-38 ద్వారా 44,770 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, ఎస్సారెస్పీ పరిధిలోని మరో 70 వేల ఎకరాలను అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నియోజకవర్గం వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

👉 విద్యుత్ పొదుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ రాహుల్ శర్మ,.!

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ నూతన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభంతో ఐదు గ్రామాల ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు విద్యుత్ వృథాను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అవసరం లేనప్పుడు విద్యుత్ పరికరాలను ఆపివేయాలని, విద్యుత్‌ను విచక్షణతో, పొదుపుగా వినియోగించాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, ఎంపిడిసిఎల్ డైరెక్టర్ మోహన్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సదానందం, సర్పంచ్ భగవాన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.