👉 బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌కు గండి పడుతుందా..?
J.SURENDER KUMAR,
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ అనంతరం కల్వకుంట్ల కవిత ప్రకటించిన ‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)’ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
ఈ కొత్త పార్టీ ప్రభావం ప్రధానంగా ఎవరిపై పడుతుంది? గులాబీ పార్టీలో గుబులు మొదలైందా ? బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ? కాంగ్రెస్, బీజేపీలకు పరోక్షంగా లాభం చేకూరుతుందా ?
తెలంగాణలో కాంగ్రెస్‌కు తామే ఏకైక ప్రత్యామ్నాయం అని భావిస్తున్న బీజేపీకి, కవిత కొత్త ప్రాంతీయ పార్టీగా రంగంలోకి రావడం వల్ల పోటీ ఉండవచ్చు, క్షేత్రస్థాయిలో ఓట్లు అధిక శాతం చీలితే, బలమైన క్యాడర్ ఉన్న బీజేపీకి కొన్ని స్థానాల్లో ప్రయోజనం కలగవచ్చు.అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.
👉 రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం,…
కవిత పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ భావజాలంతో అనుబంధం ఉన్న క్యాడర్, పాత నాయకులు, ఉద్యమకారుల్లో కొంత మేర ప్రభావం చూపితే ప్రతిపక్ష ఓట్లు చీలే పరిస్థితి ఏర్పడవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదా బీజేపీకి పరోక్ష రాజకీయ ప్రయోజనం కలిగే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కవిత పార్టీ నేరుగా కాంగ్రెస్, లేదా బీజేపీలను గెలిపించకపోయినా, ప్రతిపక్ష ఓట్లను చీల్చడం ద్వారా ఏదో ఒక జాతీయ పార్టీకి పరోక్షంగా భారీ సహాయం చేయవచ్చు. కవిత పార్టీ కచ్చితంగా గెలవకపోయినా, పాత తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను టీఆర్ ఎస్ అనే పేరును వాడుకోవడం వల్ల బీఆర్ఎస్ సాంప్రదాయ ఓట్లు చీలిపోవడం ఖాయం.
హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్‌లపై ఆమె చేస్తున్న తీవ్ర విమర్శలు, బీఆర్ఎస్ అకౌంట్లలో ఉన్న ₹1,400 కోట్ల అవినీతి సొమ్ము అంటూ చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీ నైతికతను దెబ్బతీయడంతో పాటు అక్రమ సొమ్ముపై తక్షణమే విచారణ జరిపించి, ఆ నిధులను తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున పంపిణీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇది బీఆర్ఎస్ పతనానికి మరింత కారణం కావచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ రావుల హవా కొనసాగడంతో కవిత తనకు ఆ పార్టీలో స్థానం లేదనే భావన రావచ్చు అందుకే రాజీ పడకుండా తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ పంథాను ఏర్పరచుకోవడానికి ఆమె ఈ రిస్క్ తీసుకున్నారనేది చర్చ.
కవిత చీల్చే ఓట్లు రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా, బీజేపీ విజయాలను ప్రభావితం చేయగలవు. తద్వారా భవిష్యత్తులో ఏదైనా జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి లేదా ? కింగ్ మేకర్ అవ్వడానికి ఆమె ఈ వేదికను వాడుకునే అవకాశం ఉంది .
కవిత వేస్తున్న ఈ అడుగులు అత్యంత ప్రమాదకరమైన జూదం, ఇది ఆమె రాజకీయ భవిష్యత్తును పూర్తి ముంచేయవచ్చు లేదా ? బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఆమెను నిలబెట్టవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఇది బీఆర్ఎస్ ఉనికిని తీవ్రంగా దెబ్బతీసే చర్యగానే కనిపిస్తోంది అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
👉 ఒంటరి అవుతున్న కవిత ?
రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, కవిత చేస్తున్న తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆమెనే రాజకీయంగా మరింత ఒంటరిని చేస్తున్నాయి. కవిత నేరుగా కేటీఆర్ ప్రదీప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీతో క్విడ్ ప్రో కో (అవినీతి) ఒప్పందాలు చేసుకున్నారని, హరీష్ రావు ఆర్థిక స్వార్థపరుడని, బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ₹ 1,400 కోట్ల డబ్బు అవినీతి సొమ్మని ఆరోపించారు.
సొంత కుటుంబ రహస్యాలను, ఆర్థిక మూలాలను రోడ్డుపైకి లాగడం వల్ల తెలంగాణ ప్రజల్లో కవితపై సానుభూతి కంటే “కుటుంబ కలహాల” ముద్ర బలంగా పడుతోంది. కేసీఆర్ ఇమేజ్‌ను సొంత కూతురే డ్యామేజ్ చేయడం తో బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఆమెకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్, కేటీఆర్ కవిత ను తమకు రాజకీయ ముప్పుగా చూడటం లేదు కానీ, ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కుటుంబ ప్రతిష్టను, పార్టీ మూలాలను దెబ్బతీస్తున్నాయని భావిస్తూ ఆమెకు లీగల్‌గా రాజకీయ ప్రచారం ద్వారా కౌంటర్ ఇస్తున్నారు.
👉 సింగరేణిపైనే దృష్టి ఎందుకంటే ?
కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేనస (టీఆర్ ఎస్) తరఫున సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం వెనుక బలమైన రాజకీయ, ఆర్థిక వ్యూహాలు ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కవిత గతంలో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన టి బి జె కె ఎస్ ( తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం) గౌరవాధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేశారు.
సింగరేణి కార్మికులతో ఆమెకు పాత పరిచయాలు, బలమైన క్యాడర్ నెట్వర్క్ ఉన్నాయి. కొత్త పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే క్యాడర్ దొరకడం కష్టం కాబట్టి, తనకు పట్టున్న సింగరేణి ప్రాంతం నుంచే తన రాజకీయ పునరాగమనాన్ని ప్రారంభించాలని ఆమె భావిస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా (ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో) విస్తరించి ఉన్న బొగ్గు గనులు దాదాపు 12 నుండి 15 అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపోటములను నేరుగా శాసిస్తాయి.
సింగరేణి కార్మికులు వారి కుటుంబాల ఓట్లను తన వైపు తిప్పుకోగలిగితే, కొత్త పార్టీకి ఎన్నికల్లో తక్షణ గుర్తింపు, కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం లభిస్తుందని కవిత వ్యూహం. సింగరేణి ప్రాంతం గతంలో బీఆర్ఎస్‌కు అతిపెద్ద పెట్టని కోటగా ఉండేది. కానీ గత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయుసి గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. బీఆర్ఎస్ అక్కడ బలహీనపడిన తరుణాన్ని వాడుకుని, మిగిలి ఉన్న బీఆర్ఎస్ కార్మిక విభాగాన్ని తన వైపు తిప్పుకోవడం ద్వారా కేసీఆర్, కేటీఆర్ కు షాక్ ఇవ్వాలని కవిత భావిస్తున్నారు.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, సొంత ఇళ్ల స్థలాలు, కార్మికుల ఆరోగ్య సేవలు, మరియు లాభాల్లో బోనస్ వంటి అనేక పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, కార్మికుల పక్షాన నిలబడటం ద్వారా కవిత చాలా సులువుగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారు. దీనివల్ల ఆమెకు “కార్మిక పక్షపాతి” అనే ఇమేజ్ వస్తుంది.
కవితకు సింగరేణి అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఆమెకు రాజకీయంగా ఊపిరి పోయగల ఒక పొలిటికల్ లాంచ్ ప్యాడ్. అక్కడ విజయం సాధిస్తేనే ఆమె కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోగలదు.కవిత గతంలో టి బి జె కె ఎస్ సంఘానికి నాయకత్వం వహించడం వల్ల, సాధారణ కార్మికులు మరియు స్థానిక నాయకులతో ఆమెకు ఇప్పటికీ వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సహకరిస్తోందని కవిత విమర్శిస్తున్నారు. ఈ “ప్రైవేటీకరణ వ్యతిరేక” నినాదంతో అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ను ఒకేసారి డిఫెన్స్ లో పడేయడానికి సింగరేణి ఒక సరైన వేదికగా ఆమె ఎంచుకున్నారు.
👉 దీర్ఘకాలిక రాజకీయ మనుగడ వ్యూహాలు !
కల్వకుంట్ల కవితకు ప్రస్తుతం అధికారంలోకి రావడం, లేదా రాష్ట్రవ్యాప్త గుర్తింపు తెచ్చుకోవడం అసాధ్యమని తెలిసినప్పటికీ, ఆమె ఈ స్థాయిలో అడుగులు వేయడం వెనుక దీర్ఘకాలిక రాజకీయ మనుగడ వ్యూహాలు ఉన్నాయి అనేది చర్చ. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన తర్వాత ఆమె రాజకీయంగా పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది.
రాజకీయాల్లో నిశ్శబ్దంగా ఉంటే ప్రజలు, క్యాడర్ త్వరగా మర్చిపోతారు. నిరంతరం వార్తల్లో, ప్రజల్లో ఉండటం ద్వారా మాత్రమే తన రాజకీయ ఉనికిని కాపాడుకోగలనని ఆమెకు తెలుసు. అందుకే సాధ్యం కాదని తెలిసినా ఈ పోరాటాన్ని ఎంచుకున్నారు.
కవిత ఒంటరిగా మెజారిటీ సీట్లు గెలవలేకపోవచ్చు, కానీ సింగరేణి లేదా కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో 5% నుండి 10% ఓట్లను చీల్చగలిగితే, అది కాంగ్రెస్ లేదా బీజేపీల గెలుపోటములను శాసిస్తుంది. భవిష్యత్తులో ఏదైనా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేదా బీజేపీలకు కొన్ని స్థానాల్లో లబ్ధి చేకూర్చేలా తెరవెనుక ఒప్పందాలు చేసుకోవడానికి, లేదా తనపై ఉన్న లీగల్ కేసుల నుండి కొంత ఉపశమనం పొందడానికి ఈ ‘ఓట్ బ్యాంక్’ ఆమెకు ఓ బేరసారాల ఆయుధంగా మారుతుంది.
తాను ఎలాగూ అధికారంలోకి రాలేనని ఆమెకు స్పష్టత ఉంది. , తనను పక్కన పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వానికి నిద్రలేని రాత్రులు చూపించాలి అనే కసి ఆమె నిర్వహిస్తున్న మీడియా సమావేశాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
దిల్లీ లిక్కర్ స్కామ్ వంటి కేసుల నేపథ్యంలో, ఆమె ఇంట్లో కూర్చుంటే చట్టపరమైన చర్యలు సులువు అవుతాయి. అదే ఒక రాజకీయ పార్టీ పెట్టి, రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తుంటే, ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలు చేస్తోందని ప్రజల్లో సానుభూతి సంపాదించడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో “అధికారం సాధించడం” ఒక్కటే లక్ష్యం కాదు; కొన్నిసార్లు “ప్రత్యర్థిని ఓడించడం” లేదా “తమ ఉనికిని కాపాడుకోవడం” కూడా వ్యూహాలే. కవిత ప్రస్తుతానికి రెండో వ్యూహాన్నే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.
👉 అధికారానికి దూరం చేయాలని కావచ్చు ?
తనను పక్కన పెట్టిన బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులను రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీయడం, వారి ఓట్లను చీల్చడం ద్వారా వారిని కూడా అధికారానికి దూరం చేయాలనేది కల్వకుంట్ల కవిత ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ రానున్న ఎన్నికల్లో కాకపోయినా, భవిష్యత్తులో బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడితే, పాత టీఆర్ ఎస్ సెంటిమెంట్ ఉన్న క్యాడర్ అంతా తన వైపు వస్తారని, అప్పుడు తాను బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని కవిత ఆశిస్తున్నారు అనేది చర్చ..
