అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు!

👉 రుద్రంగి మండల కేంద్రంలో ₹7 కోట్ల 07 లక్షలు, కోనరావుపేట మండలంలో కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి శంకుస్థాపన!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్, వయో వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

రుద్రంగి మండల కేంద్రంలో ₹7 కోట్ల 07 లక్షలు, కోనరావుపేట మండలం భూక్య రెడ్డి తండా లోని హనుమాన్ తండాలో కోటి రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి, అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్  శంకుస్థాపన చేశారు.

రుద్రంగి మెయిన్ రోడ్డు నుంచి కుక్కల గండి తండా కు ₹.4 కోట్ల 57 లక్షలతో రోడ్డు నిర్మాణనికి, ₹2 కోట్ల 50 లక్షలతో బీటీ రోడ్డు, హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి, జిల్లా కలెక్టర్ శంకుస్థాపన చేశారు.

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం గిరిజన శాఖ ద్వారా సుమారు ₹.740 కోట్ల నిధులు కేటాయించామని వెల్లడించారు.


👉 వేములవాడ నియోజకవర్గంలోని గిరిజన తండాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు సుమారు ₹100 కోట్ల నిధులు కేటాయించే దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.


👉 తొలివిడతలో సుమారు ₹ 40 కోట్లతో వివిధ గ్రామాలు, గిరిజన తండాల్లో రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. కథలాపూర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని, టెండర్ల ప్రక్రియ పూర్తయిన పనులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. రోడ్ల నిర్మాణ పనులను నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.


👉 గిరిజన తండాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.


👉 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ₹200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 కుటుంబాలకు ఒక్కో ఇంటికి ₹5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.


👉 రాబోయే రోజుల్లో మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు 2029 నాటికి మరింత మంది పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.


👉 అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.


👉 మహిళా సంఘాల ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ గురుకులాలు, హాస్టళ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు.


👉 వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.. ఆయన సూచనల మేరకు గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.గిరిజనులు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీల అభివృద్ధి, విద్య, మౌలిక సదుపాయాల కల్పనే ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీఎస్పీ శ్రీనివాసులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంగీత, తహసీల్దార్లు పుష్పలత, వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.