👉 దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్..!
👉 అంబేద్కర్ విగ్రహానికి నివాళ్లు అర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందే విధంగా భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించారని అన్నారు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కును కల్పించి ఆ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక గొప్ప అవకాశాన్ని రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు కల్పించారని అన్నారు.
👉డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దేశంలోని బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ రాజ్యాంగం ద్వారా కల్పించి బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దారి చూపించారని అన్నారు.
👉 అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తనలాంటి వాళ్లు రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రి అయ్యే అవకాశం వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు, ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా 77వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
👉 ధర్మపురి పట్టణంలో…..

ధర్మపురి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం మండల ఉపాధ్యక్షులు ముడిమడుగుల శంకర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కేక్ కట్ చేసి రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం మరియు సామాజిక న్యాయం గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘాల రాష్ట్ర కార్యదర్శి పారపల్లి రాజమల్లయ్య , గౌరవ అధ్యక్షులు రాగుల కాంతన్న మాజీ మండల అధ్యక్షులు తారల కార్తీక్ ,అనంతుల లక్ష్మణ్ మొలుగూరి రమేష్ మాట్లాడుతూ….
భారతదేశానికి రాజ్యాంగం ఒక దిక్సూచి అని, దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించడమే రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కృషి, దూరదృష్టి వల్ల భారతదేశానికి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం లభించిందని పేర్కొన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు, తమ బాధ్యతలను కూడా గుర్తించాలని, కులమతాలకు అతీతంగా సమానత్వం మరియు సోదరభావంతో సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం కార్యదర్శి సిగీరి దాసు, అల్లూరి పవన్ కుమార్ నేతకాని సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గం రవీంధర్, దోనకొండ నరేష్ ,ఉప్పారపు రాయనరసు, కొమ్ము లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు.
