👉 విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు !
👉 మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూ..!
J.SURENDER KUMAR,
విద్య ఒక్కటే పేదరికాన్ని నిర్మూలించి సమాజాన్ని జాగృతం చేస్తుంది అని తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధికి ప్రధాన సాధనంగా మార్చాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, విద్యారంగంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.
👉 “అభివృద్ధికి తొలి కొలమానం విద్య. విద్య ఒక్కటే పేదరికాన్ని నిర్మూలించి సమాజాన్ని జాగృతం చేస్తుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది” అని మంత్రి తెలిపారు.
👉 కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన “పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్”లో తెలంగాణ రాష్ట్రం పాఠశాల విద్యా రంగంలో గణనీయ పురోగతి సాధించడం ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

👉 విద్యారంగంలో తెలంగాణ మోడల్ దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ బాధ్యతలు చేపట్టి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారని మంత్రి తెలిపారు.
👉 తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, కొత్త ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్య, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, మౌలిక వసతుల అభివృద్ధి, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
👉 గత పదేళ్లలో విద్యారంగం ఎదుర్కొన్న సమస్యలను అధిగమిస్తూ పునర్నిర్మాణ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
👉 గురుకులాల విజయగాథ !
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 99.12 శాతం ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
మొత్తం 17,071 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 16,921 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. 40 ఏళ్ల గురుకులాల చరిత్రలో ఇదే అత్యధిక ఉత్తీర్ణత శాతమని పేర్కొన్నారు.
👉 “ప్రతిపక్షాల విమర్శలకు మా విద్యార్థుల ఫలితాలే సమాధానం. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుకులాలు నిలుస్తున్నాయి” అని ఆయన అన్నారు.
👉 విజయానికి కారణం ‘స్టూడెంట్ సెంట్రిక్’ విధానం !
ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, ప్రత్యేక స్టడీ అవర్స్, డౌట్ క్లారిఫికేషన్ సెషన్లు, వీక్లీ-మంత్లీ అసెస్‌మెంట్లు, రివిజన్ కార్యక్రమాలు, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ వంటి చర్యలు విజయానికి కారణమయ్యాయని మంత్రి వివరించారు.
“ఒక్క విద్యార్థి కూడా వెనుకబడకూడదు” అనే లక్ష్యంతో ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేశామని తెలిపారు.
ఫలితాల్లో రికార్డులు.
👉 99.12% ఫలితాలతో గురుకులాల ఘన విజయం”
235 సంస్థల్లో 163 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత
9 జిల్లాల్లో అన్ని గురుకులాల్లో 100 శాతం ఫలితాలు
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.22 శాతం ఉత్తీర్ణత
41 జూనియర్ కళాశాలల్లో 100 శాతం ఫలితాలు
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 77.79 శాతం ఉత్తీర్ణత
JEE మెయిన్స్‌లో 441 మంది అర్హత
35 మంది విద్యార్థులు 90 పర్సెంటైల్‌కు పైగా స్కోరు
పేద విద్యార్థుల భవిష్యత్తును మార్చే శక్తి కేంద్రాలు
గురుకులాలు కేవలం విద్యా సంస్థలు మాత్రమే కాకుండా సామాజిక మార్పుకు కేంద్రాలుగా మారాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు మెస్ ఛార్జీలు పెంచడం, వ్యక్తిగత పరిశుభ్రత కోసం కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం, ఆధునిక హాస్టళ్లు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీలు, క్రీడా వసతులు కల్పించడం వంటి చర్యలు ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.
👉 ఉపాధ్యాయుల అంకితభావమే బలం !
గురుకులాల విజయానికి ఉపాధ్యాయుల అంకితభావం ప్రధాన కారణమని మంత్రి ప్రశంసించారు.
“విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి 24 గంటలు అందుబాటులో ఉంటూ బోధన అందిస్తున్న ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి” అని అన్నారు.
👉 తల్లిదండ్రుల విశ్వాసం మరింత పెరిగింది !
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ పెరగడంతో తల్లిదండ్రుల విశ్వాసం మరింత బలపడిందన్నారు. ఈ ఏడాది అడ్మిషన్లు రికార్డు స్థాయిలో పెరగడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
👉 ఎస్సీ హాస్టళ్లలోనూ అద్భుత ఫలితాలు !
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాల్లో 95.11 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు.
8060 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 7666 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. రాష్ట్ర సగటుకు దాదాపు సమానంగా ఈ ఫలితాలు నమోదవడం విశేషమన్నారు.
👉 భవిష్యత్ లక్ష్యం !
“గురుకులాలను దేశంలోనే అత్యుత్తమ విద్యా నమూనాగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. పేదల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తూ ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
విద్యారంగంలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఆ దిశలో కీలక మైలురాయిగా నిలుస్తాయని ఇంటిని లక్ష్మణ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.
