👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీరు వేరు..!
👉 అధికార ఆడంబరాలకు దూరం.. ప్రజాసేవకే పెద్దపీట..!
J.SURENDER KUMAR,
అధికారం వచ్చిందంటే చాలు.. హోదా, హంగులు, ఆర్భాటాలు, సన్మానాలు కోరుకునే ప్రజాప్రతినిధులు కనిపిస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో ఓ క్యాబినెట్ మంత్రి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తనను కలవడానికి వచ్చే వారు బొకేలు తీసుకురావద్దని, శాలువాలతో సన్మానించవద్దని ధర్మపురిలోని తన క్యాంపు కార్యాలయంలోనే బోర్డులు ఏర్పాటు చేయించారు. ఆయనే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్….
పూలబొకేలు కొన్ని గంటల్లో వాడిపోతాయి.. శాలువాలు కొద్దికాలానికే పక్కన పడతాయి.. కానీ ప్రజల కష్టకాలంలో అండగా నిలిచిన నాయకుడికి లభించే అభిమానం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. నిజమైన సన్మానం శాలువాతో కాదు.. ప్రజల హృదయాల్లో సంపాదించుకునే గౌరవంతోనే! ఇదే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన నిరాడంబరమైన ఆచరణ అమలు చేస్తున్నారు.


👉 పదవుల ఆడంబరం వద్దు.. ప్రజల ఆదరణే ముద్దు!
సాధారణంగా ప్రజాప్రతినిధులకు పుష్పగుచ్ఛాలు, శాలువాలు, పూలమాలలతో స్వాగతాలు పలకడం ఆనవాయితీగా మారింది. చిన్న స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి ఉన్నత పదవుల్లో ఉన్నవారి వరకు సన్మానాలు, స్వాగతాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవడం చూస్తుంటాం. కానీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం తన క్యాంపు కార్యాలయంలోనే ఆ సంప్రదాయానికి భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.
తనను కలవడానికి వచ్చే ప్రజలు పూలబొకేలు, శాలువాలు తీసుకురావద్దని, సన్మాన కార్యక్రమాలు నిర్వహించవద్దని స్పష్టమైన సందేశాన్ని బోర్డుల రూపంలో ఉంచారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి రావాలి తప్ప.. అనవసరమైన ఆడంబరాల కోసం సమయం, డబ్బు వెచ్చించకూడదన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.
👉 ఆలయ ప్రాంగణంలోనూ ప్రోటోకాల్‌కు పుల్‌స్టాప్.!
ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్రం లో స్థానికంగా ఉన్నప్పుడు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు అలవాటు. అయితే మంత్రి హోదాలో ఆలయానికి వెళ్లిన ప్రతిసారీ మంగళవాయిద్యాలు, పూర్ణకుంభ స్వాగతాలు, పూలమాలలు, శాలువాలతో సన్మానాలు నిర్వహించడాన్ని ఆయన ఇష్టపడలేదు.

తాను కూడా స్వామివారి సన్నిధిలో ఒక సాధారణ భక్తుడినేనని, తన రాకతో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఆలయ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. మంత్రి హోదాకు సంబంధించిన ప్రత్యేక మర్యాదలు, ప్రోటోకాల్ స్వాగతాలకు గతంలోనే పుల్‌స్టాప్ పెట్టించారు. హోదా ఎంత పెద్దదైనా.. దేవుడి ముందు అందరూ భక్తులే! అనే సందేశాన్ని తన ఆచరణ ద్వారా చాటిచెప్పారు.
👉 ఓటముల నుంచి మంత్రి పదవి వరకు.. పట్టుదలే పెట్టుబడి!
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజకీయ ప్రయాణం పూలబాట కాదు. 2009 నుంచి ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తూ పలుమార్లు ఓటములను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ పట్టుదల వీడలేదు. ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, నిరాశలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడకుండా తన ప్రయాణాన్ని కొనసాగించారు.
చివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఓటములతో కుంగిపోకుండా, అవకాశాల కోసం పార్టీ మారకుండా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం కూడా ప్రత్యేకంగా ప్రస్తావించదగినది.
👉 సామాన్యుడి సమస్యే ప్రథమ ప్రాధాన్యత..!
పదవులు శాశ్వతం కావు.. ప్రజలతో ఏర్పడిన అనుబంధమే శాశ్వతమనే భావనతో మంత్రి ముందుకు సాగుతున్నారని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. విద్యుత్ సమస్యలు, సాగునీరు, తాగునీరు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ముఖ్యమంత్రి సహాయనిధి, పేదలకు వైద్యసహాయం.. ఇలా నిత్యం సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
తన వద్దకు వచ్చే ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలను చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలని, సంబంధిత అధికారులకు తక్షణమే ఫోన్ చేసి సమస్యలను వివరించి పరిష్కారానికి చొరవ తీసుకోవడంలోనే తనకు నిజమైన సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు.
👉 ప్రజల రుణం తీర్చుకోవడమే నా లక్ష్యం!
జడ్పీటీసీగా, జడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాలం నుంచి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉన్నానని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని 140 గ్రామాల ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, విశ్వాసంతో భారీ మెజారిటీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, ప్రజల రుణం తీర్చుకోవడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
👉 పదవి ఒక బాధ్యత మాత్రమే…
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధికి లభించే పదవి ఒక బాధ్యత మాత్రమే. అది వ్యక్తిగత హోదాను ప్రదర్శించుకోవడానికి వచ్చిన అవకాశం కాదు. ప్రజల సమస్యలను వినడానికి, వారి కన్నీళ్లు తుడవడానికి, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి లభించిన అవకాశం.
ఒక క్యాబినెట్ మంత్రి తన కార్యాలయంలోనే బొకేలు, శాలువాలు వద్దని బోర్డు పెట్టించడం చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ దాని వెనుక ఉన్న ఆలోచన మాత్రం గొప్పది. ప్రజాధనాన్ని, ప్రజల సమయాన్ని అనవసర ఆడంబరాలకు వెచ్చించకుండా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశం ఇందులో దాగి ఉంది.
