👉 “పిల్లల చిరునవ్వే ప్రభుత్వానికి నిజమైన బహుమతి”
👉 ఆప్యాయంగా ముచ్చటిస్తూ ఆత్మీయతను పంచిన మంత్రి !
J.SURENDER KUMAR,
హైదరాబాద్‌లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో గురువారం హృదయాలను హత్తుకునే దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులతో కలిసి ఒకే వరుసలో కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. అధికారిక కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్థుల మధ్య కలిసిమెలిసి గడపడం ద్వారా ఆయన ఆప్యాయతను చాటుకున్నారు.

భోజనం చేస్తూనే విద్యార్థులతో సరదాగా మాట్లాడిన మంత్రి వారి చదువు, ఆరోగ్యం, హాస్టల్ వసతి, భోజనం నాణ్యత గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పిల్లలు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా విని, అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ……

ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం, మెరుగైన వసతి, ఉత్తమ అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగి, ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

మంత్రి విద్యార్థులతో కలిసి సాధారణంగా భోజనం చేయడం అక్కడి విద్యార్థుల్లో ఆనందాన్ని నింపగా, ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా ఈ ఆత్మీయ దృశ్యాన్ని అభినందించారు.
ప్రజాప్రతినిధి హోదాలోనే కాకుండా, ఒక కుటుంబ పెద్దలా విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకుంటూ వారితో గడిపిన మంత్రి లక్ష్మణ్ కుమార్ తీరు అందరినీ ఆకట్టుకుంది.
