👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగు నీటి సరఫరా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగు నీటి సరఫరాలో ఏకరూపత ఉండాలని చెప్పారు.
👉 రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో సమీక్ష నిర్వహించారు.
👉 ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొనడంతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న తాగునీటి వనరులను అనుసంధానించాలని చెప్పారు. ఏదైనా కారణాలతో ఒక సోర్స్ నుంచి నీరు సరఫరా కాకపోయినా మరో సోర్స్ నుంచి వచ్చే నీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అనుసంధానత ఉపయోగపడుతుందని అన్నారు.
👉 జీహెచ్ఎంసీ పరిధిలో అనేక సంవత్సరాలుగా పలు ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారని, ఇక ముందు ఆ పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయా ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
👉 ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాగునీటి సరఫరా పనులను ఏడాదిన్నరలోపు కచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు తేల్చిచెప్పారు. ఎస్టీపీల నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎస్టీపీల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటిని వేగంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని చెప్పారు.
👉 తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు, ఎస్టీపీల నిర్మాణ పనుల ప్రగతిపై ప్రతి నెల తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతి తెలుసుకునేందుకు వీలుగా డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు.
👉 రానున్న రోజుల్లో పరిశ్రమలు, వివిధ నిర్మాణ పనుల్లో గ్రే వాటర్ వాడేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. సమీక్షలో మున్సిపల్ వ్యవహారాల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయష్ రంజన్ , సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ , జల మండలి ఎండీ కె అశోక్ రెడ్డి , జేఎండీ మయాంక్ మిట్టల్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
