👉 గొల్లపల్లి మండలంలో 735 మందికి కొత్తగా ఆసరా చేయూత పెన్షన్ల పంపిణీ..!
👉 గ్రామాల వారీగా సమస్యలు గుర్తించి అభివృద్ధి పనులకు ప్రత్యేక కార్యాచరణ…!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!
J.SURENDER KUMAR,
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.గొల్లపల్లి మండలంలో నూతనంగా మంజూరైన 735 ఆసరా చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. గొల్లపల్లి మండలంలో గతంలో 9,336 మంది పెన్షన్లు పొందుతుండగా, తాజాగా మరో 735 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడంతో మొత్తం 10,071 కుటుంబాలకు చేయూత అందుతోందని పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన పెన్షన్లలో 339 మంది వితంతువులు, 143 మంది దివ్యాంగులు, 105 మంది కల్లుగీత కార్మికులు, 81 మంది ఒంటరి మహిళలు, 46 మంది ఫైలేరియా బాధితులు, 21 మంది చేనేత కార్మికులు ఉన్నారని వివరించారు.
అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఏవైనా కారణాలతో పెన్షన్ మంజూరు కానివారు నిరాశ చెందవద్దని, నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
👉 సంక్షేమ పథకాల అమలులో ముందడుగు..!
గతంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గొల్లపల్లి మండలంలో 2,457 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆయా కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
అదేవిధంగా మండలంలో 545 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి ₹5 లక్షల చొప్పున మొత్తం ₹27.25 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మిగిలిన బిల్లులు కూడా ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కళ్యాణలక్ష్మి పథకం కింద అర్హులైన 652 కుటుంబాలకు ₹.6.52 కోట్ల ఆర్థిక సహాయం అందించామని, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం సుమారు ₹69 లక్షలు ప్రభుత్వం భరించిందని వివరించారు. అలాగే 16 వేల కుటుంబాలకు ₹17 కోట్లకు పైగా పంట రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
👉 గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు..!
గొల్లపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే జనవరి నుంచి జూన్ 2వ తేదీ వరకు గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి రోడ్లు, డ్రైనేజీలు, గట్టు నిర్మాణాలు, సంఘ భవనాలు, పాఠశాలలు తదితర మౌలిక వసతుల అవసరాలను గుర్తిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సంబంధిత అధికారులు గ్రామాల్లోనే ప్రజలతో సమావేశమై అవసరమైన పనులకు ప్రణాళికలు రూపొందిస్తారని తెలిపారు.
రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడం, విద్యారంగ అభివృద్ధి, నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో నియోజకవర్గంలోని గ్రామాలకు అవసరమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
👉ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…..

అర్హులైన వారికి మరోసారి దరఖాస్తుల స్వీకరణ..!
గత ఏడాదిన్నర కాలంగా ప్రజావాణి కార్యక్రమంలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఫైలేరియా బాధితులు తదితర వర్గాలకు చెందిన వారు కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆరు కేటగిరీల్లో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించిన అనంతరం, ఎంపీడీఓ కార్యాలయం ద్వారా దరఖాస్తులు స్వీకరించి రెండు మూడు దశల్లో క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేసినట్లు వివరించారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,913 కొత్త పెన్షన్లు మంజూరు కాగా, ధర్మపురి నియోజకవర్గానికి 3,400 పెన్షన్లు కేటాయించినట్లు తెలిపారు. గొల్లపల్లి మండలంలో 735 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు.
అర్హత ఉన్నప్పటికీ ఏవైనా కారణాలతో పెన్షన్ పొందలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి మరోసారి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొత్తగా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు మంత్రి, కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రఘువరన్, స్థానిక ప్రజాప్రతినిధులు, తహసీల్దార్, ఎంపిడివో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
