J.SURENDER KUMAR,
వియత్నాం పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు పర్యాటకులు అక్కడ బోటు ప్రమాదంలో మరణించారనే సమాచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.
👉 వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు వెళ్లిన భారతీయులు బోటు ప్రమాదంలో మరణించారన్న సమాచారంపై ముఖ్యమంత్రి ప్రమాద వివరాలను తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు వియత్నాంలోని భారతీయ ఎంబసీ కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారు.
👉 ఈ ప్రమాదంలో తెలుగువారు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందిన నేపథ్యంలో పూర్తి సమాచారం తీసుకోవాలని, ఈ ఘటనలో క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
👉 సంగీతాభిమానులకు తీరని లోటు !

ప్రముఖ గాయని ఎస్. జానకి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఆమె మృతి సంగీతాభిమానులకు తీరని లోటు అన్నారు.
👉 అనేక చిత్రాల్లో పాత్ర సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ పాడిన పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయని పేర్కొన్నారు. వారు తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.
👉 తెలుగు, తమిళం, హిందీతో పాటుగా మొత్తం 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్నారని గుర్తుచేశారు. జానకమ్మ మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ జానకి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
