ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి!


👉 లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాకూడదు !


👉 ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’ మీడియా కాంక్లేవ్‌లో…


👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!


J . SURENDER KUMAR,


లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాకూడదని, రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. కేవలం జనాభా ఆధారంగా 50 శాతం సీట్ల పెంపు చేపడితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.


👉 రాష్ట్రాల జీడీపీ, జనాభా రెండింటినీ పరిగణనలోకి తీసుకుని పునర్విభజన చేపట్టాలని సూచించారు. ఏబీపీ నెట్‌వర్క్ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’ మీడియా కాంక్లేవ్‌లో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.


👉 దేశాభివృద్ధిలో గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన నమూనా, గత నేతల దార్శనికతను ముఖ్యమంత్రి  ప్రస్తావించారు. ప్రతి పేదవాడి అభ్యున్నతే నిజమైన అభివృద్ధి అని మహాత్మా గాంధీ , జవహర్‌లాల్ నెహ్రూ  విశ్వసించారని గుర్తుచేశారు. నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అనేక విద్యాసంస్థలు, నీటిపారుదల ప్రాజెక్టులను ఏర్పాటు చేశారని తెలిపారు.


👉 మాజీ ప్రధాని పీవీ నరసింహారావు  ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, సరళీకృత ఆర్థిక విధానాలను మన్మోహన్ సింగ్  కొనసాగించిన తీరును ప్రస్తావిస్తూ, పేదల సంక్షేమం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా అని పేర్కొన్నారు.


👉 తెలంగాణను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలనే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి  తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న తన దార్శనికతను వెల్లడించారు.


👉 గడిచిన మూడేళ్లలో 65 శాతం కార్యక్రమాలను అమలు చేశామని, మిగిలిన వాటిని వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు కల్పిస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.


👉 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని ముఖ్యమంత్రి  తెలిపారు. రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లోనే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని గుర్తుచేశారు.


👉 ఇలాంటి కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగిందని వివరించారు. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కళాశాలలు దూరంగా ఉండటంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్న పరిస్థితిని అధిగమించేందుకు ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.


👉 విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆనంద్ మహీంద్రా  ఛైర్మన్‌షిప్‌లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, పాతకాలపు కోర్సులకు స్వస్తి పలికి ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) అభివృద్ధి చేస్తున్నామని ప్రస్తావించారు.


👉 ప్రపంచస్థాయి విద్యను తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయని వెల్లడించారు.


👉 విద్యతో పాటు క్రీడారంగ అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇస్తోందని, ఇందులో 8 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వెల్లడించారు.


👉 ఇప్పటికే ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చామని, పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోను కూడా రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మెస్సీ తన అభిమాన క్రీడాకారుడని, గతంలో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా కూడా తన అభిమాన ఆటగాడని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.