👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..! .
J.SURENDER KUMAR,
వైద్య వృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, మానవ సేవకు అంకితమైన పవిత్రమైన బాధ్యత అని పేర్కొన్నారు. వైద్య విద్యలోకి అడుగుపెడుతున్న విద్యార్థుల జీవితంలో వైట్‌కోట్ ధరించడం ఒక ముఖ్యమైన మైలురాయి అనిరాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. వైట్‌కోట్ కేవలం దుస్తువు మాత్రమే కాదని, వైద్య వృత్తిలోని పవిత్రత, నిబద్ధత, సేవాభావానికి ప్రతీక అని వివరించారు.
వైద్య విద్యార్థులు బాగా చదివి, అంకితభావం, సేవా దృక్పథంతో గొప్ప వైద్య నిపుణులుగా ఎదిగి దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. శుక్రవారం భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు నిర్వహించిన వైట్‌కోట్ వేడుకలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ….
నీట్లో అర్హత సాధించి వైద్య విద్యలో ప్రవేశించిన విద్యార్థుల వెనుక తల్లిదండ్రుల కృషి, త్యాగం ఎంతో ఉందని, వారి ఆశయాలను నెరవేర్చేలా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

👉 వైద్య విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు మానవత్వం, రోగుల పట్ల ప్రేమ, సానుభూతి, సహనం అలవర్చుకోవాలని సూచించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ వైద్య వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
👉 ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి తెలిపారు.
👉 విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక, ఇతర పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొంటూ సమగ్ర వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.

👉 భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి వెల్లడించారు. కళాశాల భవనంతో పాటు బాలురు, బాలికల హాస్టళ్ల నిర్మాణానికి సుమారు ₹130 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే బాలికల హాస్టల్‌ను ప్రారంభించామని, మరో15 రోజుల్లో బాలుర హాస్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వివరింవారు.
👉 విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం సింగరేణి సంస్థ ద్వారా రెండు బస్సుల కొనుగోలుకు ₹ 80 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, డీఎంఎఫ్టీ నిధుల సహకారంతో త్వరలోనే బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. కళాశాల ప్రధాన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు అవసరమైన వైద్యులు, అధ్యాపకుల నియామకాలు, ఇతర విద్యా సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
👉 సెమినార్ హాళ్లకు ఏసీలు, వాటర్ ప్లాంట్, హాస్టళ్లలో లిఫ్ట్, జనరేటర్, కిచెన్ షెడ్ తదితర సౌకర్యాలను కల్పిస్తామని, మిగిలిన పనులను సీఎస్ఆర్ నిధుల సహకారంతో త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

👉 వైద్య కళాశాల అభివృద్ధికి పూర్తి సహకారం: ఎమ్మెల్యే గండ్ర..
స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. వైద్య కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సహకారంతో కళాశాల అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్లేగ్రౌండ్, లైబ్రరీ, తరగతి గదులు, వాష్‌రూమ్‌లు, హాస్టల్ వసతులు తదితర సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు భూపాలపల్లిని తమ సొంత ప్రాంతంగా భావిస్తూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
👉 91 శాతం ఫలితాలు సాధించడం అభినందనీయం: కలెక్టర్ రాహుల్ శర్మ..
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యాపకుల కృషితో 91 శాతం ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే నిపుణులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

గోదావరి పరివాహక ప్రాంతం, బొగ్గు గనులు, గిరిజన ప్రాంతాలతో కూడిన భూపాలపల్లి జిల్లాలో వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. గతంలో మెరుగైన వైద్య సేవల కోసం వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో పాటు సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు.
వైట్‌కోట్ ధరించడం విద్యార్థులపై గొప్ప బాధ్యతను ఉంచుతుందని, నిరంతరం విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని సూచించారు.అంతకు ముందు ₹ 15 కోట్లతో నిర్మించిన వైద్య బాలికల వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, జెన్కో చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రకాష్, సర్పంచ్ రజిత, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ రావు, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు డా వెంకట రత్నం, సర్పంచులు, కౌన్సిలర్లు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
