👉 డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
2034 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా తెలంగాణ ప్రయాణం ప్రారంభమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మించాలన్న సంకల్పానికి అమెజాన్ నెలకొల్పుతున్న డేటా సెంటర్ తొలి మెట్టుగా నిలుస్తుందని అభివర్ణించారు.
👉 అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న డేటా సెంటర్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు ఇతర ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
👉 దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన మోడల్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టడంలో అమెజాన్ భాగస్వామిగా నిలిచి 2034 నాటికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు.
👉 డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఏ దిశగా అయితే భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని సంకల్పించామో, అమెజాన్ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఈ ప్రాంతంలో రాబోయే పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా నిలుస్తుందని అన్నారు.
👉 “భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే ఫార్చూన్ 500 కంపెనీల పెట్టుబడులను ఆహ్వానించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 108 దేశాలకు చెందిన ప్రతినిధులు, 3 వేలకు పైగా కార్పొరేట్ దిగ్గజాలను ఆహ్వానించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఇక్కడ నిర్వహించాం.

👉 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదగాలన్నది మా కల. మా లక్ష్యం. దేశంలో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ ప్రస్తుతం దేశ జీడీపీకి 5 శాతం మేరకు తోడ్పాటును అందిస్తోందని, 2047 నాటికి 10 శాతం మేరకు అందించాలన్నది మా లక్ష్యం.
👉 లక్ష్యం నెరవేరాలంటే అందుకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగావకాశాల కల్పన అవసరం. ఆ దిశగా లక్ష్యాలను నిర్దేశించుకుని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాం. ఈ విజన్ రూపకల్పనలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.
👉 “పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించడానికి సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నాం. 2025 డిసెంబర్‌లో రూపొందించిన పాలసీ మేరకు ఇప్పుడు అమెజాన్‌కు భూమి కేటాయించి ప్రభుత్వం చెప్పింది చేస్తుంది. 2034 లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రయాణం మొదలైంది.
👉 వచ్చే 14 ఏండ్లలో 7 బిలియన్ డాలర్లను అమెజాన్ పెట్టుబడులు పెడుతోంది. ప్రభుత్వ సంకల్పం నెరవేరే దిశగా 1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలి. అందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా అమెజాన్‌కు సహకరిస్తుంది. ఏది కావాలన్నా సమకూర్చుతాం. పెట్టుబడులపై ప్రతి నెలా సమీక్షిస్తాను” అని హామీ ఇచ్చారు.
👉 “ఒక లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత పాలసీలో పెరాలసిస్ రాకూడదు. అందుకే పెట్టుబడుల కోసం స్పష్టమైన పాలసీలు తెచ్చాం. టూరిజం, మెడికల్, స్పోర్ట్స్ పాలసీలు తెచ్చాం. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోనే ఈ పాలసీలు తెచ్చాం. మా లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు, యంత్రాంగం కార్యోన్ముఖులై పనిచేస్తున్నారు. అమెజాన్ డేటా సెంటర్ తొలి మెట్టుగా పనిచేస్తుంది” అని చెప్పారు.
👉 “తెలంగాణ విజన్ మేరకు రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాం. ఓఆర్ఆర్ లోపలి భాగం హైదరాబాద్ మహానగరంలో 1.34 కోట్ల జనాభా జీనవ స్థితిగతులను మెరుగుపరచడానికి, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను బయటి ప్రాంతానికి తరలిస్తున్నాం.

👉 మూసీ నది ప్రక్షాళన చేపట్టాం. కాలుష్యాన్ని తగ్గించడానికి డీజిల్ ఇంధనంతో నడిచే 3 వేల ఆర్టీసీ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చుతున్నాం. నగరంలో డీజిల్‌తో నడుస్తున్న 2 లక్షల ఆటోలను రెట్రోఫిట్టింగ్ ద్వారా మార్చడమే కాకుండా ఈవీలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వానికి ఏటా ₹1500 కోట్లు ఆదాయం కోల్పోతున్నప్పటికీ ఈవీలకు జీరో టాక్స్ అమలు చేస్తున్నాం.
👉 కాలుష్యం, వరదల వంటి ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌కు అలాంటి దుస్థితి రాకూడదని ప్రణాళికలు సిద్ధం చేశాం. కోర్ అర్బన్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్‌గా, ఓఆర్ఆర్ అవతలి ప్రాంతం నుంచి రీజినల్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం పెరి అర్బన్ ఏరియాలో మాన్యుఫాక్చరింగ్ జోన్‌గా నిర్దేశించాం..” అని తెలిపారు.
👉 “ఈ ప్రాంతంలో అవసరాలకు తగినట్టుగా విద్యుత్, నీరు, భూమి, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేస్తే చైనాతో పోటీ పడటానికి వీలుగా మారుతుంది. రీజినల్ రింగ్ రోడ్డు బయటి ప్రాంతం రూరల్ అగ్రికల్చర్ ఎకానమీని వృద్ధి చేయాలని సంకల్పించాం. ఇది మా విజన్. మా కమిట్‌మెంట్. మా డ్రీమ్.
👉 మా విజన్ సాధనలో రైతుల త్యాగం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అభివృద్ధి కోసం భూములు ఇస్తున్న రైతులకు మరింత నష్టపరిహారాన్ని పెంచి గౌరవించాలి. వారికి మరింత భరోసా, వారిలో విశ్వాసం కల్పించాల్సి ఉంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.
👉 ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి , శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు రామకృష్ణా రావు, అమెజాన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
