ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి వాటిని రక్షించాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి మంత్రి మొక్కలు నాటారు.


👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


👉 పర్యావరణం సమతుల్యంగా ఉంటే సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, రైతులకు మంచి దిగుబడులు లభిస్తాయని తెలిపారు. పర్యావరణ అసమతుల్యత కారణంగానే ప్రస్తుతం వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని అన్నారు.


👉 ప్రస్తుత తరంతో పాటు భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని పెంచి పెద్ద చెట్టుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.