👉 అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాలి !
👉 ప్రధానమంత్రి కి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి!
👉 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం!
J.SURENDER KUMAR,
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశామని, భూ నిర్వాసితులకు పరిహారాన్ని వేగంగా అందజేస్తున్నామని ప్రధానమంత్రికి వివరించారు.
👉 నరేంద్ర మోదీ తో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

👉 ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు +152 మీటర్ల వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
👉 మహారాష్ట్రలో ముంపునకు అవసరమైన పరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ సాగునీటి అవసరాల దృష్ట్యా తుమ్మిడిహెట్టికి మహారాష్ట్రను ఒప్పించాలని ముఖ్యమంత్రి కోరారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో తెలంగాణలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గ్రావిటీ ద్వారా నీటిని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
👉 డాక్టర్ ఎస్. జైపాల్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS), సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు (SSMP), డిండి ఎత్తిపోతల పథకం (DLIS) లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేసినా పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో తాగునీటి ప్రయోజనాలు అందడం లేదని ప్రధానమంత్రి కి వివరించారు.

👉 పర్యావరణ అనుమతుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చినందున ఏమాత్రం ఆలస్యం లేకుండా పర్యావరణ, ఇతర అనుమతులు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
👉 సాస్కి (Scheme for Special Assistance to States for Capital Investment) కింద తెలంగాణకు అదనంగా ₹5,000 కోట్లు మంజూరు చేయాలని సీఎం గారు కోరారు. తెలంగాణలో 70 నుంచి 90 శాతం మేర పూర్తయిన ప్రాజెక్టులకు ఈ నిధులు వినియోగించుకుంటామని చెప్పారు.

👉 ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిధులు మంజూరు చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ఫలితంగా రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు.
👉 సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి (CWC) సమర్పించామని ప్రధానమంత్రి గారికి తెలియజేశారు. ఈ ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూమి, గ్రామాల వివరాలను అంచనాకు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL), బ్యాక్ వాటర్ స్థాయి గుర్తింపుతో కూడిన సమగ్ర సర్వేకు ₹9.88 కోట్లు చెల్లించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

👉 ఛత్తీస్‌గఢ్‌కు భూ పరిహారం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (NOC) త్వరగా జారీ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
👉 ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) కింద ఇంటిగ్రేటెడ్ సమ్మక్క సాగర్ ప్రాజెక్టు-సీతారామ ఎత్తిపోతల పథకానికి ₹5,183 కోట్లు, మోడికుంట వాగుకు ₹.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ₹171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి ₹103 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
👉 హైదరాబాద్‌లో డిసెంబరు నెలలో నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026’ ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని నరేంద్ర మోదీ ని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందించడంతో పాటు యూత్ గేమ్స్ లోగో, మస్కట్‌ల గురించి వివరించారు.

👉 డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు యువ క్రీడాకారులకు ఇదొక చక్కని వేదిక కానుందని తెలిపారు.
👉 2002లో జాతీయ క్రీడలు, 2007లో ప్రపంచ మిలిటరీ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన చరిత్ర తెలంగాణకు ఉందని వివరించారు.
